సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు..
.. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్‌కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది.
13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్‌లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు.
తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్‌పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్‌కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు.
వంద రూమ్‌ల ఒబెరాయ్ హోటల్‌తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?..
స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం!


