దేవుడా... అలసిపోయావా? | Supreme Court on Banke Bihari Temple darshan timings | Sakshi
Sakshi News home page

దేవుడా... అలసిపోయావా?

Dec 16 2025 10:51 AM | Updated on Dec 16 2025 12:53 PM

Supreme Court on Banke Bihari Temple darshan timings

అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు  అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.

అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.

బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారు

ఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.

ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా.  అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. 

కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల  మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. 

తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.

ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.

:::ఆర్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement