విశ్లేషణ
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అంతకు రెండు నెలల ముందు 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగానికి ఆమోదం లభించింది. అయితే, పూర్తి రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకూ వేచి ఉండకుండా అదే రోజున అందులోని 324 నుంచి 329 వరకు ఉన్న అధికరణాలను అమల్లోకి తెచ్చారు. అవే భారత ఎన్నికల సంఘానికి ప్రాణం పోశాయి. ఈ అధికర ణాలను ముందే అమల్లోకి తేవడం వెనుక సాంకేతికపరమైన అంశా లేమీ లేవు. అది లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, దాని అధికార పరిధికి లోబడి ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడి తీరాలి. రాజ్యాంగ నిర్మాతలకు ఈ విషయం తెలుసు. అందుకే గణతంత్రం పుట్టకముందే భారత ఎన్నికల సంఘాన్ని మనుగడలోకి తెచ్చారు. ఫలితంగా, కార్య నిర్వాహక వ్యవస్థ ద్వారా కాకుండా, రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ నిర్ణేత (ఎన్నికల సంఘం) పర్యవేక్షణలో తొలి ప్రభుత్వం చట్టబద్ధత పొందుతుంది.
ఎందుకు సర్వ స్వతంత్రం?
అంతే ముఖ్యమైన మరో అంశం నాడు రాజ్యాంగ నిర్మాతల ముందు నిలిచింది. సమాఖ్య వ్యవస్థలో, ప్రతి రాష్ట్రం తన సొంత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకోవలసి ఉంటుంది. వాటికి ఆ అధికారం ఇవ్వడం సహజమే కదా అనిపిస్తుంది! చాలా సమాఖ్య దేశాల్లో అలా జరిగింది కూడా! అయితే, రాజ్యాంగ నిర్మాతలు ఆ నమూనాను తిరస్కరించారు.
అందుకు కారణం ఉంది. రాష్ట్రాలు తమ ఎన్నికలను తిమ్మిని బమ్మిని చేయగలవని వారు భయపడ్డారు. పనుల కోసం, చదువుల కోసం, లేదా రాజకీయ కార్యకలాపాల కోసం వలస పోయే ‘వెలుపలి వారి’ని ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగిస్తాయనీ, తద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తాయనీ సందే హించారు. రాష్ట్రాలు నడిపే ఈ వ్యవస్థ ప్రాదేశికవాదానికి పని ముట్టుగా మారుతుందని రాజ్యాంగ సభలోని పలువురు సభ్యులు హెచ్చరించారు. కాబట్టి, ప్రతి భారతీయుడికీ తాను ఎక్కడ నివసించినా సరే సమానత్వం ప్రాతిపదికగా వివక్ష లేకుండా ఓటర్ల జాబితాలో స్థానం లభిస్తుందన్న గ్యారంటీ ఇచ్చేందుకు ఒక ఏకైక సర్వ స్వతంత్ర జాతీయ అధికారిక వ్యవస్థ అవసరమైంది.
ఓటర్ల జాబితాలు; పార్లమెంటు, శాసనసభల ఎన్నికలు; అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల ఎన్నికలపై ఆర్టికల్ 324
కింద భారత ఎన్నికల సంఘానికి ‘పర్యవేక్షణ, మార్గనిర్దేశం, నియంత్రణ’ అధికారాలు దఖలు పడ్డాయి. పౌరులందరికీ ఒకే విధమైన ఓటర్ల జాబితా, వివక్ష రహితమైన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండేలా 325, 326 అధికరణాలు పూచీ పడుతున్నాయి. ఈ రాజ్యాంగ నిబంధనలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందినవి కావు. గణతంత్ర పునాదులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా వీటిని పొందుపరచారు. సమగ్రత, సమన్యాయం, స్వతంత్రత అనే విలువల ప్రాతిపదికగానే ఎన్నికల వ్యవస్థ నిర్మాణం జరిగింది.
కమిషన్‌ను బలపరిచిన తీర్పులు
దేశ అత్యున్నత న్యాయస్థానం దశాబ్దాల తరబడిగా ఈ రాజ్యాంగ దృక్పథాన్ని విస్తరించి, పరిరక్షించింది. స్వచ్ఛమైన ఎన్ని కల నిర్వహణ కోసం ‘చట్టం ప్రవేశించని చోట’ స్వతంత్రించి చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘానికి లభించిన సంపూర్ణ అధికారంగా మొహిందర్ సింగ్ గిల్ (1978) కేసులో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఈ 324వ అధికరణాన్ని అభివర్ణించారు. కమిషన్ అధికారాలు న్యాయ చట్టాలకు పరిపూర్ణత కల్పించేవిగానే ఉంటా యనీ, అవి వాటిని పడగొట్టేవి కావనీ ఏసీ జోస్ (1984) కేసులో కోర్టు స్పష్టం చేసింది. దీని సారాంశం: ఎక్కడ చట్టం మౌనం వహి స్తోందో, అక్కడ కమిషన్ క్రియాశీలం అయితీరాలి. ఎక్కడ చట్టం మాట్లాడుతుందో, అక్కడ ఎన్నికల సంఘం ఆ మాటకు లోబడి నడచుకోవాలి.
స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని టి.ఎన్. శేషన్ (1995) కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ఏమాత్రం పడకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఓటరుకు ఉన్న తెలుసుకునే హక్కును, ‘నోటా’ను ఎంపిక చేసుకునే హక్కును బలోపేతం చేస్తూ ఏడీఆర్ (2002), పీయూసీఎల్ (2013) వంటి తర్వాతి తీర్పులు యావత్ ప్రక్రియలో పౌరుడిని కేంద్రబిందువు చేశాయి.
తరచూ విస్మరించే ఒక చిన్న తేడా గురించి ఇక్కడ నొక్కి చెప్పాలి. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికల కోసం వీవీప్యాట్ పేపర్ ట్రయల్ అనేది ‘తప్పనిసరి అవసరం’గా సుబ్రమణియన్ స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2013) కేసు విచారణలో సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే తక్షణం దేశవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టాలంటూ ఉత్తర్వులు ఇవ్వ లేదు. దశల వారీగా చేపడతామంటూ చేసిన ప్రతిపాద నను అమోదిస్తూ ఈ దిశగా కమిషన్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది వ్యవస్థల నడుమ వెల్లివిరిసిన సరైన రాజ్యాంగ సమతు ల్యతను ప్రతిబింబించింది.
విశ్వసనీయతను నిలబెట్టుకునేదెలా?
ఎన్నికల సంఘానికి ఉన్న అధికారం రాజ్యాంగం ద్వారా సంక్ర మించింది. అయితే దాని విశ్వసనీయత మాత్రం అసాధారణమైన నిశిత సమీక్షకు లోనయ్యే సాధా రణ అధికారుల మీద ఆధారపడి ఉంది. వారు తీసుకునే లక్షలాది చర్యలతో కూడిన ఆచరణలో అది నిగ్గు తేలాల్సి ఉంటుంది.
18వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రాజ్యాంగ వ్యవస్థకు సరికొత్త ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఆడిట్స్, డాష్‌బోర్డులు అన్నీ కలిసి ఓట్ల నిరూపణీయతకు హామీ ఇస్తున్నాయి. అయితే నియమ నిబంధనల పరంగా స్వతంత్రత కలిగి ఉండటం కీలకం. నియామక ప్రక్రియలు, పదవీకాల భద్రతలు విశేష అధికారాలు కావు. అవి తటస్థ వ్యవహార శైలికి వ్యవస్థాగత అవసరాలు మాత్రమే. తను నియంత్రించే కార్యనిర్వాహక వ్యవస్థ మీదే న్యాయనిర్ణేత ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. పార్లమెంటు ఆమోదించే ఏ సంస్కరణ నమూనా అయినా సరే ఒకే ఒక్క పరీక్షకు నిలబడి తీరాలి. రాజకీయ అధికారానికి ఎన్నికల కమిషన్ ‘నో’ చెప్పగలదని సగటు ఓటరు నమ్ముతున్నాడా అనే ప్రశ్నే ఆ పరీక్ష.
సమ్మిళితం అనేది ఇప్పటికీ నెరవేరని వ్యవహారం. వలస కార్మి కులు, వికలాంగులు, తొలిసారి ఓటర్లు, మహిళలు, పోలింగ్ కేంద్రా లకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వయోవృద్ధులు హర్షించే దిగా ఎన్నికల ప్రక్రియ ఉండాలి. విషాదం ఏమిటంటే, ఖైదీలు పోటీ చేయొచ్చు కాని వారు ఓటేయలేరు. వారికి ఆ అవకాశం కూడా ఉండాలి. ప్రజాస్వామ్య సక్రమత గెలిచినవారి మీదే కాదు, ఎవర్ని అనుమతిస్తున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
గణతంత్ర ఆవిర్భావానికి ముందే రాజ్యాంగపు 15వ ప్రకర ణాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థాపకులు ఎందుకు అమలులోకి తెచ్చారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారత ప్రజలు తొట్టతొలిసారి ఓటేసేప్పుడు... ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు తాను సహాయపడుతుందో ఆ ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వతంత్రంగా ఉండే వ్యవస్థ పర్యవేక్షణలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ధ్యేయంతో వారా చర్య తీసు కున్నారు. న్యాయనిర్ణేత నమ్మదగిన వాడైతేనే ఆ ప్రజాస్వామ్యం సఫలీకృతం అవుతుంది. ఎన్నికల కమిషన్ దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి తీరాలి.

ఎస్.వై ఖురేషి: వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)


