నేర్చుకోవాల్సిన కీలక టీకా పాఠాలు | Sakshi Guest Column: Key vaccination lessons to learn | Sakshi
Sakshi News home page

నేర్చుకోవాల్సిన కీలక టీకా పాఠాలు

Mar 16 2026 1:03 AM | Updated on Mar 16 2026 1:03 AM

Sakshi Guest Column: Key vaccination lessons to learn

విశ్లేషణ

మన దేశంలో కౌమారంలోకి ప్రవేశించిన బాలికలకు రానున్న వారాల్లో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్పీవీ) టీకాలు వేయనున్నారు. దీంతో జాతీయ టీకా కార్యక్రమాల కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మొత్తం 13 రకాల టీకాలు వేయడాన్ని మన దేశం అమలుపరచినట్లు అవుతుంది. బాల్యంలో వేయవలసిన టీకాలు అన్నింటినీ పూర్తి చేయడం ద్వారా భారత్‌ ఒక మైలురాయిని సాధించినట్ల యింది. అనారోగ్య నివారణకు కౌమారాన్ని ముఖ్య దశగా గుర్తించ డంలో నిర్ణయాత్మకమైన అడుగు వేసినట్లు కూడా అవుతోంది. 

రోగ నిరోధక శక్తిని పెంచే సార్వత్రిక కార్యక్రమంలో ప్రత్యేకించి యువతులకు వేయనున్న మొదటి టీకాగా హెచ్పీవీ నమోదు కానుంది. ఇంతవరకు జాతీయ రోగ నిరోధక ప్రయత్నాలు శిశు వులు, చిన్న పిల్లలు, గర్భవతులను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇప్పుడీ విధానపరమైన పరిణామం పరిణతితో కూడిన దార్శనికతకు సంకేతంగా నిలుస్తోంది. నివారణ యత్నాలు కేవలం చిన్న వయసు వారితోనే ఆగడానికి లేదనీ, ఆగకూడదనీ గుర్తించినట్లయింది. 

18 ఏళ్ల నిరీక్షణ
ఇది కేవలం పాలనాపరమైన పరిణామమే కాదు. ఈ అనివార్య నిర్ణయానికి దాదాపు 18 ఏళ్ళపాటు తర్జనభర్జనలు సాగాయి. ఈ విషయంలో ప్రాథమిక పరిశీలనకు, వాస్తవిక ఆచరణకు మధ్య జరి గిన కాలయాపన ప్రజారోగ్య కార్యక్రమాలన్నింటికీ ఒక పాఠంలా నిలుస్తోంది. మొదటి హెచ్పీవీ టీకాకు 2006లోనే లైసెన్సు లభించింది. అది 2008 ఆరంభం నుంచి మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలు అంకురార్పణ పలకడం విశేషం. 

లాభాపేక్ష లేని ‘పాత్‌’ అనే అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2008–09లో హెచ్పీవీ టీకా పరిచయ కార్యక్రమం మొదలైంది. సాధ్యా సాధ్యాలు, ఆమోద యోగ్యత, విస్తృతి, భిన్న ప్రాంతాల్లో టీకా అందించడానికయ్యే ఖర్చు విషయంలో ప్రత్యక్ష ఫలితాల ఆధారాలను సేకరించడం వంటి వాటి లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమం కింద 10–14 ఏళ్ళ బాలికలకు ఖమ్మం జిల్లాలోనూ, గుజరాత్‌లోని వడోదరా జిల్లాలోనూ టీకాలు వేశారు. టీకా అందించడంలో వివిధ రకాల నమూనాలను పరీక్షించి చూశారు. 

అయితే, ఈ టీకా వేయించుకున్న బాలికలలో కొందరు మృత్యు వాత పడినట్లు 2009లో వార్తలు రావడంతో ఆందోళన చోటు చేసుకుంది. మరణాలకు ఆ టీకాతో సంబంధం లేదని తదనంతర దర్యాప్తులో తేలినప్పటికీ వేయించుకునే వారి నుంచి అనుమతి పొందడంలో విధానాలను అరకొరగానే అమలుపరిచారన్న ఆరోప ణలు వచ్చాయి. ముఖ్యంగా బలహీన, గిరిజన వర్గాల విషయంలో నైతికపరమైన లోటుపాట్లు బహిర్గతమయ్యాయి. ఈ విషయంపై పార్లమెంటులో కూలంకషంగానే చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వం 2010లో ఈ కార్యక్రమానికి తెరదించింది. 

ఔషధాల తయారీ సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నాయంటూ నిందలు మోపడం ప్రారంభించారు.  ఫలి తంగా, హెచ్పీవీ టీకా కార్యక్రమానికి గ్రహణం పట్టింది. రోగ నిరో  ధకతపై ప్రభుత్వమే ఏర్పాటు చేసినవి అయినప్పటికీ స్వతంత్రమైన సాంకేతిక సలహా బృందాలు ఈ టీకా వేయాలని తరచూ సిఫా ర్సులు చేసినా, జాతీయ టీకా కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్‌ను చేర్చడా నికి మన దేశం వెనుకాడుతూ వచ్చింది. ప్రజా విశ్వాసం కొరవడితే శాస్త్రీయ ఆధారాలు ఎంత బలంగా ఉన్నా అక్కరకు రావని ఈ ఉదంతం ద్వారా వెల్లడైంది. 

కోల్పోయిన అవకాశం
ఈ జాప్యానికి పెట్టిన పణాన్ని కోల్పోయిన కాలంతో లెక్కించ కూడదు. రోగనిరోధకతను పెంచుకునే అవకాశాలను బలపరచు కోలేకపోయామని వాపోవాలి. ఎప్పుడు టీకా బాగా పనిచేస్తుందో ఆ వయసు దాటి బాలికలు చాలా మంది బయటకొచ్చేశారు. మిగిలిన చాలా దేశాలు ఆ టీకాను సంతోషంగా అక్కున చేర్చుకుని ఆరోగ్య రక్షణను పెంచుకున్నాయి. దాదాపు 164 దేశాలు 2026 జనవరి నాటికే హెచ్పీవీ వ్యాక్సీన్‌ ప్రవేశపెట్టి, 50 కోట్లకు పైగా డోసులను అందించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలు ఒక ప్రజారోగ్య సమస్యగా గర్భాశయ క్యాన్సర్‌ను ఇంచుమించుగా నిర్మూలించిన స్థితికి చేరుకోగలిగాయి. 

మన దేశంలో మహిళలకు వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ రెండవదిగా ఉంది. ఏటా దాదాపు 80 వేలకు పైగా మంది కొత్తగా దాని బారినపడుతున్నారు. సుమారుగా 42 వేల మందికి పైగా ఏటా ఈ క్యాన్సర్‌తో  చనిపోతున్నారు. అత్యధి కులు హై–రిస్క్‌ హెచ్పీవీ రకాల (ముఖ్యంగా టైప్‌ 16, టైప్‌ 18) ఇన్ఫెక్షన్‌ వల్లనే గర్భాశయ క్యాన్సర్‌ బారినపడుతున్నారు. మన దేశంలో వేయనున్న గర్దాసిల్‌ వ్యాక్సిన్‌ ఈ హెచ్పీవీ టైపుల నుంచి బాలికలను రక్షిస్తుందని భావిస్తున్నారు. 

హెచ్పీవీ వ్యాక్సిన్లు సజీవేత రమైనవి. ఇన్‌ఫెక్షన్‌ కలుగజేసే శక్తి వాటికి ఉండదు. ఏ రకాల పాపి లోమా వైరస్‌ వల్ల గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయని భావిస్తు న్నారో వాటిని నివారించడంలో ఆ వ్యాక్సీన్‌ అత్యంత ప్రభావశీల మైన రీతిలో 93 నుంచి 100 శాతం సఫలమైనట్లు వెల్లడైంది. 9 నుంచి 14 ఏళ్ళ వయసున్న బాలికలకు సింగిల్‌ డోసు వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో పేర్కొంది. సింగిల్‌ డోసు ఎక్కువ మంది వేయించుకోగలిగిన రేటుకు అందుబాటులో ఉంటుందనీ, కార్యక్రమం సఫలమవడానికి అవకాశాలు ఎక్కువనీ పేర్కొంది.

నిరంతరం కార్యక్రమం
హెచ్పీవీ వ్యాక్సినేషన్‌లో భారత్‌ ఏనాడో చేరవలసి ఉన్నా, ఇప్పటికైనా చేరడం మహత్తరమైనదే. టీకాపై రేగిన వివాదం వల్ల దాన్ని ప్రవేశపెట్టడంలో దాదాపు 15 ఏళ్ళు జాప్యమైంది. ఈ వ్యవ హారం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. టీకా కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడే కమ్యూనికేషన్‌ దానిలో అంతర్భాగంగా ఉండాలి. దాని ఉపయోగాలను ప్రచారం చేయడం తదనంతర ఆలో చనగా ఉండకూడదు. టీకా ఎందుకు వేయబోతున్నారో, అది ఎలా పని చేస్తుందో, దానివల్ల దుష్ప్రయోజనాలు కలుగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో సమాజానికి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో వివరించాలి. డేటా ఒక్కటే నమ్మకాన్ని కలిగించలేదు. 

సంస్థాగత స్పందనలు అస్పష్టంగా లేదా ఆత్మరక్షణ ధోరణిలో ఉంటే, కాకతా ళీయంగా సంభవించిన ప్రతికూల పరిణామాలు కూడా చక్కని కార్య క్రమాన్ని అస్థిర పరచగలవు. సత్వర, స్వతంత్ర దర్యాప్తులు జరపడం, నిగ్గుదేలిన విషయాలను పారదర్శకంగా వెల్లడించడం వల్ల విశ్వసనీ యతను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రజారోగ్య కార్యక్రమా లలో ముఖ్యంగా యువత, బలహీన వర్గాల విషయంలో, నైతిక ప్రమాణాలను పాటిస్తున్నట్లు కనిపించడం కూడా చాలా అవసరం. 

త్వరలోనే హెచ్పీవీ టీకాలను ఉచితంగా వేయడం వల్ల వివిధ సామాజిక ఆర్థిక వర్గాలలో సమానత్వాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. గర్భాశయ క్యాన్సర్‌ను రూపుమాపడానికి టీకా వేయించు కోవడం ఒక్కటే సరిపోదని కూడా మనం గుర్తుంచుకోవాలి. పాప్‌ స్మియర్లు లేదా హెచ్పీవీ పరీక్షలు కొనసాగించడం ద్వారా జల్లెడ పట్టడం సాగాలి. ముఖ్యంగా, వ్యాక్సిన్లు వేయించుకోని వృద్ధ మహిళ లకు ఆ పరీక్షలు నిర్వహించాలి. టీకాలు వేయడంతోపాటు, పరీక్షలు నిర్వహించడం, సకాలంలో చికిత్సలు అందించడంతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించినప్పుడే మార్గం మెరుగుపడుతుంది. 

డా‘‘ చంద్రకాంత్‌ లహరియా
వ్యాసకర్త ప్రముఖ వైద్యుడు–ఆరోగ్య విధాన నిపుణుడు 

Advertisement
 
Advertisement
Advertisement