మారిన మనిషి ఇస్తున్న హామీ! | Sakshi Guest Column On Gujarat riots | Sakshi
Sakshi News home page

మారిన మనిషి ఇస్తున్న హామీ!

Mar 15 2026 5:34 AM | Updated on Mar 15 2026 5:34 AM

Sakshi Guest Column On Gujarat riots

అభిప్రాయం

గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది – అశోక్‌ పర్మార్‌ది. కుడిచేతిలో ఇనపరాడ్డు పట్టుకుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అతను వీరావేశంతో కని పిస్తాడు. ఆ ఫొటో ద్వారా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. అయితే గుజరాత్‌ అల్లర్లకు కిరీట ధారులు, సూత్రధారులు, అమలుకర్తలు వేరేగా ఉన్నారు. ఆ అల్లర్ల నిర్వాహకులు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున సమీకరించి విశాలమైన కాల్బలాన్ని నిర్మించారు. అశోక్‌ పర్మార్‌ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.

1970ల నాటి గుజరాత్‌లో బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజిక వర్గాలు రాజకీయ రంగాన్ని శాసించేవి. దానికి విరు గుడుగా ఒక కొత్త సామాజిక కూర్పును కాంగ్రెస్‌ నాయకుడు మాధవ్‌ సింగ్‌ సోలంకీ రూపొందించారు.  క్షత్రియులు, హరిజ నులు, ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీ కరణను ‘ఖామ్‌’ (కేహెచ్‌ఏఎమ్‌) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్‌ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 56 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 స్థానాలు దక్కాయి. 

అలా దెబ్బతిన్న పటేల్‌ సామాజిక వర్గం హిందూ సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బీసీ రిజర్వేషన్‌’ వ్యతిరేక ఉద్యమం వాళ్లకు కలిసివచ్చింది. దానితో, ‘ఖామ్‌’ బలహీనపడింది. హిందూ సమాజంలో అణగారిన సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు దూరం అయ్యాయి. బీజేపీకి దగ్గరయ్యాయి. గుజరాత్‌ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి చెలరేగిపోయాయి. అలాంటి ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి అశోక్‌ పర్మార్‌. అల్లర్ల కిరీటధారులు, సూత్రధారులు, అమలుకర్తలు అలాంటివారికి సామాజిక అణిచివేత నుండి ఇలా విముక్తిని ప్రసాదించారు.  ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు.

ఆ అల్లర్లలో ఒక మూకకు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో కుతుబుద్దీన్‌ అన్సారీ ఒకరు. నిస్సహాయ స్థితిలో చేతులు జోడించి వేడుకుంటున్న అన్సారీ ఫొటో కూడా అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గుజరాత్‌ అల్లర్లు జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు. మనుషుల్ని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. అప్పట్లో చాలామంది గుజరాత్‌ ముస్లింల పరిస్థితి ఇదే. మానవజాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవీయ వాతావరణం అది.

చేయి చేయి కలిపిన సందర్భం
మరోవైపు, అశోక్‌ పర్మార్‌కు వాస్తవ సాంఘిక జీవితం గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వహణలో తనది కాల్బలం పాత్ర మాత్రమేనని అతనికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని కోరుకుంటే తమ సామాజిక వర్గం మీద కూడా అల్లర్లు జరుగుతాయని కొంచెం ఆలస్యంగా అర్థమయ్యింది. తను చాలా తప్పు చేశానని పశ్చాత్తాప పడ్డాడు. ఇనుప రాడ్డును పడేశాడు. నెత్తిన కట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు. తన కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకోవడం మొదలె ట్టాడు. కుతుబుద్దీన్‌ అన్సారీని వెతికి పట్టు కున్నాడు. తన చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్క రించడా నికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కా రంగా ముగిసింది. 

ఇవ్వాళ్టి కార్పొరేట్‌ కమ్యూనల్‌ డిక్టేటర్‌షిప్‌... అప్రతిహత శక్తిగా కనిపిస్తున్న మాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ చేయ లేరని చాలామంది అనుకుంటున్న మాట కూడా నిజమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమం లేదు. ‘ఇండియా బ్లాక్‌’ సమష్టిగా లేదు. రాహుల్‌ గాంధీ ఉండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్‌ అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడం లేదు.

మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భిన్నంగా సాయుధ పోరాటం సాగిస్తామన్న మావోయిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్‌ కమ్యూనల్‌ డిక్టేటర్‌షిప్‌ను ఓడించగలమనే ఊహ కూడా దుస్సాహసం అనేలా ఉంది. కానీ  కార్పొరేట్‌ కమ్యూనల్‌ డిక్టేటర్‌షిప్‌ కాల్బలం దానిది కాదు అని అశోక్‌ పర్మార్‌  కథ చెబుతోంది. ఈ రోజు కాకపోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్‌ పర్మార్లు బయటికి వస్తారు. మరో కోరేగావ్‌ యుద్ధం జరగవచ్చు. అప్పుడు కార్పొరేట్‌ కమ్యూ నల్‌ డిక్టేటర్‌ షిప్‌ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది. 

డానీ
వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు 

Advertisement
 
Advertisement
Advertisement