అనంతపురం టవర్‌క్లాక్: ‘నన్ను గెలకొద్దు..నువ్వే ఇబ్బంది పడతావ్’ అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బళ్లారికి వెళ్తూ.. మార్గ మధ్యంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లానని, ఆ మరుసటి రోజే తమ బంధువులపై దాడి జరిగిందన్నారు. అది ఎవరు చేశారు..ఎందుకు చేశారన్నది త్వరలోనే తేలుతుందన్నారు.
దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళితే.. తనపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కొంత మంది టీడీపీ నాయకులు కలిసి పచ్చ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేయిస్తూ వార్తలు రాయించారన్నారు. బీజేపీతో భాగస్వాములుగా ఉంటూ ఇలా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా కాలవ గెలుపు కోసం తన కుటుంబం పడిన శ్రమను గుర్తు చేశారు. పార్టీ మారుతున్నట్లు పదేపదే ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, తాను పార్టీ మారుతున్నట్లు ఎవరితోనైనా చెప్పానా అని ప్రశ్నించారు.


