ఇల్లు, వంటిల్లు చేజారిపోకూడదు. ఇల్లు చేజారితే లోన్‌లు, ఈఎంఐల స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. వంటిల్లు చేజారితే ఫుడ్ డెలివరీ యాప్‌ల పాలౌతుంది. ఇల్లు అదుపు తప్పితే అప్పులు, వంటిల్లు ఆర్డర్ తప్పితే అనారోగ్యాలు! సభ కూడా చేజారినట్లే నాకు అనిపిస్తోంది. సమావేశాలు 1న మొదలయ్యాయి. 19న ముగుస్తున్నాయి.
భారత రాజ్యాంగంలోని అధికరణాలు, ఆదేశిక సూత్రాలతో పని లేకుండా శీతకాలం వచ్చి వెళ్లినట్లుగానే సమావేశాలూ ఒక రుతువులా మాత్రమే ప్రారంభమై ఒక రుతువులా మాత్రమే పూర్తయ్యే కాలం వచ్చేసిందా?! సెషన్స్ ఇంకో 5 రోజులే ఉన్నాయి. బిల్లులు ఇంకా 10 పెండింగులో ఉన్నాయి. 150 ఏళ్ల వందేమాతరం, ఎస్‌ఐఆర్, ఈవీఎంలు... ఈ మూడే, సభలో రెండు వారాలుగా డిబేట్‌లు!
బంకిం ఛటర్జీని ప్రధాని ‘‘బంకిం దా’’ అనటం అహంకారం తప్ప మరొకటి కాదని తృణమూల్ ఎంపీలు! బెంగాల్లో అందరూ గౌరవంగా ‘బంకిం బాబు’ అంటారు కనుక ప్రధాని కూడా ‘బంకిం బాబు’ అనే అనాలని వాళ్ల పట్టు. మొత్తానికి ప్రధాని చేత ‘బంకిం బాబు’ అనిపించారు.
ఒక సభ్యుడు ‘వందే మాతరం’ అనబోయి రెండుసార్లు ‘వందే భారత్’ అన్నారు. ‘‘మాట్లాడే ముందు నాలుగో తరగతి హిస్టరీ టెక్స్›్ట బుక్ ఒకసారి చూసుకొని రావాలి’’ అని వెక్కిరింపులు! నోరు జారటం, మాట జారటం ఒకటేనా?! మనసులో ఉన్నదే నోట్లోంచి వస్తుంది. మాటగా జారింది మనసు లోనిది ఎలా అవుతుంది?!
మాట తడబాట్లను కూడా నవ్వుతూ తీసుకోలేనంత సీరియస్‌గా అయిపోతు న్నామా... చలిలో బిగుసుకుపోయినట్లు, మంచులో కూరుకుపోయినట్లు. సెషన్స్‌లో నేనూ ఒకర్ని హర్ట్ చేయవలసి వచ్చింది! వ్యవసాయ మంత్రి ప్రసంగిస్తుంటే, సభలో ఒక సభ్యుడు ‘లంచ్’ చేస్తూ నాకు కనిపించారు.
‘‘ఇక్కడ ఈటింగ్ ప్రోగ్రామ్ పెట్టకండి. ప్లేట్లు తీసేయండి’’ అని కాస్త హార్ష్ గానే అన్నాను. నిబంధనలు ఎలా ఉన్నా, నేనే కాస్త సౌమ్యంగా చెప్పి ఉండవలసిందా! లంచ్ టైమ్‌లో లంచ్, డిబేట్ టైమ్‌లో డిబేట్, క్వొశ్చన్ అవర్‌లో క్వొశ్చన్స్ ఉండాల్సిందే. కొన్నిసార్లు లంచ్ టైమ్‌లోకి డిబేట్ టైమ్ వచ్చేసి, డిబేట్ టైమ్‌లోకి లంచ్ టైమ్ చొరబడుతుంది.
సభలో ఆ సభ్యుడు లంచ్ చేయటం కన్నా, సభలో ఆ సభ్యుడిని అందరి ముందూ ‘‘తినటం ఆపేయండి’’ అని నేను అనటమే సభా మర్యాదను తప్పినట్లుగా అనిపించింది నా మనసుకు. శుక్రవారం సెషన్స్‌లో ఒక సభ్యుడు హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ‘‘మాననీయ్ అధ్య„Š మహోదయ్...’’ అని ఆగారు!
‘‘చెప్పండి’’ అన్నాను.
‘‘మాననీయ్ అధ్యక్ష్ మహోదయ్... 2019 లోనే భారత ప్రభుత్వం ఇ–సిగరెట్‌లను బ్యాన్ చేసింది కదా!’’ అన్నారు ఆ సభ్యుడు. ‘‘ఆ... చేసింది’’ అన్నాను. ‘‘భారత ప్రభుత్వం బ్యా¯Œ చేసినప్పటికీ సభలో ఇ–సిగరెట్‌లు తాగటానికి మీరు గానీ అనుమతి ఇచ్చారా?’’ అని ఆయన ప్రశ్న! ‘‘ఇవ్వలేదు కానీ, మీరు విషయం చెప్పండి’’ అన్నాను.
‘‘సభ లోపల టీఎంసీ సభ్యులు కొందరు ప్రతిరోజూ ఇ–సిగరెట్ తాగుతున్నారు. వెంటనే వారిని తనిఖీ చేయించండి’’ అని ఆదేశం! నేను నవ్వాపుకోలేనంతగా నన్ను ఆదేశించారు ఆ సభ్యుడు! స్పీకర్‌నే సభ్యులు ఆదేశిస్తున్నారంటే, స్పీకర్‌ని పక్కన పెట్టేసి సభ్యులే డిబేట్‌లు పెట్టేసుకుంటూ సభలో రౌండ్‌లు కొట్టేస్తున్నారంటే... సభ కూడా చేజారిన ఇల్లుగానో, వంటిల్లుగానో అయిపోతోందా?! ‘హౌస్’ కాస్తా ‘హోమ్’గా మారిపోతోందా?! - మాధవ్ శింగరాజు


