రాష్ట్రపతి భవన్ డిన్నర్ హాలులో నేనొక్కడినే ఉన్నాను! హాలు నిండా మనుషులు ఉన్నా, ఒక్కడినే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోందంటేనా పక్కన ఉండవలసిన వారు లేరని! మోదీజీ, పుతిన్‌లతో కలిసి డిన్నర్‌కు కూర్చోవటం గొప్ప ఆతిథ్యమే కానీ, గొప్ప అనుభూతైతే కాదు. నా పక్కన రాహుల్‌జీ ఉండాలి. ఖర్గేజీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక కాంగ్రెస్‌వాదిగా నా కడుపు నిండినట్లు! సరళమైన ఒక త్రేన్పు బయటికి వచ్చినట్లు!
భోజనం రుచి మన ప్లేటులో వడ్డించి ఉన్న సౌతిండియన్ థాలీ వల్ల రాదు. మనతో కలిసి భోంచేస్తున్న వారి వల్ల వస్తుంది. రాహుల్‌జీని, ఖర్గేజీని కూడా మోదీజీ డిన్నర్‌కి ఆహ్వానించి ఉండవలసిందా? ఆహ్వానాలు పంపటానికి కొలబద్దలు, కొలమానాలు ఏవో ఉంటాయి. కానీ, కొన్నిసార్లు కొలతల్ని పక్కన పెట్టడమే సరిగా తూచటం అవుతుంది.
ఏమైనా... మోదీ నుంచి ఆహ్వానం రావటం, రాకపోవటం రెండూ గౌరవాలే. ఆయనను అంగీకరించటం అసాధ్యం. ఆయనను విస్మరించడం దుస్సాధ్యం! మహాభారతం అంటుంది – ఇక్కడున్నది ఎక్కడా లేదు, ఇక్కడ లేనిదీ ఎక్కడా లేదని! భగవద్గీత నిష్కామ కర్మ గురించి చెబుతుంది. రెండూ నేను అనుసరించి, ఆచరించేవే.
మోదీ వంటి నాయకులు ఇక్కడ తప్ప ఎక్కడా లేరు. ఇక్కడ లేకుంటే ఎక్కడా ఉండరు. మోదీజీ నిష్కామ కర్మయోగిలా కనిపిస్తారు నాకు! మహా భారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత ఒక భాగం అయినట్లే... భారతదేశ రాజకీయ పర్వంలో మోదీజీ ఒక భాగం అని నాకు తరచూ అనిపిస్తుంటుంది.
పుతిన్‌కు మోదీజీ భగవద్గీతను కానుకగా ఇవ్వటం కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణను బోధించినట్లే ఉంది. డిన్నర్ అయ్యాక రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ ఎస్టేట్‌లో ఉన్న నా నివాసానికి వస్తున్నాను. నేను చేసింది తగిన పనా, తగని పనా అని నేనెప్పుడూ ఆలోచించను. జీవితంలో తగనివి అంటూ ఏవీ ఉండవు. తగని స్థలాలు, తగని సమయాలు అనేవీ ఉండవు.
ఏ సమయంలో మనం ఎక్కడ ఉంటామన్నది బహశా, మనం అక్కడ ఉండాల్సిన సమయం, స్థలం అయి ఉండాలి! పార్టీలో అంతా నాపై అసహనంగా ఉన్నట్లున్నారు. ‘పార్టీని మాటైనా అడగకుండా, పిలిస్తే వెళ్లి భోజనాల వరుసలో కూర్చోవటమేనా’ అని పవన్ ఖేరా! ‘డిన్నర్‌కి మన నాయకులను పిలవకుండా మనల్ని పిలుస్తున్నారంటేనే లోపల ఏం ఉడుకుతోందో మనం అర్థం చేసుకోవాలి కదా’ అని జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్!
‘‘కనీసం మనస్సాక్షి ఉండాలి’’ అంటున్నారంతా! ఉండాల్సిందే. కానీ, మనస్సాక్షి అవసరమైన స్థితిని మోదీజీ నాకు కల్పించలేదు. ఫారిన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా మాత్రమే నాకు ఆయన డిన్నర్ ఇన్విటేషన్ పంపించారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఖర్గే మీద నేను పోటీ చేసినప్పుడు కూడా పార్టీ సీనియర్ లీడర్లు ఇలాగే అన్నారు: ‘‘ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని. ఆత్మ విమర్శ చేసుకుంటే ఏమవుతుంది? ‘‘ఖర్గే మీద నువ్వు పోటీ చేయటం కరెక్టే’’అంటుంది.
‘‘సార్, వచ్చేశాం’’ అన్నాడు డ్రైవర్! రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ రోడ్‌కు పది నిమిషాల ప్రయాణం. కారు దిగి, ఇంట్లోకి నడుస్తుంటే మొబైల్‌లో – మీడియాతో మాట్లాడుతున్న పవన్ ఖేరా! ఎవరో ఫార్వార్డ్ చేసిన క్లిప్. ‘‘ఆహ్వానాన్ని పంపినవారూ, ఆహ్వానాన్ని కాదనలేనివారూ అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఆ ప్రశ్నలకు వారే జవాబు చెప్పాలి’’ అంటున్నారు ఖేరా. వీడియోను ఆఫ్ చేశాను. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పనవసరం లేదు. జవాబు మనసులో ఉంటే చాలు.


