నేను 1983లో నాగార్జున సాగర్‌లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్‌కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.
అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్‌లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్‌కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి.
ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్‌లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు.
ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు.
చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్‌కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్‌గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం.
ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్‌లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్‌లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.
ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్‌లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.
– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు)


