టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు.
విలువైన సలహా
తాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు.
ఇవే జీవితంలో మధుర క్షణాలు
కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్‌లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.
లవ్‌స్టోరీ
తన లవ్‌స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్.
సీరియస్ కాదేమోనని అనుమానం
నావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్‌ను, నేను సీరియస్‌గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టాం అని శిరీష్ చెప్పుకొచ్చాడు.


