అనంతపురం కల్చరల్: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి.. ఆయన్ని గెంటేసి ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే అరాచకాలపై స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్‌పాత్‌పై ఆమరణదీక్షకు పూనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్చకుడు ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు.
రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. అయితే.. అర్ధరాత్రి అనంత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారి అరెస్ట్ చేశారు. బలవంతంగా జీజీహెచ్‌కు తరలించారు.
శ్రావణి ఆదేశాలతో సీఐ బెదిరింపులు
ఎమ్మెల్యే శ్రావణి ఆదేశాలతో పోలీసులు ఆలయ కబ్జాకు సహకరిస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. కాళ్లు విరగొడతానని పూజారి రమణాచారి ని శింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరించారని తెలుస్తోంది. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. గుప్త నిధుల కోసమే టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తల్లి లీలావతి ఈ దారుణానికి పాల్పడ్డారని అందులో ఆయన ఆరోపించడం ఉంది.
హిందూ సంఘాల మద్దతు..
మంగళవారం అయ్యప్ప మాలధారులు, వీహెచ్‌పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ మద్ధతు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. మంగళవారం అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఆలయాలకు భద్రత కరువు
రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు.
నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాషీ్టకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.


