అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనంగా, వివిధ ప్రాంతాల సమాఖ్యగా భారతదేశం విశాలమైనది.అంతకు మించి వైవిధ్యభరితమైనది. అలాంటి చోట ‘హిందీ బెల్ట్’గా రాజకీయ, ఆర్థిక జనవ్యవహారంలో పాపులరైన ప్రాంతం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల భూమి. మహాజనపదాల కాలం నుంచి ఇవాళ్టి దాకా భారత రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించడంలో ఈ ప్రాంత ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.
చెప్పాలంటే, మొత్తం దేశ విస్తీర్ణంలో దాదాపు 38 శాతం, అలాగే భారత జనాభాలో 42కి పైగా శాతం ఇక్కడిదే. దేశ పార్లమెంట్ సభ్యుల్లో 40 శాతం పైగా ఇక్కడివారే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి 15 మంది ప్రధానమంతులైతే, వారిలో సగానికి పైగా (8 మంది) ఇక్కడివారే. అయినా ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగా మిగిలి, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, హింస తదితర జాడ్యాలతో సతమతమవుతోంది.
దేశ వనరుల్లో అధిక భాగం ఇక్కడే ఖర్చవుతున్నా ఈ వెనుకబాటుతనానికి కారణాలేమిటి? ఆ ప్రశ్నకు జవాబుగా ఆ ప్రాంతంపై వివిధ కోణాల్లో వేసిన ఫోకస్‌లైట్... గజాలా వహాబ్ రచన ‘ది హిందీ హార్ట్‌ల్యాండ్’.ప్రధానంగా అయిదు విభాగాలుగా సాగిన ఈ రచన కీలకమైన హిందీ ప్రాంతం ప్రత్యేకతను సంత రించుకోవడానికి దోహదం చేసిన చారిత్రక కారణా లనూ, అలాగే వెనుకబాటు సహా సమకాలీన చరిత్రను ప్రతిఫలించే అక్కడి అనుభవాలనూ అందంగా గుది గుచ్చింది. అవి చదువుతుంటే ఆ ప్రాంత సామాజిక, రాజకీయ, ధార్మిక చలనసూత్రాలపై మునుపున్న అవ గాహన మరింత విస్తరిస్తుంది.
స్వతంత్ర భారతావనిలో కాలగతిలో పెరుగుతూ వచ్చిన మత విద్వే షాలకు కారణాలపైనా ఈ రచన దృష్టిపెట్టింది. రచ యిత్రి ప్రాథమికంగా పాత్రికేయురాలు కావడంతో ఇంటర్వ్యూలు, సంభాషణలు, స్థానికంగా పర్యటన లతో సమాచారం సేకరించి, పరిణామాలన్నిటినీ క్షేత్ర స్థాయి నుంచి, ప్రత్యక్ష సాక్షుల ద్వారా పాఠకుల కళ్ళ ముందుంచారు. కుల మతాల చిచ్చులోపడి కునారిల్లుతున్న ఈ ప్రాంతంలో ముస్లిమ్‌లతో సంఘర్షణ కేవలం 144 ఏళ్ళ నుంచేననీ, ఎప్పుడో 12వ శతాబ్దం నుంచి ఉన్న సామరస్య సహజీవనాన్ని కొనసాగిస్తే అభివృద్ధి సాధ్యమేననీ రోడ్‌మ్యాప్ చూపారు.

1857 తర్వాత పెరుగుతూ వచ్చిన హిందూ – ముస్లిమ్ విభేదాలతోనే శుద్ధ హిందీని హిందువుల భాషగా, ఉర్దూను ముస్లిమ్‌ల భాషగా చిత్రీకరించే యత్నం మొదలైంది. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసు పరిభాష నుంచి ఉర్దూ పదాలను ప్రభుత్వాలు తొలగించడం దాకా అది జరుగుతూనే ఉందని చారిత్రక ఆధారాలతో తెలుసుకుంటాం. భాష, సంస్కృతి పేరిట సాగుతున్న రాజకీయాలతో పాటు టాకీల తొలినాళ్ళ నుంచి హిందీ చిత్రసీమలో అధిక భాగం రచయితలు, కవులు హిందీ బెల్ట్ నుంచి ముంబయ్‌కి వెళ్ళినవారేనన్నది ఆలోచింపజేసే వాస్తవం. కులం, మతం, భాషా రాజకీయాల సూక్ష్మ వాస్తవాల విశ్లేషణ ఈ పుస్తకంలోని అధ్యాయాల నిండా పరుచుకుంది. లౌకికవాదం అనే మాటను సైతం దోషంగా భావిస్తూ, సామరస్యపూర్వక సాంస్కృతిక సమ్మిళిత జీవనాన్ని చెప్పే గంగా–జమునా తెహజీబ్‌ను తప్పుగా ఎంచే కాలానికి మన దేశం, ముఖ్యంగా హిందీ ప్రాంత ప్రయాణాన్ని ఆవేదనాభరితంగా బొమ్మ కడుతుంది.
చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, ఎమర్జెన్సీ... ఇలా ఎన్నింటినో స్పృశిస్తూ సాగే ఈ రచన కనిపించని కథ లెన్నో వెలికితీసింది. శివాజీ పట్టాభిషేకం, బ్రిటిషర్లపై చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తిరుగుబాటు వెనుక కథలెన్నో ఆసక్తి రేపుతాయి. నిజానికి, విస్తృత చారిత్రక క్యాన్వాస్ ఉన్న పుస్తకాన్ని ఏకబిగిన చదవడమే అనుకుంటే, రాయడం మరీ కష్టం. కానీ, గజాలా పడిన కష్టమేమో కానీ హాయిగా చదివించడం ఈ రచన ప్రత్యేకత. చదువుతుంటే రచయిత్రి పక్కనే కూర్చొని కాశీ నుంచి కశ్మీర్ దాకా ప్రయాణించిన అను భూతి. కళ్ళ ముందు జరుగుతున్న కథలా చరిత్రను తెలుసుకుంటున్న భావన. ఈ రచనకున్న అతి పెద్ద బలాలు అవే!
-గజాలా వహాబ్,జర్నలిస్టు – రచయిత్రి


