తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చేయి చాచి అడుగుతా
ఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్‌లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను.
వాళ్లందరికీ సినిమా అంకితం
తను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.


