చిన్న వయసులో గాయనిగా గుర్తింపు
ప్రైవేటు ఆల్బమ్స్‌తో దూసుకుపోతున్న చింతకాయల అమిత
టీవీ షోల్లో విశేష ప్రతిభ సినిమా రంగం వైపు అడుగులు
విశాఖపట్నం: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా, చిన్న వయసులోనే తన పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది పీఎం పాలేనికి చెందిన చింతకాయల అమిత. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఈ యువ గాయని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే పలు టీవీ షోలలో పాల్గొని తన గాత్ర మాధుర్యాన్ని పరిచయం చేసింది. ఏ పాటనైనా అవలీలగా ఆలపిస్తూ, అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోంది.
తాత నుంచి వారసత్వంగా సంగీతం
అమిత తాతయ్య..పూర్ణ చంద్ర రావు ప్రముఖ సంగీత విద్వాంసులు, హార్మోనీ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే అమిత శ్రీకాకుళంలో గురువు దుర్గా ప్రసాద్ వద్ద సంగీతాన్ని నేర్చుకుని తన కళకు మెరుగులు దిద్దుకుంది. సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఐదో తరగతి చదువుతుండగా ఒక చానల్‌లో నిర్వహించిన ‘అమూల్ బోల్ బేబీ బోల్’ కార్యక్రమంలో పాల్గొని మొదటిసారిగా తన ప్రతిభను చాటుకుంది. ఆరో తరగతి చదువుతున్నప్పుడు మరో టీవీ చానల్‌లో నిర్వహించిన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. 2023లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ టీవీ షోలో ఫైనలిస్ట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ‘ఖడ్గం’ సినిమాలోని ‘అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే’ పాటకు స్టేజీపై పాడుతూ మంచి గుర్తింపు పొందింది.
మిలియన్ వ్యూస్‌తో దూకుడు
అమిత తాను పాడిన పాటలతో ఎందరినో ఆకట్టుకోవడమే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ తన ప్రతిభను మరింత చాటుకుంది. ‘విడలేని ప్రేమని’, ‘రాయే రాయే పిల్లా’, ‘ముద్దుముద్దు గుంటడే నా బావగాడు’ వంటి పాటలతో సోషల్ మీడియాలో సైతం తన అభిమానులను పెంచుకుంది. ఈ పాటలు ప్రతిదీ మిలియన్ వ్యూస్‌తో దూసుకుని పోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు ఆరేయ్’ చిత్రంలో పాటతో మరోసారి తన గాత్ర ప్రత్యేకతను చాటుకుంది.
సినిమాల్లో అవకాశం
ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించినట్లు అమిత తెలిపింది. తన తండ్రి అంబేడ్కర్, విజయనగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్, తల్లి గౌరి తనకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని పేర్కొంది. ఒకవైపు బీటెక్ చదువుతూనే, మరోవైపు పాటలు పాడుతూ, గ్రూప్స్‌లో ఉత్తీర్ణత సాధించడం తన లక్ష్యమని చెప్పింది. సినిమాల్లో అవకాశాలు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అమిత పేర్కొంది.


