ఫేక్‌ సొసైటీతో భూకబ్జా కుట్ర | YS Jagan Condemns the demolition of the houses of poor in Vijayawada | Sakshi
Sakshi News home page

ఫేక్‌ సొసైటీతో భూకబ్జా కుట్ర

Dec 17 2025 4:03 AM | Updated on Dec 17 2025 4:03 AM

YS Jagan Condemns the demolition of the houses of poor in Vijayawada

విజయవాడలోని జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేత బాధితుల గోడు వింటున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

విజయవాడలో పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

సీబీఐతో విచారిస్తే నిజాలన్నీ బయటికొస్తాయ్‌

రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు 1981 డేట్‌తో 2016లో ఓ ఫేక్‌ సొసైటీ ఏర్పాటు

అప్పుడు కూడా బాబే సీఎం.. టీడీపీ ప్రభుత్వమే ఉంది

లోకేశ్‌, విజయవాడ ఎంపీ, జనసేన కార్పొరేటర్‌ సోదరుడి పాత్రపై విచారణ జరపాలి

25 ఏళ్లుగా పేదలు నివసిస్తున్న ఇళ్లను ధ్వంసం చేస్తారా?  

ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరఫున ఉందా?  

బాధితులు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్‌ను రెండు సార్లు కలిసి అర్జీలు ఇచ్చారు  

ఆ అర్జీలు తీసుకున్న వారే కుట్ర పన్ని అన్యాయం చేశారు

డిసెంబరు 31 వరకు బాధితులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది

ఒకవైపు ‘సుప్రీం’లో కేసు విచారణలో ఉన్నా కూల్చేస్తారా?

బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి, వారి బ్యాంకు రుణాలు తీర్చాలి

జోజినగర్‌ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతాం

బాధితుల న్యాయ పోరాటానికి మా పార్టీ తోడుగా ఉంటుంది

విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్‌లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్‌తో ఒక ఫేక్‌ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజినగర్‌లో ఏకంగా 42 మంది పేదల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయటాన్ని బట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోంది. ఇళ్ల కూల్చివేతపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. 

ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరపున ఉందా? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్‌ రెండు సార్లు కలిశారు. అర్జీలు ఇచ్చారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని వీళ్లకు అన్యాయం చేశారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్‌లో 42 మంది పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్‌ సోదరుడి ప్రమేయం ఉందన్నారు.

‘సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. జోజినగర్‌ బాధితుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి  ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు.

జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం జోజినగర్‌లో పర్యటించి ఇళ్లు కోల్పోవడంతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఏకపక్షంగా తమ ఇళ్లను కూల్చివేశారని, ఎంత ప్రాథేయపడినా ఆలకించకుండా ఈ ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. వారికి న్యాయం జరిగేవరకు తోడుగా నిలిచి పోరాడతామని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు..
విజయవాడ జోజినగర్‌లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఒక్కసారిగా వచ్చి ధ్వంసం చేశారు. ఈ స్థలం గురించి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆ 42 కుటుంబాలకు డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది.

ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే.. ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి ప్రైవేట్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.

ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా కూల్చివేశారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసి కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వారిని రోడ్డు పాల్జేశారు.

ఫేక్‌ సొసైటీ ఏర్పాటు..
ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంది. దీంతో దీంట్లోకి ప్రైవేట్‌ వ్యక్తులు వచ్చారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఓ ఫేక్‌ సొసైటీని పెట్టారు. 1981 డేట్‌తో ఒక తప్పుడు సొసైటీని ఏర్పాటు చేసి, రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు అడుగులు పడ్డాయి.

వీరంతా చంద్రబాబు సన్నిహితులు. నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్‌ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇంతమంది కలిశారు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందనేందుకు ఇది నిదర్శనం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే, డిసెంబర్‌ 31 వరకు వెసులుబాటు ఉన్నా కూడా..  200 మందికిపైగా పోలీసులు వచ్చి ఇంత మందిని రోడ్డు పాల్జేశారు.

ఈ స్థలాలు వేరేవారివైతే.. అనుమతులన్నీ ఎలా ఇచ్చారు?
ఈ 2.17 ఎకరాల స్థలంలో 2001కి ముందు నుంచి 25 ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. వాటికి విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌ కూడా ఇచ్చారు. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లకు ప్లాన్‌ అప్రూవల్‌ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి.

ఇక్కడున్న వారిలో చాలామంది రూ.20 లక్షలు, రూ.25 లక్షలకుపైగా లోన్లు కూడా తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే.. ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారు? బిల్డింగ్‌ ప్లాన్‌ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్‌ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు, అన్ని అనుమతులున్నా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, న్యాయం చేయాలని కనీసం ఆలోచన చేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి పొక్లెయిన్లు, బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఏకంగా బిల్డింగ్‌లు పగలగొట్టారు.

గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా, ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు, రూ.150 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ ఎంపీ, జనసేన కార్పొరేటర్‌ సోదరుడు.. ఇంతమంది కలిసి ఒక్కటై పేదలను నిస్సహాయులుగా రోడ్ల మీద నిలబెట్టించారు.

సీబీఐతో విచారణ జరిపించాలి..
ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంటర్‌ అవుతున్నారు. ల్యాండ్‌ కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి కబ్జా చేస్తున్నారు. వీరే నిషేధిత జాబితాలో ఆస్తులను బలవంతంగా చేరుస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్‌ సోదరుడు.. వీరంతా కలసి ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలియాలి.

ఇక్కడ 1981 డేట్‌ వేసి ఓ ఫేక్‌ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.

ప్రభుత్వమే లోన్లు చెల్లించాలి.. ఇళ్లు కూడా కట్టించాలి
ఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్‌ లోన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇళ్లు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్‌ రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ పక్కాగా ఇళ్లు కట్టించాలి.

ఇది మీ జగనన్న మాట..!
అయ్యా చంద్రబాబూ..! మీరు ఈ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇది మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నా. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైఎస్సార్‌ సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు  అందిస్తాం.

ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహూల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పోతిన మహేష్, పూనూరు గౌతంరెడ్డి, ఆసిఫ్, జోగి రాజీవ్, రామిరెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆడపిల్లలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చా 
మేం 2007లో ఇక్కడ 180 గజాల ప్లాట్‌ కొన్నాం. నా ఇద్దరు కుమార్తెలకు 2015లో పెళ్లిళ్లు చేశాం. ఆ ప్లాట్‌ను రెండు భాగాలు చేసి 2016లో నా కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చాను. ఇప్పుడేమో ఆ ప్లాట్‌ మాది కాదని రోడ్డుపాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లుళ్లు గొడవ చేస్తున్నారు. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాకు భరోసా ఇచ్చారు.– కోడెబోయిన కోటేశ్వరమ్మ

ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది  
మేం అందరం డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్న స్థలాలు కాదు ఇవి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మేం కొన్న స్థలాలు 25 తర్వాత మావి కాదంటే... మేం ఏమి చేయాలి? ఏమీ అర్థంకావడం లేదు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. అధికారులు బలవంతంగా మా ఇళ్లు కూల్చేశారు. ఉన్నపళంగా రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.– విజయలక్ష్మి

ప్రైవేట్‌ వ్యక్తులకు కొమ్ముకాసిన ప్రభుత్వం 
మేం ఎన్నో ఏళ్లపాటు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాసి మమ్మల్ని బజారున పడేసింది. ఇంత అడ్డగోలుగా మమ్మల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిన్నచూపని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వచ్చి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తామని, మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా ధైర్యం వచ్చింది.– కె.అరుణ

రూ.25 లక్షలు బ్యాంక్‌ రుణం ఎలా కట్టాలి?  
కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొన్నాం. కార్పొరేషన్‌ నుంచి ప్లాన్‌ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పుడేమో ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. మేం కొనుక్కున్న స్థలం మాదికాదంటున్నారు. బ్యాంక్‌ రుణం ఎలా కట్టాలి? మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులే మా ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ ఇచ్చారు. ఆ ఇంటికి పన్ను కట్టించుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు వచ్చి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మేం ఎలా బతకాలి?.– డి.స్రవంతి

ఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం  
సిటీలో స్థలం ఉంటే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాం. 25 ఏళ్ల కిందట సొంతూరులో ఉన్న ఎక­రం పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం. మొత్తం 42 ప్లాట్లు కొనుగోలుచేసివారు పేదలు. రోజువారీ పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్లు. మేం అంద­రం కలిసి ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని కాస్త అభివృద్ధి చేసుకున్నాం. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఆక్రమించినట్లుగా సొసైటీ పేరుతో అక్రమంగా మా స్థలాలను ఆక్రమించారు. ప్రశ్నిస్తే కోర్టు తీర్పు అంటూ బెదిరిస్తున్నారు.– సుబ్బులు

లీగల్‌ సపోర్ట్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా  
కోర్టు తీర్పులో ఇళ్లు కూల్చి 42 ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెలాఖరు వరకు కోర్టు గడువిచ్చింది. స్థానిక న్యాయస్థానాలు, హైకోర్టు ఇలా చాలాచోట్ల వాదోపవాదనలు జరిగాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బాధితుల తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించటానికి లీగర్‌ సపోర్ట్‌ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. – వి.స్వప్న, న్యాయవాది  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement