breaking news
Malladi Venkatakrsna Murthy
-
భయం అంచులో...
కర్పూరవల్లి ఏర్ ఇండియా విమానం దిగి న్యూయార్క్ ఏర్పోర్ట్కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కేరసోల్ దగ్గరకి వెళ్ళింది.ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ సూట్‌కేస్ దగ్గరకి వచ్చి వాసన చూసి, ఓదాని మీద ముందు కాళ్లు ఉంచి నిల్చుంది. వెంటనే యూనిఫాంలోని సెక్యూరిటీ గార్డ్ తన జేబులోంచి ఏదో తీసి ఆ కుక్క నోటికి అందించి దాన్ని నిమిరాడు. ఆవిడ అతన్ని నవ్వుతూ చూస్తూ అడిగింది.‘‘నైస్ డాగ్. వాట్స్ హిజ్ నేమ్?’’‘‘ఈ రెండు సూట్‌కేసులు మీవేనా?’’ అతను కర్పూరవల్లిని అడిగాడు.‘‘అవును.’’‘‘మీ సూట్కేసులని మీరే పేక్ చేసారా?’’‘‘అవును. నేనే.’’‘‘ఈ సూట్‌కేసుల్లో ఏమేం ఉన్నాయో మీకు గుర్తుందా?’’ అతని తర్వాతి ప్రశ్న.‘‘ఉంది. నా బట్టలు, మందులు, బహుమతి వస్తువులు.’’‘‘మీరు నా వెంట రావాలి.’’ అతను ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి ఎడమ భుజం దగ్గరున్న వైర్లెస్ సెట్లో ఎవరికో ఏదో చెప్పాడు.కొద్ది క్షణాల్లో యూనిఫాంలోని ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ట్రాలీతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆవిడ సూట్‌కేసులను జాగ్రత్తగా ట్రాలీ మీదకి ఎక్కించి నడిచారు.‘‘నాతో రండి.’’ ఆ గార్డ్ ఆవిడతో చెప్పాడు.‘‘ఎందుకు?’’ ఆవిడ అతని వెంట నడుస్తూ అడిగింది.అతను ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ‘ఇ¯Œ స్పెక్షన్’ అని రాసున్న తలుపులోంచి లోపలికి తీసుకెళ్ళాడు.‘‘మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?’’ లోపల కూర్చున్న ఓ అధికారి ప్రశ్నించాడు.‘‘అవును.’’‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు?’’‘‘నా కూతురితో గడపడానికి. మీరీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’’ కర్పూరవల్లి ప్రశ్నించింది.అక్కడికి మరొక కుక్కని తెచ్చారు. అది కూడా సూట్‌కేసుల చుట్టూ తిరిగి ఇందాకటి సూట్‌కేస్ మీద ముందు కాళ్ళు పెట్టింది. దాని శిక్షకుడు కూడా దానికి బహుమతిగా తినడానికి డాగ్ బిస్కెట్ ఇచ్చి, దాన్ని దువ్వి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడింది.‘‘మీకు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థ మీద సానుభూతి ఉందా?’’ ఆ అధికారి ప్రశ్నించాడు.‘‘లేదు.’’ ఆవిడ తుళ్ళిపడి జవాబు చెప్పింది.గార్డ్ ఆవిడ హేండ్‌బేగ్‌ని తీసుకుని అందులోని వస్తువులన్నీ బల్ల మీద పోశాడు.‘‘ఈ సూట్‌కేస్‌లో మీరు ఏం తీసుకొస్తున్నారు? అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది. మా అంతట మేమే కనుక్కుంటే శిక్ష పెరుగుతుంది.’’ అధికారి చెప్పాడు.‘‘శిక్షా? బయటే ఉంటాడు. మా అల్లుడికి ఫోన్ చేస్తాను.’’ కర్పూరవల్లి భయంగా చెప్పింది.‘‘తర్వాత. నా ప్రశ్నకి జవాబు చెప్పండి.’’‘‘నేనే నిషిద్ధ వస్తువులు తీసుకురాలేదు.’’ ఆవిడ భయంగా చూస్తూ చెప్పింది.ఇద్దరు గార్డ్లు ఆ సూట్‌కేసులు తెరిచి ఒక్కొక్క సామాను బయటకి తీయసాగారు. ప్రతి డ్రెస్ లైనింగ్ తడిమి, లోపల ఏదైనా ఉంచి కుట్టారా అని తనిఖీ చేయసాగారు. కర్పూరవల్లి భయంగా, ఆశ్చర్యంగా జరిగేది చూస్తోంది.ఆవిడ మొబైల్ తీసుకుని పాస్వర్డ్ అడిగి తెరిచి, అందులోని కాంటాక్ట్ నంబర్లలోని వారి పేర్లు ఒకొక్కటీ అడిగి వారు ఏమవుతారు అని ప్రశ్నించాడు. అవన్నీ ఇండియాలోని పేర్లు. కొన్ని పేర్లు అతనికి నోరు తిరగలేదు కూడా. ఆవిడలో భయం అధికం అవసాగింది. వాళ్ళు వెతుకుతూంటే అధికారి ఆవిడని ప్రశ్నించసాగాడు.‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు? మీ అల్లుడు ఏం చేస్తూంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అమెరికాకి వచ్చారా? మీరు వచ్చిన పని ఏమిటి? ఇండియాలో ఏం చేస్తూంటారు?’’చివరికి ఆ పెట్టెలో వారు వెతికేది కనిపించింది. వెంటనే ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.‘‘వీటిని ఎందుకు కొన్నారు?’’ ఓ గార్డ్ ఒకటి తీసి చూపిస్తూ ప్రశ్నించాడు.‘‘బహుమతిగా కొన్నాను.’’‘‘ఎవరికి?’’‘‘మా అల్లుడికి. కిందటిసారి ఇండియా వచ్చినప్పుడు అతను తెచ్చినవి వాళ్ళ స్పాటీకి బాగా నచ్చాయట. వీటిని కొని తెమ్మని మెసేజ్ ఇచ్చాడు.’’వాళ్ళు ఆ పేకెట్స్ని విప్పి క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో డ్రగ్స్ గాని, పేలుడు పదార్థాలు కాని లేవని రూఢీ చేసుకున్నాక వివిధ జాతుల కుక్కల బొమ్మలున్న డాగ్ ఫుడ్ పాకెట్స్ చూపించి నవ్వుతూ చెప్పారు.‘‘వియార్ సారీ. చిన్న పొరపాటు. మా రెండు కుక్కలు తమ ఆహారాన్ని పసికట్టాయి. మేం ఇంకేదో అని ఊహించాం.’’వాళ్ళు బయటికి తీసిన వస్తువులని లోపల ఉంచి మూత మూస్తే అది మూసుకోలేదు. అది గమనించి ఆవిడ మళ్ళీ సర్ది ఒక గార్డ్ని కోరింది.‘‘మా వారు నాతో రాలేదు. దయచేసి మీరు దీని మీద నిల్చుంటే జిప్ వేస్తాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
సదారోగి..
అగ్నిలింగం నిక్ నేమ్ సదారోగి. ఆరోగ్య దృష్ట్యా ఆయన జాతకం మంచిది కాదు. చిన్నప్పుడే మలేరియా, టైఫాయిడ్, గవద బిళ్ళలు, కోరింత దగ్గు, ఇన్ ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, సన్నిపాత రోగం మొదలైన వాటి బారిన పడ్డాడు. పదహారో ఏటే అతనికి డయాబెటిస్ వచ్చింది. పెళ్ళయ్యాక చాలామందికి వచ్చే బ్లడ్ ప్రెషర్ కూడా పదిహేడో ఏటే వచ్చింది. బ్రహ్మచారిగా ఉండగా ఓరోజు స్టవ్ మీద వేడి గిన్నెలోని మరిగే చారుని పొట్ట మీద పోసుకున్నాడు. పొట్ట మీద కాబట్టి సరిపోయింది. అది మిగిల్చిన మచ్చ బయటికి కనిపించదు. అగ్నిలింగం తన రోగాల మీద తనే జోక్స్ వేసుకుంటాడు.‘‘ఉదయం నేను నా మందులన్నీ వేసుకున్నాక కడుపు నిండుతుంది. దాంతో మా ఆవిడ చేసే ఉప్మాని మాత్రలా మింగుతాను.’’‘‘రోగాల పేర్లు జర్మన్, గ్రీక్, లేటిన్ మొదలైన భాషల్లోంచి పుట్టాయి. ఏ రోగం పేరు ఏ భాషలోంచి వచ్చిందో నాకు తెలుసు. నాకు వచ్చిన ప్రతి రోగం స్పెల్లింగ్ నాకు వచ్చు. డాక్టర్లు నాకు ఫోన్ చేసి రోగాల స్పెల్లింగ్స్, ఏ రోగానికి ఏ మందు వాడాలో అడిగి తెలుసుకుంటుంటారు. నా మందుల వల్ల నాలో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందింది. ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలో నాకు జ్ఞాపకమే.’’అగ్నిలింగం పంతొమ్మిదో ఏట ఫుట్‌బాల్ ఆడుతూంటే కాలు విరిగింది. వయసులో ఉన్నాడు కాబట్టి అది అతుక్కుంది. ఇరవై ఒకటో ఏట వంశపారంపర్యంగా వచ్చిన మరో రోగం థైరాయిడ్. ముప్ఫైరెండో ఏట ఓ రొటీన్ కంటి పరీక్షలో గ్లకోమా కూడా బయటపడింది. మోకాళ్ళ నొప్పివల్ల అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో ఆర్థరైటిస్ బయటపడింది.అగ్నిలింగం ముప్ఫైరెండో ఏట రైల్లో పైబెర్త్ ఎక్కుతూంటే కుడి మోకాల్లోని నరం పట్టేసి గిలగిల్లాడిపోయాడు. అతనికి సయాటికా ఉందని డాక్టర్ చికిత్స ఆరంభించాడు. కామన్ కోల్డ్ ఐతే సరేసరి. లెక్కలేనన్ని సార్లు.‘‘జలుబు వెయ్యి రోగాలు పెట్టు అని ఎవరన్నారో కాని, అది నిజం కాదని వెయ్యి రోగాలున్న నేను తెలుసుకున్నాను.’’ చెప్పేవాడు.ఫారింజైటిస్, డెంగ్యూ ఫీవర్, మైగ్రేన్, అనేక ఎలర్జీలకి సంబంధించిన రేషెస్, గ్యాస్ట్రైటిస్, ఏసియాకి చెందిన దాదాపు అన్ని రకాల విష జ్వరాలు అతన్ని పలకరించాయి.అగ్నిలింగం క్షేమం కోరి తల్లిదండ్రులు బాల్యంలో అనేక యజ్ఞాలు చేశారు. మహా మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, అగ్నిహోత్రుడి హోమం, లక్ష గాయత్రి యజ్ఞం... అనేకసార్లు మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చినా, అగ్నిలింగం ఎన్నడూ ‘నాకే ఇన్ని రోగాలు ఎందుకు రావాలి?’ అనే నిరాశ మాటల్ని మాట్లాడలేదు. ఆశ్చర్యంగా అతను వ్యాధిగ్రస్తుడిగా కనపడడు. అతని మొహం ఆరోగ్యంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.ఆయనకి ఓరోజు భరించలేని గుండె నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అది గ్యాస్ వల్లని తెలిసింది. ఆయనకి చేసిన వైద్య పరీక్షల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. వాటిని సర్జరీ చేసి తీయడానికి కుదరక మందు రాసిచ్చారు.‘‘ఇది నాకు ఇంకో కలికితురాయి. వ్యాధులు నా అతిథులు. నిత్యం వాటికి ఆహారం, అంటే మందులు పెట్టి గౌరవిస్తుంటాను.’’ ఓ పెళ్ళిలో సరదాగా చెప్పాడు.ఆయన పక్షపాతం లేకుండా అన్ని రకాల మందుల్ని వాడుతూంటాడు. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యునాని, ఇంగ్లీష్ మందులు. ఆయనకి సరైన ఉద్యోగం మెడికల్ రెప్. కాని, బ్యాంక్‌లో చేరారు. నా అనుమానం, ఆయనకి జీతం కన్నా మెడికల్ ఇంబర్స్మెంట్కే ఎక్కువ చెల్లించి ఉంటుంది మా బ్యాంక్.మా స్టాఫ్‌లో ఎవరైనా నలతగా ఉంటే ఆయన సలహాలు తీసుకోవటం కద్దు.అలాంటి అగ్నిలింగం ఓ రోజు ఓ కస్టమర్‌తో మాట్లాడుతూండగా స్పృహతప్పి కింద పడబోయాడు. పక్కనే ఉన్న చీఫ్ కేషియర్, లేడీ క్లర్క్ ఆయన్ని పట్టుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి స్పృహలోలేని ఆయన్ని హాస్పిటల్‌కి చేర్చాం.అగ్నిలింగం ఆ డాక్టర్‌కి పాత ఖాతానే. వెంటనే ఎమర్జెన్సీ సెక్షన్ లోకి ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన హాస్పిటల్లోకి చేరేసరికి గుండె అతి బలహీనంగా కొట్టుకుంటోంది. హాస్పిటల్లో చేరిన నాలుగు గంటలకి డాక్టర్ విచారంగా చెప్పాడు.‘‘సారీ. గోల్డెన్ అవర్‌లో రాలేదు. అగ్నిలింగం ఈసారి హార్ట్ ఎటాక్ నించి సర్వైవ్ కాలేదు.’’ఆ రాత్రి ఏడుకి నా మొబైల్ మోగింది. అది అగ్నిలింగం మొబైల్ నించి! వాళ్ళ ఇంటి నించి ఏదో అవసరం వచ్చి నాకు ఫోన్ చేశారని అనుకుంటూ ఆన్సర్ చేశాను. అగ్నిలింగం కంఠం విని నేను నిర్ఘాంతపోయాను.‘‘అబ్బాయ్. నాకేం కాలేదని బేంక్‌లో అందరికీ చెప్పు.’’ఎవరైనా ఆయన కంఠాన్ని అనుకరించి నన్ను ఫూల్ చేస్తున్నారా అన్నది నాకు మొదట కలిగిన ఆలోచన.‘‘నేను చచ్చి బతికాను అబ్బాయ్.’’ నవ్వుతూ చెప్పాడు.‘‘ఎలా సర్?’’ ఆసక్తిగా అడిగాను.‘‘నా శవాన్ని, ఛ, నన్ను ఇంటికి తీసుకెళ్ళే అంబులెన్స్ రోడ్ మీద పెద్ద గుంటలో పడి లేచింది. దాంతో నా గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభమై నేను రివైవ్ అయ్యాను. వెంటనే మళ్ళీ నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు యాంజియోప్లాస్టీ చేసి, రికవరీ అయ్యాక డిశ్చార్జ్ చేస్తామన్నారు.’’‘‘అద్భుతం సర్! ఇది అద్భుతం!’’ చెప్పాను.‘‘అసలు అద్భుతం ఏమిటంటే, ఆ దెబ్బతో నా కిడ్నీ స్టోన్స్ కూడా ఆట్టే బాధ పెట్టకుండా యూరిన్ తో బయటికి వచ్చేశాయి.’’ ఆయన ఆనందంగా చెప్పాడు.కంకర తేలిన ఆ చెత్త రోడ్ కాంట్రాక్టర్ ఫొటోని అగ్నిలింగం భార్య వారి పూజా మందిరంలో ఉంచిందన్నది పోస్ట్ స్క్రిప్ట్. - మల్లాది వెంకట కృష్ణమూర్తి‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
కార్చిచ్చు
ఆ పారిశ్రామికవాడలో ఓ నేషనలైజ్డ్ బేంక్ బ్రాంచ్ ఉంది. ప్రతినెలా ఏడవ తారీకున అక్కడి ఫేక్టరీ వర్కర్స్‌కి జీతాలు ఇస్తారు. ఆ జీతాల మొత్తం పదిహేడు లక్షల రూపాయలు. ఆరవ తారీకు సాయంత్రానికల్లా ఆ బ్రాంచ్‌కి సమీపంలోని మరో పెద్ద బ్రాంచ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు అందుతూంటాయి. కొంత కాలం ఓ ఫేక్టరీలో పనిచేసి, రాగి తీగల దొంగతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న అద్విక్‌కి అది తెలుసు. ఒకే ఆఖరి దొంగతనంలో దాన్ని సంపాదించి తన రాష్ట్రానికి పారిపోవాలనే నిశ్చయంతో అతను జైల్లో పరిచయమైన తన సహచరుడితో ఏడో తారీకు ఉదయం తొమ్మిదికి ఆ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. లోపల ఐదారుగురు కస్టమర్స్ ఉన్నారు.అద్విక్ సహచరుడు సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాక్కున్నాడు. అద్విక్ కేష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోగా అద్దాల తలుపులోంచి జరిగేది చూసిన మేనేజర్ పోలీసులకి ఫోన్ చేసాడు.తన సహచరుడు సిబ్బందిని, కస్టమర్స్‌ని తుపాకీతో కంట్రోల్ చేస్తూంటే, అద్విక్ తన నాటు రివాల్వర్‌తో బెదిరించి కేషియర్తో బేంక్ వాల్ట్‌లోని డబ్బు కట్టలని తనతో తెచ్చిన రెండు సూట్ కేసులలో నింపించాడు. అతను బయటికి రాగానే అతని సహచరుడు ఓ సూట్ కేస్‌ని అందుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న అద్విక్ తలుపు కొద్దిగా తెరచి చూస్తే ఎదురుగా పోలీస్ వేన్ ఆగటం కనిపించింది. వెంటనే తలుపు మూసి అరిచాడు.‘‘పోలీసులకి ఎలా తెలిసింది? ఎవరు సమాచారం పంపారు?’’ ఎవరూ మాట్లాడలేదు. ‘‘సరే. పోలీసులని వెళ్ళిపొమ్మని ఓ హెచ్చరిక పంపాలి. ఆ హెచ్చరిక మీలోని ఒకరి శవం.’’ అద్విక్ క్రోధంగా చెప్పాడు. వెంటనే బేంక్ సిబ్బంది మొహాల్లో కనపడే భయం రెట్టింపైంది. ఎవరిని ఎన్నుకుంటాడు? ‘‘నువ్వు బయటికి రా.’’ నలభై ఏళ్ళ కేషియర్ని చూస్తూ ఆజ్ఞాపించాడు. అతను వణుకుతూ కేష్ కేబిన్ లోంచి బయటికి వచ్చాడు. రివాల్వర్ గొట్టాన్ని అతని ఛాతీకి ఆనించగానే ఓ లేడీ క్లర్క్ అరిచింది.‘‘అతన్ని కాదు. నన్ను చంపు.’’‘‘నీకు ప్రాణం మీద తీపి లేదా?’’ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన అద్విక్ సహచరుడు అడిగాడు. ‘‘చీమతో సహా ప్రతివారికీ అది ఉంటుంది. ఈయనకి నేను ఋణపడ్డాను. అది తీర్చే సమయం వచ్చింది.’’ ‘‘ఏం ఋణపడ్డావు?’’ అద్విక్ అడిగాడు. ‘‘మావారి కిడ్నీలు పాడయ్యాయి. ఎవరివీ మేచ్ కాలేదు. స్వచ్ఛందంగా ముందుకి వచ్చిన ఇతని టిష్యూస్ మేచ్ ఐతే తన కిడ్నీని దానం చేశాడు. ఇతని వల్లే మావారు జీవించారు కాబట్టి.’’ ‘‘ఈమెని బదులు నన్ను చంపు.’’ ఓ ముసలావిడ రివాల్వర్ బేరల్కి, ఆమెకి మధ్యకి వచ్చి చెప్పింది. అందరి దృష్టి ఆవిడ మీదకి మళ్ళింది. ఆవిడ చెప్పింది. ‘‘ఈమెకి ఇద్దరు పిల్లలు. వారికి ఈమె అవసరం ఉంది. నా అవసరం నా పిల్లలకి తీరింది. ఫైబ్రోసిస్ రోగంతో పోయే కంటే ఓ ప్రయోజనంతో పోవడం వల్ల మరణం పవిత్రం అవుతుంది.’’ ‘‘నిన్ను కాదు. యువకులని చంపితే మాకు ఎదురు తిరిగేవాళ్ళు ఒక్కరైనా తగ్గుతారు.’’ సహచరుడు చెప్పాడు. ‘‘అవును. నువ్వు ఇటు రా.’’ దృఢంగా ఉన్న పాతికేళ్ళ యువకుడిని చూసి అద్విక్ ఆజ్ఞాపించాడు. అంతదాకా భయంతో ఏడుస్తూ నిలబడ్డ ఒకావిడ చెంగుతో కన్నీరు తుడుచుకుని అద్విక్ ముందు వచ్చి నిలబడి చెప్పింది. ‘‘అతన్ని కాదు. అతని బదులు నన్ను చంపు.’’ఈసారి అందరి మొహాల్లో విస్మయం రెట్టింపైంది. ‘‘అతను నీ కొడుకా?’’ అద్విక్ అడిగాడు. ‘‘కాదు.’’ ఆ యువకుడు వెంటనే జవాబు చెప్పాడు. ‘‘మా అమ్మాయి పై చదువులకి జర్మనీకి వెళ్ళింది. అందుకయ్యే అన్ని ఖర్చులని ఇతనే భరిస్తున్నాడు. మాకు బంధువు కాదు. స్నేహం కూడా లేదు. నా అవసరం తెలుసుకుని ఇతనంతట ఇతనే మాకు డబ్బు సహాయం చేశాడు. మీరు ఇతన్ని మాత్రం చంపకండి.’’వెంటనే బేంక్ మేనేజర్ అద్విక్ రివాల్వర్ గొట్టం ముందుకి వచ్చి నిలబడి చెప్పాడు. ‘‘మిస్టర్. నన్ను చంపు. వీళ్ళందరికన్నా నన్ను చంపితే అది పవిత్ర మరణం అవుతుంది.’’ మాట్లాడుతూంటే ఆయన కంఠం గద్గదమైంది. ‘‘నీ కథ ఏమిటి?’’ అద్విక్ ప్రశ్నించాడు. ‘‘వీళ్ళల్లోని మంచితనం నన్ను ప్రభావితం చేసింది. కరోనా సమయంలో నా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. అప్పటినుంచి నిస్సారంగా బతుకుతున్నాను. ఒంటరి బతుకు అర్థం లేనిదని అనుభవపూర్వకంగా గ్రహించాను. నన్ను చంపితే ఓ ఉద్యోగికి ప్రమోషన్ , ఓ నిరుద్యోగికి ఉద్యోగం, మరో మనిషికి ప్రాణాలు లభిస్తాయని అనిపించింది.’’అంతా ఎదురుచూడని సంఘటన జరిగింది. వెంటనే అద్విక్ రివాల్వర్ని ఓ మూలకి విసిరేసి, పోలీసులకి లొంగిపోవడానికి తలుపు తెరచుకుని బయటికి నడిచాడు. అతని సహచరుడు కూడా బయటికి నడుస్తూ చెప్పాడు. ‘‘చిన్నప్పుడు ఆవు, పులి కథలో దూడకి పాలిచ్చి ఆవు తిరిగి రావటం విని, ఆవు తిరిగి రాలేదని అనుకునేవాడిని. కాదని నాకు ఇప్పుడు అర్థమైంది.’’ ఆ రోజు అక్కడ మంచితనం కార్చిచ్చులా వేగంగా పాకింది. -
త్రీమంకీస్ - 23
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 23 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘తీసుకురాను.’’ ‘‘నీకు నేను జీవితంలో ఏదైనా ఖర్చు చేస్తే అది ఇప్పుడే. ఇక్కడే. ఆలోచించుకో.’’ ‘‘యు ఆర్ ఏ చీట్’’ మర్కట్ ఉక్రోషంగా చెప్పాడు. ’’చూడు బాబ్జీ. నీది తర్టీఫైవ్ ఎంఎం మనసు. నాది సెవెంటీ ఎంఎం కన్నా వైడ్ స్క్రీన్ మనసు. దీన్ని బట్టే నాకు తెలిసిపోతోంది నీకు, నాకు జోడీ కుదరదని. వినలా?’’ ‘‘ఏమిటి?’’ ‘‘లవ్ త్రీ, సెలెక్ట్ టు అండ్ మేరీ ఒన్. నేను సెలెక్ట్ చేసుకున్న ఆ ఇద్దరిలో నువ్వు ఒకడివి. అబ్రకదబ్రా గాడితో థర్డ్ ఇయర్లో కటీఫ్ అయ్యాక నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నేను పెళ్ళి చేసుకునేది ఎన్నారైని. బై’’ ‘‘ఇంతకీ నువ్వా ఇడ్లీలు తిన్నావా?’’ వానర్ అడిగాడు. ‘‘అంతా బావుంది కాని, నువ్వా ఛీజ్ పీజాలు, చికెన్ బర్గర్ల గురించి చెప్పకుండా ఉండాల్సింది’’ కపీష్ తన ప్లేట్లోని పదార్ధాన్ని చూసుకుంటూ బాధగా చెప్పాడు. ‘‘రమ్యరాము చేసింది అన్యాయం’’ వానర్ కోపంగా చెప్పాడు. ‘‘నీ సంగతేమిటి? నువ్వూ ఎవర్నో ప్రేమించావు కదా?’’ మర్కట్ వానర్ని అడిగాడు. వానర్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘నేను ప్రేమించిన సీతా హరిహరన్ రమ్యరాము అంత ఇది కాదు. చిన్న పొరపాటు వల్ల మా మధ్య తేడా వచ్చేసింది.’’ ‘‘ఎవరి వైపు నించి పొరపాటు?’’ ‘‘ఆమె వైపు నించే.’’ ‘‘ఏమిటా పొరపాటు?’’ మర్కట్ అడిగాడు. ‘‘అసలు నీకు, ఆ పీతకి ఎలా పరిచయం అయింది?’’ కపీష్ నవ్వుతూ అడిగాడు. ‘‘నేను ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఆమెతో పరిచయం మొదలైంది.’’ ‘‘ఆమె నీకు ఫేస్బుక్ ద్వారా పరిచయమన్న మాట’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. ఎఫ్‌బిలో నేను అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆమె సహాయం చేయడానికి వచ్చినప్పుడు మాకు పరిచయం అయింది.’’ ‘‘అదేమిటి? ఫేస్బుక్ అకౌంట్‌ని ఎవరికి వారు ఓపెన్ చేసుకోవచ్చుగా? ఇంకొకరి సహాయం దేనికి?’’ కపీష్ ప్రశ్నించాడు. ‘‘నాకు అది అంత తేలిక కాలేదు.’’ వానర్ ఆనాటి అనుభవాన్ని చెప్తూంటే మిత్రులు ఇద్దరూ ఆసక్తిగా వినసాగారు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ దాకా వానర్‌కి ఆర్కుట్లో అకౌంట్ ఉండేది. కాని ఫేస్‌బుక్‌కి ప్రాచుర్యం లభిస్తూండటంతో, అందులో కూడా అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు. కాలేజీ లైబ్రరీకి వెళ్ళి ఉచిత కంప్యూటర్ని, ఉచిత ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఫేస్బుక్ ఓపెనింగ్ పేజీకి వెళ్ళాడు. పేరు, వయసు లాంటివన్నీ సక్రమంగా పూర్తి చేసాక ఆ పేజీ పాస్‌వర్డ్‌ని కోరింది. ఏం పాస్వర్డ్ పెట్టాలి అని ఆలోచనగా చుట్టూ చూస్తే లైబ్రేరియన్ కనపడింది. ఆమె మొహం ముడతలతో, ఉబ్బెత్తుగా కనిపించడంతో ‘కేబేజీ’ అని పాస్‌వర్డ్‌ని టైప్ చేశాడు. వెంటనే ఇలా వచ్చింది. సారీ! ది పాస్వర్డ్ మస్ట్బి మోర్ దేన్ ఎయిట్ కేరక్టర్స్. మరోసారి లైబ్రేరియన్ మొహాన్ని చూస్తూంటే, ఆవిడ అతని వంక చూసి నవ్వింది. వెంటనే ‘బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఒన్ న్యూమరికల్ కేరక్టర్ అని మళ్ళీ ఎర్ర అక్షరాల్లో కనపడింది. ఆవిడ వంక చూస్తే ముక్కు ఒకటి అంకెలా కనిపించడంతో ‘1 బాయిల్డ్ కేబేజి’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ కాన్ట్ హేవ్ బ్లేంక్ స్పేస్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. 50డేమ్న్డ్బాయిల్డ్కేబేజెస్’ అని టైప్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఎట్లీస్ట్ ఒన్ అప్పర్ కేస్ కేరక్టర్ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. ‘50డేమ్న్డ్బాయిల్డ్కేబేజెస్’లో డిఏఎమ్ఎన్ఇడిలని అప్పర్ కేస్‌లో టైప్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశాడు. ‘సారీ! ది పాస్వర్డ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ కేరక్టర్స్ కంటిన్యువస్లీ’ అని మళ్ళీ ఓ సూచన వచ్చింది. వానర్‌కి కోపం వచ్చింది. ఇలా టైప్ చేసి సబ్మిట్ చేశాడు. 50డి-ఏ-ఎమ్-ఎన్-ఇ-డిబాయిల్డ్కేబేజెస్విల్’ సారీ! ది పాస్వర్డ్ కెనాట్ కంటైన్ పంక్చువేషన్స్ అని మళ్ళీ వచ్చింది. ‘నౌ!50డిఏఎమ్ఎన్ఇడిబాయిల్డ్కేబేజెస్యుఫూల్’ అని టైప్ చేసి, రీసబ్మిట్ చేశాడు. సారీ! ది పాస్వర్డ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని కనిపించగానే వానర్‌కి పిచ్చెక్కిపోయింది. లేచి నిలబడి కీ బోర్డుని ఎత్తి నెత్తి మీద కొట్టుకోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో లోపలకి వచ్చిన సీతా హరిహరన్ అతని దగ్గరకి వచ్చి అడిగింది. ‘‘ఎక్స్‌క్యూజ్‌మి! మీ పనైతే నాకు ఓసారి కంప్యూటర్ని ఇస్తారా?’’ ‘‘కాలేదు.’’ ‘‘మరి?’’ ‘‘ఇదిగో. చివర్లో ఇది ఏడిపిస్తోంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటి? చివర్లో ఎవరు ఏడిపిస్తున్నారు?’’ ఆమె నవ్వుతూ అడిగింది. తన పాస్వర్డ్ భాగవతం వినిపించాడు. ‘‘మీరు కొంపతీసి ఇండస్ట్ట్రియల్ ప్రొడక్షన్ బ్రాంచా?’’ అడిగింది. (మన నేషనల్ బ్యాంకు ఏది? నేషనల్ పక్షి ఏది?)


