breaking news
MLA kalava SRINIVASULU
-
‘నన్ను గెలకొద్దు..నువ్వే ఇబ్బంది పడతావ్’
అనంతపురం టవర్‌క్లాక్: ‘నన్ను గెలకొద్దు..నువ్వే ఇబ్బంది పడతావ్’ అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బళ్లారికి వెళ్తూ.. మార్గ మధ్యంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లానని, ఆ మరుసటి రోజే తమ బంధువులపై దాడి జరిగిందన్నారు. అది ఎవరు చేశారు..ఎందుకు చేశారన్నది త్వరలోనే తేలుతుందన్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళితే.. తనపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కొంత మంది టీడీపీ నాయకులు కలిసి పచ్చ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేయిస్తూ వార్తలు రాయించారన్నారు. బీజేపీతో భాగస్వాములుగా ఉంటూ ఇలా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా కాలవ గెలుపు కోసం తన కుటుంబం పడిన శ్రమను గుర్తు చేశారు. పార్టీ మారుతున్నట్లు పదేపదే ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, తాను పార్టీ మారుతున్నట్లు ఎవరితోనైనా చెప్పానా అని ప్రశ్నించారు. -
వనిత చదువు అవనికే వెలుగు
మంత్రి పరిటాల సునీత రాయదుర్గం : వనిత చదువు ఇంటికే కాక అవనికే వెలుగు నిస్తుందని మంత్రి పరిటాల సునీత అన్నారు. బాలికా విద్య - కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రాయదుర్గంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడాప్రాంగణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన చదువుల ఒడి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పరిటాల సునీత, అనంతపురం మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. బాలికలు విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు చొరవచూపాలన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర కరువు వల్ల పిల్లలను కూడా చదివించుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. బాలికలనైతే మధ్యలోనే చదువు మాన్పిస్తున్నారని, 2122 మంది బాలికలు బడిబయట ఉన్నారని తెలిసి బాధేసిందన్నారు. వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమమే చదువుల ఒడి (చిన్నారి తల్లికి బంగారు బాట) అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్యకోసం ‘చదువుల ఒడి’ చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు, డి.హీరేహాళ్ ఎంపీపీ పుష్పావతి, ఆర్డీఓ రామారావు, తహసీల్దార్ ఖాతిజున్ కుఫ్రా, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్, రాయదుర్గం, హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యులు విజయకుమార్, శారద, ఎంపీపీలు భారతి, ఫాతిమాబీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


