ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..
అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి.
.
అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది.
.
ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే.
.
గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం.
.
సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.
::ఆర్‌ఎం


