విశ్లేషణ
గట్టిగా బెట్టు చేసిన తర్వాత, ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ ఓటర్ల జాబితాల ప్రత్యేక సునిశిత సవరణ (సర్)పై నెలకొన్న వివాదం పరిష్కార మయ్యేందుకు ఇది తోడ్పడుతుందా? అసాధారణమైన రీతిలో సర్ నిర్వహించా లని భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ) గైకొన్న నిర్ణయం అత్యంత వివాదాస్పద మైన నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుంది. ‘లొసుగులు లేని’ ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నామని కమి షన్ చెప్పుకుంటూంటే, ఇది చాలామంది ఓటు హక్కును కాల రాసేదిగా తయారైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
సంస్కరణలకు ముందున్న పార్లమెంట్
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల తర్వాత ముఖ్యమైన భాగస్వా ములైన రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో ముందు నిలిచిన సందర్భాలు అరుదు. సుప్రీం కోర్టు ముందుకు నెట్టిన సందర్భాలలో తప్పించి, ప్రభుత్వాలు కూడా సంస్కరణలకు విముఖంగానే ఉంటూ వస్తున్నాయి. పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లు చేసేందుకు, సాంకేతిక ప్రగతిని వాడుకునేందుకు, నేరస్థులు పోటీ చేయకుండా అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు, ఎన్నికల ప్రచారంలో నడచుకోవాల్సిన తీరును మెరుగుపరచేందుకు గణనీయమైన సంస్కరణలు తీసుకురావడంలో పార్లమెంట్ ముఖ్య భూమిక వహించింది. ఓటు హక్కు వినియోగించుకునే వయో పరిమితిని 1988లో 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకు తగ్గించారు. తర్వాత, 2021లో అర్హత గడించుకునే తేదీలను పెంచారు. వయోజనులు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, తదుపరి ఏడాది జనవరి 1 వరకు వేచి చూడన వసరం లేకుండా– జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల మొదటి తేదీలలో కూడా తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని మంచి మార్పు తెచ్చారు. అలాగే, 1993లో ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను వినియోగించ డాన్ని 1998లో దశల వారీగా మొదలుపెట్టి, అవి సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసేందుకు, ‘ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్’ (వీవీప్యాట్)లను 2019లో తప్పనిసరి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం పుణ్యమా అని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పూర్వాపరాలను వెల్లడించడం 2003 నుంచి మొదలైంది. దోషులుగా తేలిన లెజిస్లేటర్లను, లిల్లీ థామస్ కేసు పర్యవసానంగా, వెంటనే అనర్హులుగా చేయడం 2013లో మొదలైంది. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకున్నా లేదా పెద్ద యెత్తున హింస చోటు చేసుకున్నా పోలింగ్‌ను వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారాన్ని పార్లమెంట్ 1989లో ఎన్నికల కమిషన్‌కు కట్టబెట్టింది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతోనే ఎన్నికల కమిషన్, పార్లమెంట్, సుప్రీం కోర్టు ఆ యా సంస్కరణలు తెచ్చాయి.
అవసరమైన సంస్కరణలు
ఎగువ పేర్కొన్న శాసనపరమైన మార్పులు తెచ్చినప్పటికీ, పెండింగ్‌లో ఉన్న సంస్కరణల జాబితా పెద్దదే. అభ్యర్థులను అనర్హు లుగా ప్రకటించడానికి సంబంధించిన చట్టాన్ని మరింత కఠినతరం చేయడం నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ప్రత్యా మ్నాయ పద్ధతులను రూపొందించడం, ఎన్నికల ప్రచార ఖర్చులపై ఒక పరిమితి విధించడం వరకు చాలానే ఉన్నాయి. రాజకీయ పార్టీల లీగల్ స్టేటస్‌పై స్పష్టత లోపించడం ఇప్పటికీ ఆందోళనకర అంశమే. రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. కీలకమైన ఈ అంశాలను పక్కన పెట్టేసి, ‘సంస్కరణలన్నింటికీ’ తల్లిగా చెబుతున్న ‘ఒక దేశం – ఒకే ఎన్నిక’పై చర్చించడంలో పార్లమెంట్ చొరవను ప్రదర్శించింది.
‘సర్’పై ఆవేశకావేషాలను చల్లార్చవలసిన బాధ్యత కమిషన్ పైనే ఉంది. తమ ఓటు హక్కును తొలగిస్తున్నారని కొందరు అంటూంటే, దానికి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయ వలసి రావడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది పోలింగ్ కేంద్ర స్థాయి (బీఎల్వో) అధికారులు చనిపోయినట్లు చెబుతున్న అంశం తోడవు తోంది. కమిషన్ కున్న నిష్పాక్షిక ప్రతిష్ఠను సవరణ తతంగం మసక బారేటట్లు చేసింది. సాఫీగా, శాంతియుతంగా నిర్వహించదగిన ఓటర్ల జాబితా సవరణను, అనర్హత రాక్షసిపై యుద్ధంగా మార్చినందుకు కమిషన్ నిందను స్వీకరించవలసిన అవసరం లేదా?
బిహార్‌లో ఏం సాధించినట్టు?
బిహార్‌లో తుది ఓటర్ల జాబితాను లోపాలు లేకుండా మెరుగు పరచడం ద్వారా గడించిన ప్రస్ఫుట ప్రయోజనాలు ఏమిటో కమి షన్ తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకుని, ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అది గతంలో డూప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను విజయవంతంగా వినియోగించుకుంది. ఇపుడు దాన్ని ఉపయోగించి అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలి. తద్వారా, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, వారి పేర్లను జాబితాల నుంచి తొలగించవచ్చు. కానీ అది ఆ సాఫ్ట్‌వేర్‌ను పక్కన పెట్టడానికి గల కారణం తెలియడం లేదు.
‘‘డూప్లికేషన్‌ను నివారించేందుకు ఒకే ఒక్క సేకరణ ఫారాన్ని’’ మనఃసాక్షి ననుసరించి సమర్పించవలసిందిగా ఓటర్లను కోరడంపై అది ఆధారపడుతోంది. తాను ఎప్పుడూ అనుసరించే సాధారణ సవరణ విధానాల ప్రకారం కాకుండా, దేశవ్యాప్తంగా సునిశిత సవరణ ద్వారా తాను ఏం సాధించదలచుకున్నదీ కమిషన్ స్పష్టంగా వివరించి తీరాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ‘అర్హత లేని’ ఓటరును వెతికి పట్టు కునేందుకు ఇపుడు ఉన్న ఓటర్లు అందరినీ హాజరు పరచి తనిఖీ చేసే వ్యామోహాన్ని కమిషన్ వదులుకోవాలి. బిహార్‌లో సునిశిత సవరణ ద్వారా అది ఆ పని చేయలేకపోయింది.
ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని తిరిగి గడించుకోవడంలో పార్లమెంట్‌లో జరిగే చర్చ కమిషన్‌కు ప్రేరణ నిస్తుందని ఆశిద్దాం. పార్లమెంట్ లేదా సుప్రీం కోర్టు మాదిరిగానే ఎన్నికల కమిషన్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది తన తలుపులను తెరచి ఉంచితే జనం ఇతర సంస్థల తలుపులు తట్టాల్సిన అవసరం ఉండదు. మన రిపబ్లిక్ అవతరించకముందే పురుడుపోసుకున్న కమిషన్‌కు పౌరు లతో పేగు బంధం ఉంది. ఈ రక్త సంబంధాన్ని ఏ సుప్రీం కోర్టు ఉత్తర్వో గుర్తు చేయవలసి వస్తే అది విషాదకరం అవుతుంది. రాజకీయ సంక్షోభం దానికి కారణమైతే, అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు.
అశోక్ లవాసా: వ్యాసకర్త ఎన్నికల సంఘం మాజీ కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


