సాక్షి, తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది.


మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గోవింద నామస్మరణ ఉండాల్సిన ప్రదేశంలో మద్యం, మాంసం ఎలా?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, నిత్యం మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం దర్శనమివ్వడం భక్తులలో ఆగ్రహం రేపుతూ, టీటీడీ విజిలెన్స్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


