ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.
ఔషధ మార్కెట్‌పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్‌లో టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్‌జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్‌లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి.
ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్‌లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్‌లైన్ విక్రయాలకు అనుమతించింది.
రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్‌లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్‌నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్‌నూ, ఇటు జెనరేషన్ జెడ్‌నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్‌లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.
– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు


