సాక్షి, విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చట్టం ముందు అందరూ సమానమేనని.. అలాంటప్పుడు తన సస్పెన్షన్ విషయంలో జరిగింది అవతలివాళ్లకు కూడా వర్తించాలి కదా? అంటూ ఆయన ఓ సూటి ప్రశ్న సంధిస్తూ పోస్ట్ చేశారు.
మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కీ. రఘురామకృష్ణరాజు కస్టడీలో హింసకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు కూడా పిలిచారు. అయితే..

‘‘నన్ను సస్పెండ్ చేశారు మంచిదే. కానీ దర్యాప్తు న్యాయంగా జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి తొలగించాలి కదా. అని ఆయన పోస్ట్ చేశారు.

ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయని.. రఘురామకృష్ణరాజు పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను పదవుల నుండి తొలగించాలని.. తద్వారా చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ ఉంచారు.
ఇదీ చదవండి: ఫ్రాడ్ కేసులో రఘురామకు భారీ షాక్


