విశ్లేషణ
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్‌వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్‌పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.
రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు.
రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.
ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.
చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్‌లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది.
లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్‌లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.
సు–27 సోవియట్ యూనియన్‌లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్‌లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.
భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్‌ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్‌గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం.
ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్‌ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్‌ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.
ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.
మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి.

సి. ఉదయ భాస్కర్,
వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు,
సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్


