రూ.వందల కోట్ల రుణాల స్కామ్‌లో సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ కంపెనీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి లైన్ క్లియర్ చేసింది.
ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ 2022 సెపె్టంబర్ 30న తానిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అలాగే కేసులు నమోదు చేసే ముందు సీబీఐ తమకు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో నిందితులకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
ఇదీ జరిగింది..
రఘురామకృష్ణరాజు, ఆయన చైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఇన్‌ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు రూ.947.71 కోట్ల రుణం తీసుకున్నాయి. అలాగే పలు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కూడా రూ.826.17 కోట్ల రుణాలు తీసుకున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను రఘురామరాజు కంపెనీలు దారి మళ్లించాయి. ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు.
విచిత్రమేమిటంటే.. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లను మళ్లీ తనఖా పెట్టి, మరోసారి రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. మే 2012 నుంచి మే 2017 వరకు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రుణాల ఎగవేతపై, రఘురామకృష్ణరాజు మోసాలపై పలు ఆరి్థక సంస్థలు, బ్యాంకుల కన్సార్షియం 2019లో సీబీఐకి ఫిర్యాదు చేశాయి.
ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఫోర్జరీ పత్రాల సృష్టి, నిధులు స్వాహా చేయడం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 120బీ (కుట్ర), 420 (మోసం), 467, 468, 471 (ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. అటు తరువాత ఈ ఉత్తర్వులను 2021లో హైకోర్టు ఎత్తివేసింది.
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు..
హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రఘురామకృష్ణరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2022లో సుప్రీంకోర్టు ధర్మాసనం, రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
కాగా రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ.. తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని, తమకు వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఫ్రాడ్ డిక్లరేషన్ వల్లే ఎఫ్‌ఐఆర్ వచ్చిందని, కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్‌పై గానీ, ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలపై గానీ పిటిషనర్లకు అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించింది.
మాజీ ఎమ్మెల్సీ కేసులోనూ..
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఆయన కంపెనీల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై నమోదు చేసిన కేసు విషయంలో ముందుకెళ్లేందుకు సీబీఐ, బ్యాంకులకు అనుమతిచ్చింది. నారాయణరెడ్డి , ఆయన కంపెనీలు సైతం పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.500 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేశారు. దీనిపై పలు బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. దీంతో సీబీఐ నారాయణరెడ్డి, ఆయన కంపెనీలపై కేసులు నమోదు చేసింది.


