breaking news
dani
-
ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవే టురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కార్మిక శక్తి చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడా పెంచితే పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరు తున్నారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.ఇక్కడో విచిత్రం ఉంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగు తాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య వివక్ష చూపడానికి సిద్ధపడింది. ఈ వివక్ష పని గంటలతో మాత్రమే ఆగడం లేదు. జీత భత్యాల్లోనూ అసాధారణ వ్యత్యాసం రూపంలో ఉంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన చేయలేదు.వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరక ధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైథునాల వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పిదప కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తుల వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే కనుక ఒక రోజులో ఉండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశాపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిద్ధపడు తున్నాయి. ఇదొక అమాన వీయ పరిణామం.ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పా దాయ వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగైరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృద్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడా ప్రభు త్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్య నిర్వాహక వర్గం కూడా కావాలి. దానినే మనం సామాన్య భాషలో ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్థిక మంత్రి యన మల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలు, పెన్షన్లకు సరి పోతున్నదన్నారు.ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటా యించినా 75 శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడం లేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది.ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమ రావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి రావ డానికి సిద్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారా నికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 12796 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్లో బయలు దేరు తుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిమిషాలకు బయలుదేరి మంగళ గిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం ఉదయం, సాయంత్రాల్లో అర గంట పని సమయాన్ని తగ్గించా ల్సిందే!సచివాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగ జేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులుమొబైల్: 90107 57776 -
ఆ రకమైన కులగణన జరపాలి!
కుల గణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్ని కల్లో లబ్ధి కోసమే తన విధా నాన్ని మార్చుకుందను కున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం తప్పక మెచ్చుకోవాలి. అయితే, సామా జిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమే కానీ పరిష్కారం కాదు; సాధనమే కానీ సమా ధానం కాదు. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయ ఆర్థిక, సామాజిక, కుల మత గణన జరగాలి. కులగణన వల్ల దేశంలో ఏ కులస్థులు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో, ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన డానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వా నికి నిజాయితీ ఉంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు.ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగు తాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికే కాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వంటి అమూర్త, సామూహిక ఉను కులు ఉండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే ఉంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ కూడా ఉండదు. ప్రతి కులానికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సిఉంటుంది.దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషే«ధితమైన విగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్నీ, వ్యాపారా లనూ; ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటోలు వంటి వాటిలో చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం ప్రకటనలు చేస్తు న్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యాపారుల్ని హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తున్నాం. ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతు న్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతు న్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వే షన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా?దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రద మైన అంశం. టెలీకమ్యూనికేషన్స్, ఐటీ, రెన్యూవ బుల్ ఎనర్జీ, మౌలికరంగ నిర్మాణాలు, ఇ–కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా స్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్– గ్యాస్, పెట్రో కెమి కల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, గనులు, సహజ వన రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది. వీటి యాజ మాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాం అంటారా? వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుద్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగు తున్నాయి. ఒకవైపు సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం 2025లో భారత స్థూల జాతీయోత్పత్తి నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతోంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుందనే అంచనా ఉంది. ‘ఆక్స్ ఫామ్ సంస్థ ఇటీవల ప్రకటించిన‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్భ్రాంతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 77 శాతం ఓ పది శాతం ధనికుల చేతుల్లో ఉందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఉందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేద రికం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.సంపద పంపిణీలో అసమానత్వం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమిటంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్య వాదం కూడా ఉంది. 39వఅధికరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచా లని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ రెండేళ్ళ క్రితం బీజేపీ చాలా హంగామా చేసింది. అటు ఆదే శిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ ఉన్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టీ మాట్లాడడం లేదు.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
పెరుగుదల వేరు... మెరుగుదల వేరు!
ఆర్థికరంగంలో ‘వృద్ధి’, ‘అభివృద్ధి’ అనే పదాల్ని చాలామంది తరచుగా ఒకే అర్థంలో వాడుతుంటారు. సామాజిక రంగంలో ఇవి రెండు భిన్నమైన భావనలే కాక పరస్పర విరుద్ధమైన భావనలు కూడ. దేశంలోని వస్తువులు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. దీనిని సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ద్వారా కొలుస్తారు. ఆర్థిక వృద్ధికి పరిమాణం ముఖ్యం. ఒక దేశ /రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తాలూకు మొత్తం పరిమాణాన్ని ఇది పరిగణన లోనికి తీసుకుంటుంది. ఇది విస్తృత అభివృద్ధికి అవసరమైన కొలమానమేగానీ సమాజంపై దాని ప్రభావాన్ని చూడడానికి అదొక్కటే సరిపోదు. ఆర్థిక అభివృద్ధి అనేది మానవ శ్రేయస్సు, సామాజిక పురోగతి మరీ ముఖ్యంగా సామాజిక న్యాయం తదితర అంశాల్లో మెరుగుదలలను పరిశీలించే విస్తృత భావన. ఇందులో ఆర్థిక అంశాలే కాకుండా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు కూడా ఉంటాయి. వృద్ధి ఆధారిత ప్రభుత్వాధినేతలు ఉన్నప్పుడు ఏదో జరిగిపోతున్నట్టు ప్రదర్శన, హడావిడి ఉంటుందిగానీ ప్రజలకు ఆ సౌఖ్యాలు అందవు. అభివృద్ధి ఆధారిత ప్రభు త్వాధినేతలు ఉన్నప్పుడు ఆ ప్రదర్శనలు, హడావిడి ఉండ వుగానీ ప్రజలకు సౌఖ్యాలు అందుతుంటాయి. మన రాజ కీయ నాయకుల్లో ఈ రెండు కోవలకు చెందినవారూ ఉంటారు. ఆయా దశల్లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి ఆర్థిక విధానాలను అను సరించారు. పీవీ నరసింహారావు, చంద్రబాబు, నరేంద్ర మోదీలది వృద్ధి ఆర్థిక విధానం. జీడీపీ బాగుంటుంది కానీ, పేదరికం పెరుగుతూ ఉంటుంది. ఎన్నికల చరిత్రను పరిశీలించినప్పుడు ఆలోచనా పరుల ప్రభావం ఓటర్లపై అంతగా లేదనీ, వర్గ సిద్ధాంతాల ప్రాతిపదికగా ప్రజలు చాలాసార్లు ఓట్లు వేయలేదనీ అర్థ మవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు సందర్భాల్లో మాత్రమే వర్గ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయి. 1952లో హైదరాబాద్ స్టేట్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం–తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులకు మంచి మెజారిటీ వచ్చింది. కానీ, నిజాం–హైదరాబాద్, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు భారీ మెజా రిటీ వచ్చి ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో శ్రామిక, భూస్వామ్య–పెట్టుబడీదారుల మధ్య మరో ఉధృత వర్గపోరాటంగా 1955 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడూ కాంగ్రెస్‌కే ఆధిక్యత వచ్చింది. ఎమర్జెన్సీని ఎత్తేసిన తరువాత లోక్‌సభకు జరిగిన ఎన్ని కల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందులో దేశంలోని ఆలోచ నాపరుల పాత్ర కూడ వుంది. ఎమర్జెన్సీ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు నాలుగు ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం కూడ కనిపించింది. నక్సలైట్ల మీద తీవ్రంగా విరుచుకు పడిన పార్టీలు ఓడిపోయేవి, నక్స లైట్లతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలు గెలిచేవి. తరు వాత కాలంలో ఈ ప్రభావం మాయమయ్యింది. ఇటు కమ్యూనిస్టులూ, అటు అంబేడ్కరిస్టులూ చెప్పే సిద్ధాంతాలకూ, ప్రజల ఓటింగ్ విధానాలకూ పొంతనే లేదు. దేశ జనాభాలో 85 శాతం శ్రామికవర్గమే అయి నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నికల్లో 2 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. అలాగే దేశ జనాభాలో బహు జనులు 85 శాతం ఉన్నప్పటికీ బీఎస్పీ వంటి అంబే డ్కరిస్టు పార్టీలకు 4 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మనం రెండు సూత్రీకరణలు చేయవచ్చు. మొదటిది, కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు సిద్ధాంతాలను పెట్టుబడీదారీ పార్టీలు హైజాక్ చేశాయి అనేది. రెండోది; ప్రజలకు ఇప్పటి కమ్యూనిస్టు, అంబేడ్క రిస్టు పార్టీల నాయకుల మీద నమ్మకం లేదు అనేది. కమ్యూనిజం వేరు, కమ్యూనిస్టు పార్టీలు వేరు అయినట్టు; అంబేడ్కరిజం వేరు, అంబేడ్కర్ పేరున వెలసిన పార్టీలు వేరు. అసలు విషయం ఏమంటే, ఈ పార్టీల్లో బహు అరుదుగాతప్ప నమ్మదగ్గ నాయకులు ప్రజలకు కనిపించడం లేదు. ఎవరయినా నమ్మదగ్గ నాయకులు ఎక్కడయినా కనిపిస్తే ప్రజలు కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు పార్టీలను అక్కడ గెలిపిస్తూనే ఉన్నారు. ఓటర్లకూ పార్టీల ప్రకటిత సిద్ధాంతాలకూ మధ్య ఒక వైరుధ్యం ఉంది. ముందుదాన్ని పరిష్కరించాలి. రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థులయిన కమ్యూనిస్టుల్నీ, నక్సలైట్లనీ బల హీనపరచడానికి ఇందిరాగాంధీ భూసంస్కరణ చట్టాలు, అటవీ భూముల పరిరక్షణ చట్టాలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభర ణాలు రద్దు వంటివాటిని తెచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు కోరేదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీలకు అభిమానులుగా ఉన్న ఓటర్లు సహితం కాంగ్రెస్ ఓటర్లుగా మారి పోయారు. తాను ప్రకటించిన ఆదర్శాలను కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఆచరించలేదు. సరిగ్గా ఎన్టీ రామారావు రంగ ప్రవేశం చేసి ఇందిరా గాంధీ వాడిన ఆయుధాలతోనే ఆమె పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఓడించారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలన్నీ ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ నుండి పుట్టినవే. ఎన్టీ రామారావు ప్రకటించిన ఆదర్శాలను చంద్ర బాబు చిత్త శుద్ధితో ఆచరించలేదు. పైగా వారు పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలకు (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) తనను తాను బ్రాండ్ అంబాసిడర్‌గా సగర్వంగా ప్రకటించుకోవడం మొదలెట్టారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల నాడిని పట్టుకున్నారు. ఇందిరా గాంధీ అందించిన ఆయుధాలతో ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను ఓడించినట్టే, ఎన్టీ రామారావు అందించిన ఆయుధాలతో తెలుగు దేశం పార్టీని ఓడించడానికి వైఎస్ సిద్ధపడ్డారు. చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు చేపడితే... వైఎస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు నినాదంతో వాటిని చిత్తు చేశారు. ఆ తరువాత ‘ఆరోగ్యశ్రీ’ వంటివి వచ్చాయి. కొత్త ఆంధ్ర ప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన పాత విధానాలను మార్చుకోలేదు. మరొక్కసారి నూతన ఆర్థిక విధానాలనే అనుసరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త రాజధానినీ, పోలవరం ప్రాజెక్టునూ నిర్మించి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అవి పూర్తయ్యేలోగా హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించుకునే వీలుంది. అందులో అనవసరంగా జోక్యం చేసుకున్న చంద్రబాబు నూతన ఆర్థిక విధానాలను జొప్పించారు. అలాంటివి సింగపూర్ పెట్టుబడీదారులకు బాగుంటాయిగానీ ప్రజలకు బాగుండవు. గత ఎన్నికల్లో అమరావతి రాజధాని పరిధి లోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్య ర్థులు గెలవలేదు. ఇది ఏ సంకేతాన్ని ఇచ్చిందీ? వైఎస్ జగన్ మరొక్కసారి ప్రజల నాడిని పట్టు కున్నారు. నూతన ఆర్థిక విధానాలకు పూర్తిగా వ్యతిరేక మయిన ‘నవరత్నాల’ను ముందుకు తెచ్చారు. పేదల ఆర్థిక విధానం ముందు చంద్రబాబు మరొక్క సారి ఘోర పరాజయాన్ని చవిచూశారు. చంద్రబాబు నూతన ఆర్థిక విధానాలను వదులు కోలేరు. దానికీ కొన్ని ఓట్లు ఉన్నాయన్నది వారి నమ్మకం. అయితే ఆ ఓట్లు ఎన్నికల యుద్ధంలో గెలవడానికి సరి పోవని వారికి స్పష్టంగా తెలుసు. వారికిప్పుడు అదనపు ఓట్ల కోసం పవన్ కల్యాణ్ కావాలి. తెలంగాణలో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన ఓడిపోవడమేగాక ఎక్కడా డిపాజిట్లను కూడ నిలబెట్టుకోలేక పోయింది. అదొక రికార్డు. రాజకీయాల్లో ప్రవేశించి దశాబ్దం దాటుతున్నా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రికార్డు కూడ ఆయన సొంతం. వారిని చంద్రబాబు నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ ఆశిస్సులు దక్కుతాయని చంద్రబాబు ఆశిస్తూ ఉండవచ్చు. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ -
పారిశ్రామిక దిగ్గజం అశ్విన్ డానీ కన్నుమూత
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక రంగ ప్రముఖులు, ఏషియన్ పెయింట్స్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాజీ చైర్మన్ అశ్విన్ డానీ (81) తుది శ్వాస విడిచారు. 1968 నుండి ఏషియన్ పెయింట్స్‌తో డానీకి అనుబంధం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, నాన్–ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌తో సహా కంపెనీ బోర్డ్‌లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2018 నుండి 2021 మధ్య డానీ ఏషియన్ పెయింట్స్ సంస్థకు, బోర్డ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. డానీ తండ్రి సూర్యకాంత్ ఏషియన్ పెయింట్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. వివిధ ప్రభుత్వ– వాణిజ్య సంస్థల్లో డానీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అవార్డులు అందుకున్నారు. సీఎన్‌బీసీ–టీవీ 18 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, బిజినెస్ ఇండియా మ్యాగజైన్ బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్ (2015), ఇండియన్ పెయింట్ అసోసియేషన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2002లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నుండి కెమినార్ అవార్డు ఇందులో ఉన్నాయి. తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అశ్విన్ డానీ, ఆయన కుటుంబం 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,000 కోట్లు) నికర విలువను కలిగి ఉంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానంలో నిలిచారు. -
ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
స్పందన ఒకరి కాళ్ల కింద చమురు వుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్ అధిపతులకు ఇవి రెండూ కావాలి. ప్రపంచ పరిణామాల్ని గమనించే వారికెవరికయినా సులువుగా అర్థం అయ్యే విషయం ఏమంటే ఇప్పుడు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రజాసమూహాలు ముస్లింలు, ఆదివాసులు అని. ఒకరి కాళ్ల కింద చమురు వుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్ అధిపతులకు ఇవి రెండూ కావాలి. వాటిని దక్కించుకోవాలంటే ముస్లింలు, ఆదివాసుల్ని వాళ్ల స్థానాల నుండి తొలగించాలి. అలా చేయాలంటే చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలి. ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు మనం నిత్యం డిజిటల్ డిస్ప్లేలో చూస్తూనేవున్నాం. ఇంకా అనుమానం వున్నవాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఉపన్యాసాలు విని నిర్ధారణ చేసుకోవచ్చు. ముస్లిం సమాజానికి బాహ్యాత్మక ముప్పు ముంచుకు వస్తున్నదని ప్రపంచం గుర్తించినప్పుడల్లా స్కైబాబ ఒక కొత్త ఆరోపణతో ముందుకు వస్తుంటారు. ముస్లిం సమాజానికి వచ్చిన ముప్పు అంతర్గతమైనది అనేది వారి ఆరోపణల సారాంశం. భారత ముస్లిం సమాజపు వెనుకబాటుతనానికి కారణాలు వాళ్లు అనుసరిస్తున్న ఆచారాల్లోనే అంతర్గతంగా వున్నాయని తాము రాసినప్పుడు ముస్లిమేతర మిత్రులు కొందరు తమను సంఘసంస్కర్తగా పొగిడేవారు అనే అర్థం వచ్చేలా కొన్నేళ్ల క్రితం ఆయనే ఒక వ్యాసంలో రాసుకున్నారు. బహుశా బయటివాళ్ల పొగడ్తలు కోరుకున్నప్పుడల్లా స్కైబాబ ఇలా ‘అంతర్గత ముప్పు’ సిద్ధాంతాన్ని బయటకు తెస్తుంటారని మనం అర్థం చేసుకోవచ్చు (సాక్షి సాహిత్యం, 18 జూలై 2016). అస్తిత్వవాద ఉద్యమాలకు ప్రాణప్రదమైనవి రాజకీయార్థిక అంశాలు. స్కైబాబ వ్యాసంలో వీటి ప్రస్తావనే లేదు. భారత ముస్లిం సమాజానికి బయటి నుండి ముంచుకు వస్తున్న ఉపద్రవాన్ని వారు తెలివిగా కప్పిపుచ్చేశారు. అంతేకాక, వ్యాసంలో ‘బయటి నుండి’, ‘బాహ్యాత్మక’ వంటి పదాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆయన వాదానికీ ముస్లిం అస్తిత్వవాదానికీ సంబంధమే లేదు. ముస్లిం సామాజిక సముదాయంలో అందరూ ఒకే స్థాయిలో మతాచారాల్ని ఆచరించరు. వాళ్లలో మతాన్ని నిష్టగా పట్టించుకునేవారు, అతిగా పట్టించుకునేవారు, అప్పుడప్పుడు మాత్రమే పట్టించుకునేవారు, అస్సలు పట్టించుకోనివారు, మతాతీతంగా వ్యవహరించేవాళ్లు వుంటారు. అయితే, బయటి నుండి ముప్పు పెరిగినపుడు సహజంగానే మొత్తం భారత ముస్లిం సమాజం అప్రమత్తమై ప్రత్యర్థి వర్గాన్ని నిలువరించే పనిలో నిమగ్నమై పోతుంది. అంతా సవ్యంగావున్న కాలంలోకంటే ఆపద ముంచుకొచ్చిన కాలంలోనే ఈ సంఘీభావం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇతర మత సమూహాల్లోని ఉదారవాదులు సహితం ముస్లిం సామాజిక సముదాయం మీద సానుభూతిని ప్రకటిస్తుంటారు. మతవ్యతిరేకులు కూడా కొందరు వుంటారుగానీ వాళ్లకూ మత సముదాయపు అస్తిత్వ ఉద్యమానికీ సంబంధం ఉండదు. గతేడాది చివర్లో దేశమంతటా చెలరేగిన అసహన వాతావరణాన్ని మనం ఇంకా మరిచిపోలేదు. ఆ వాతావరణాన్ని ఎవరు ఏ ప్రయోజనాల్ని ఆశించి సృష్టించారో కూడా మనకు తెలుసు. ఈ రోజు సాక్షాత్తూ భారత ప్రధాని ‘భారత సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చాలనుకుంటున్న కొందరు గోసేవకుల పేరుతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే దుకాణాలు తెరిచారు’ అనాల్సివచ్చిందంటే భారత ముస్లిం సమాజం, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న ఇతర ప్రజా సమూహాలూ, మరీ ముఖ్యంగా దళితులూ సమష్టిగా ఏ స్థాయిలో పాలకవర్గాల్ని నిలువరించాయో అర్థం చేసుకోవచ్చు. భారత ముస్లిం సమాజం రాజకీయార్థిక లక్ష్యాల సాధన కోసం బాహ్యాత్మక పోరాటం సాగిస్తున్న సమయంలో స్కైబాబ ధార్మిక, సాంస్కృతిక అంశాలు చర్చకు తెచ్చారు. పైగా అవి అంతర్గత ముప్పు అంటూ ఇంటాబయటా గందరగోళాన్ని సృష్టించారు. బయటి ముప్పును ఎదుర్కోవడానికి స్వీయసమాజం చేస్తున్న ప్రయత్నాలని వారి రచనలు నిస్సందేహంగా దెబ్బ తీస్తాయి. –డానీ 9010757776