కథాకళి
మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఆ పారిశ్రామికవాడలో ఓ నేషనలైజ్డ్ బేంక్ బ్రాంచ్ ఉంది. ప్రతినెలా ఏడవ తారీకున అక్కడి ఫేక్టరీ వర్కర్స్‌కి జీతాలు ఇస్తారు. ఆ జీతాల మొత్తం పదిహేడు లక్షల రూపాయలు. ఆరవ తారీకు సాయంత్రానికల్లా ఆ బ్రాంచ్‌కి సమీపంలోని మరో పెద్ద బ్రాంచ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు అందుతూంటాయి. కొంత కాలం ఓ ఫేక్టరీలో పనిచేసి, రాగి తీగల దొంగతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న అద్విక్‌కి అది తెలుసు. ఒకే ఆఖరి దొంగతనంలో దాన్ని సంపాదించి తన రాష్ట్రానికి పారిపోవాలనే నిశ్చయంతో అతను జైల్లో పరిచయమైన తన సహచరుడితో ఏడో తారీకు ఉదయం తొమ్మిదికి ఆ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. లోపల ఐదారుగురు కస్టమర్స్ ఉన్నారు.
అద్విక్ సహచరుడు సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాక్కున్నాడు. అద్విక్ కేష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోగా అద్దాల తలుపులోంచి జరిగేది చూసిన మేనేజర్ పోలీసులకి ఫోన్ చేసాడు.
తన సహచరుడు సిబ్బందిని, కస్టమర్స్‌ని తుపాకీతో కంట్రోల్ చేస్తూంటే, అద్విక్ తన నాటు రివాల్వర్‌తో బెదిరించి కేషియర్‌తో బేంక్ వాల్ట్‌లోని డబ్బు కట్టలని తనతో తెచ్చిన రెండు సూట్ కేసులలో నింపించాడు. అతను బయటికి రాగానే అతని సహచరుడు ఓ సూట్ కేస్‌ని అందుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న అద్విక్ తలుపు కొద్దిగా తెరచి చూస్తే ఎదురుగా పోలీస్ వేన్ ఆగటం కనిపించింది. వెంటనే తలుపు మూసి అరిచాడు.
‘‘పోలీసులకి ఎలా తెలిసింది? ఎవరు సమాచారం పంపారు?’’ ఎవరూ మాట్లాడలేదు. ‘‘సరే. పోలీసులని వెళ్ళిపొమ్మని ఓ హెచ్చరిక పంపాలి. ఆ హెచ్చరిక మీలోని ఒకరి శవం.’’ అద్విక్ క్రోధంగా చెప్పాడు. వెంటనే బేంక్ సిబ్బంది మొహాల్లో కనపడే భయం రెట్టింపైంది. ఎవరిని ఎన్నుకుంటాడు? ‘‘నువ్వు బయటికి రా.’’ నలభై ఏళ్ళ కేషియర్‌ని చూస్తూ ఆజ్ఞాపించాడు. అతను వణుకుతూ కేష్ కేబిన్ లోంచి బయటికి వచ్చాడు. రివాల్వర్ గొట్టాన్ని అతని ఛాతీకి ఆనించగానే ఓ లేడీ క్లర్క్ అరిచింది.
‘‘అతన్ని కాదు. నన్ను చంపు.’’
‘‘నీకు ప్రాణం మీద తీపి లేదా?’’ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన అద్విక్ సహచరుడు అడిగాడు. ‘‘చీమతో సహా ప్రతివారికీ అది ఉంటుంది. ఈయనకి నేను ఋణపడ్డాను. అది తీర్చే సమయం వచ్చింది.’’ ‘‘ఏం ఋణపడ్డావు?’’ అద్విక్ అడిగాడు. ‘‘మావారి కిడ్నీలు పాడయ్యాయి. ఎవరివీ మేచ్ కాలేదు. స్వచ్ఛందంగా ముందుకి వచ్చిన ఇతని టిష్యూస్ మేచ్ ఐతే తన కిడ్నీని దానం చేశాడు. ఇతని వల్లే మావారు జీవించారు కాబట్టి.’’ ‘‘ఈమెని బదులు నన్ను చంపు.’’
ఓ ముసలావిడ రివాల్వర్ బేరల్‌కి, ఆమెకి మధ్యకి వచ్చి చెప్పింది. అందరి దృష్టి ఆవిడ మీదకి మళ్ళింది. ఆవిడ చెప్పింది. ‘‘ఈమెకి ఇద్దరు పిల్లలు. వారికి ఈమె అవసరం ఉంది. నా అవసరం నా పిల్లలకి తీరింది. ఫైబ్రోసిస్ రోగంతో పోయే కంటే ఓ ప్రయోజనంతో పోవడం వల్ల మరణం పవిత్రం అవుతుంది.’’ ‘‘నిన్ను కాదు.
యువకులని చంపితే మాకు ఎదురు తిరిగేవాళ్ళు ఒక్కరైనా తగ్గుతారు.’’ సహచరుడు చెప్పాడు. ‘‘అవును. నువ్వు ఇటు రా.’’ దృఢంగా ఉన్న పాతికేళ్ళ యువకుడిని చూసి అద్విక్ ఆజ్ఞాపించాడు. అంతదాకా భయంతో ఏడుస్తూ నిలబడ్డ ఒకావిడ చెంగుతో కన్నీరు తుడుచుకుని అద్విక్ ముందు వచ్చి నిలబడి చెప్పింది. ‘‘అతన్ని కాదు. అతని బదులు నన్ను చంపు.’’
ఈసారి అందరి మొహాల్లో విస్మయం రెట్టింపైంది. ‘‘అతను నీ కొడుకా?’’ అద్విక్ అడిగాడు. ‘‘కాదు.’’ ఆ యువకుడు వెంటనే జవాబు చెప్పాడు. ‘‘మా అమ్మాయి పై చదువులకి జర్మనీకి వెళ్ళింది. అందుకయ్యే అన్ని ఖర్చులని ఇతనే భరిస్తున్నాడు. మాకు బంధువు కాదు. స్నేహం కూడా లేదు. నా అవసరం తెలుసుకుని ఇతనంతట ఇతనే మాకు డబ్బు సహాయం చేశాడు. మీరు ఇతన్ని మాత్రం చంపకండి.’’
వెంటనే బేంక్ మేనేజర్ అద్విక్ రివాల్వర్ గొట్టం ముందుకి వచ్చి నిలబడి చెప్పాడు. ‘‘మిస్టర్. నన్ను చంపు. వీళ్ళందరికన్నా నన్ను చంపితే అది పవిత్ర మరణం అవుతుంది.’’ మాట్లాడుతూంటే ఆయన కంఠం గద్గదమైంది. ‘‘నీ కథ ఏమిటి?’’ అద్విక్ ప్రశ్నించాడు. ‘‘వీళ్ళల్లోని మంచితనం నన్ను ప్రభావితం చేసింది. కరోనా సమయంలో నా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. అప్పటినుంచి నిస్సారంగా బతుకుతున్నాను. ఒంటరి బతుకు అర్థం లేనిదని అనుభవపూర్వకంగా గ్రహించాను. నన్ను చంపితే ఓ ఉద్యోగికి ప్రమోషన్ , ఓ నిరుద్యోగికి ఉద్యోగం, మరో మనిషికి ప్రాణాలు లభిస్తాయని అనిపించింది.’’
అంతా ఎదురుచూడని సంఘటన జరిగింది. వెంటనే అద్విక్ రివాల్వర్‌ని ఓ మూలకి విసిరేసి, పోలీసులకి లొంగిపోవడానికి తలుపు తెరచుకుని బయటికి నడిచాడు. అతని సహచరుడు కూడా బయటికి నడుస్తూ చెప్పాడు. ‘‘చిన్నప్పుడు ఆవు, పులి కథలో దూడకి పాలిచ్చి ఆవు తిరిగి రావటం విని, ఆవు తిరిగి రాలేదని అనుకునేవాడిని. కాదని నాకు ఇప్పుడు అర్థమైంది.’’ ఆ రోజు అక్కడ మంచితనం కార్చిచ్చులా వేగంగా పాకింది.


