సమాజం పరిస్థితి తీవ్రమైన విచారాన్ని కలిగిస్తున్నది. ఈ మాట అంటున్నది అభివృద్ధి, పేదరికం, అవినీతి, తారతమ్యాలు, కులతత్వం, మతతత్వం వంటి విషయాల గురించి కాదు. ఆ సమస్యలపై చర్చలు ఎప్పుడూ జరుగుతున్నవే. ఉద్యమాలూ సాగుతున్నవే. అందుకు పరిష్కారాలపై అనేక థియరీలు, ఆలోచనలు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తావిస్తున్నది వీటన్నింటికి భిన్నమైనది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తులకు తమతో తమకు ఉండే ఆత్మ సంబంధాలు, ఈ సంబంధాలకు ఆలవాలమయే విలువల గురించి. ఇవి అన్నింటికీ అన్నీ క్రమక్రమంగా క్షీణిస్తుండటం గురించి.
సామాజిక క్షీణత
ఆ యా కాల పరిస్థితులను బట్టి ఈ సంబంధాలు బలంగా ఉండటం, బలహీనపడటం జరుగుతూనే ఉంటుంది. అది సాధారణ స్థాయిలో ఉండటానికీ, ఒక ధోరణిగా మారి తీవ్రతరం కావటానికీ తేడా ఉంది. దానికదే ఒక ఆందోళనకరమైన స్థితి కాగా, అంతే ఆందోళన కలిగిస్తున్నది మరొకటి ఉంది. అది, ఈ విషయమై ఎవరికీ పట్టినట్లు లేకపోవటం. ప్రభుత్వం, పార్టీలు, పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు, వివిధ మతాల పెద్దలు, గురువులు, సంస్కర్తలు, లెక్క లేనంతగా ఉన్న సంఘాల వారు, ఆ యా ఇజాల వారు. అందరికీ అందరూ. ఎవరికి ఏదీ పట్టడం లేదు. ఒక మాట సూటిగా చెప్పుకోవాలంటే, మనుషులు తమను తాము చంపుకోవటం, ఇతరులను చంపటం ఎక్కువవుతున్నాయి. అందుకు స్థూలంగా కనిపిస్తున్న కారణాలు ఆర్థికం, లైంగికం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, బలహీనపడుతున్న కుటుంబ సంబంధాలు, పెరిగిపోతున్న అసహనం వంటివి. ఇది స్థూలమైన పరిభాష.
వీటిలో ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిస్తే అన్నింటికీ కలిపి ఒక సమగ్ర సామాజిక స్థితి కనిపిస్తుంది. ఈ అంశాలలో కొన్నింటికి పరస్పర సంబంధం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వాటి జమిలి ప్రభావాలతో మన సమాజం, మనుషులు, కుటుంబాలు ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి ఇటువంటి అధ్యయనాలను సామాజిక శాస్త్రజ్ఞులు చేయాలి. సమాజ అధ్యయన శాస్త్రంలోకి రాజకీయం, ఆర్థికం, సమాజ సంస్కృతి, కుటుంబం, వ్యక్తిత్వ రూపకల్పనలు, మానసికతలు వీటన్నింటి పరస్పర సంబంధాలు, పరిణామాలు, మంచి చెడులు అన్నీ వస్తాయి. సామాజిక శాస్త్రం మనకు శ్రీకృష్ణుని నోటిలో సమస్త విశ్వ సందర్శనం వంటిది. కానీ దురదృష్టవశాత్తు, ఇతరత్రా మన విద్యా రంగాల వలె, సామా జిక శాస్త్ర విభాగాలు కూడా బలహీనపడుతూ, ఇటువంటి అధ్యయ నాలు చేయటం లేదు. తెలుగు రాష్ట్రాలలోని ఈ విభాగాల వారికి ఆ స్పృహ అయినా ఉన్నట్లు లేదు.
చెదురుతున్న సంబంధాలు
వివరాలలోకి వెళితే, పైన పేర్కొన్న కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ ఉండటం లేదు. డబ్బు, వ్యసనాలు, లైంగికాలు, హీన సంస్కృతి, వినియోగదారీతత్వం పాత్రలు పెరుగుతూ, మనుషులకు తమతో తమకు స్వీయ సంబంధాలు, వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాల పాత్రలు, అనుబంధాలు బలహీనపడి అప్రధానమవుతున్నాయి. ధన ప్రభావం, క్రమంగా వ్యాపిస్తున్న కొత్త కన్జూమరిజం, కొత్త సంస్కృతి ప్రభావం పట్టణ ప్రాంతాలకు, కొన్ని తరగతులకు పరిమితమై ఉండక గ్రామాలకూ, అన్ని తరగతులకూ విస్తరిస్తున్నది. పట్టణాలకు ఎక్స్‌పోజర్, కొత్త మీడియా, వినోదం, బలహీనపడిన విద్య, కుటుంబ శిక్షణలు, క్రమశిక్షణలు, కన్జూమరిజం పెంచుతున్న కోరికలు ఈ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి.
అది జరిగినప్పుడు మనిషి ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించటంతో మొదట తనతో తనకే స్వీయ సంబంధం చెదిరిపోతుంది. వ్యక్తిత్వం కలుషి తమవుతుంది. ఒకసారి అది జరగటం మొదలైతే కుటుంబంతో, ఇతర వ్యక్తులతో, సమాజంతో సంబంధాలు చెదిరిపోవటమన్నది తార్కికమైన సహజ పరిణామం. అది, వేర్లకు పురుగుపట్టిన చెట్లు మామూలు గాలికే కూలిపోవటం వంటిది. అట్లా కూలటంలో భాగంగానే అన్ని విధాలైన సంస్కారాలూ దెబ్బతిని వ్యక్తులు ఆత్మహత్యలకు, హత్యలకు, కుటుంబ సభ్యులపై దాడికి, లైంగిక నేరాలకు, ఇతర నేరాలకు, వ్యసనాలకు, తత్సంబంధిత అకృత్యాలకు పాల్ప డటం పెరుగుతున్నది. ఇదే సామాజిక క్షీణ స్థితి.
పైన చెప్పుకున్నట్లు, ఇటువంటి స్థితి ఏర్పడటం వర్తమానకాల పరిస్థితుల ప్రభావంతో జరుగుతున్నది. అటువంటికాల పరిస్థితులకు పరిష్కారం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, పరిష్కార ప్రయత్నాలు ఒక స్థాయిలో జరుగుతూనే వీలైనంత నివారణ ప్రయత్నాలు కూడా ఏమి జరగాలన్నది మరొక ప్రశ్న. ఈ ధోరణిని భిన్న కోణాల నుంచి మౌలికంగా ఎదుర్కోవటం, పరిష్కరించటం, ప్రభుత్వాలు విధానపరంగా తీసుకోగల చర్యలపై ఎక్కువగా ఆధారపడి
ఉంటుంది. పైన పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు సాధ్యమే. విద్య, వినోదం, ఆర్థికం, కొత్త తరహా మీడియా, కన్జూమరిజం, సమస్త అంశాలలో డబ్బు పాత్ర మొదలైనవి విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి రాగలవు.
క్రియాశీలంగా మారితేనే...
కానీ, అది మాత్రమే ఎంత మాత్రం చాలదు. అందుకు సమాజ పరంగా జరిగేది సరిసమానంగా అనుబంధం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సమాజం ఏదీ శ్రద్ధ చూపటం లేదన్నది సమస్యగా మారింది. ఒకోసారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినా కనీసం సామాజికులు, సంస్కర్తలు, మత పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఇటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన చెంది చైతన్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సంస్కరణోద్యమాలు తెస్తారు. ఆ విధంగా పాలకులపై కూడా ఒత్తిడిని సృష్టిస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినా ఇటువంటి సామాజిక వర్గాల క్రియాశీలతపై సమాజాలు ఆశలు పెట్టుకుంటాయి. కానీ ఈ వర్గాలు నిష్క్రియాపరంగా మారటం ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. వారికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమాజం పట్ల కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా, ఈ సామాజిక ఉపద్రవం మరింత తీవ్రంగా మారకముందే, ఈ వర్గాలు కళ్ళు తెరవటం అవసరం. లేనట్లయితే, కొంతకాలంగా మారుతున్న కాల పరిస్థితుల ప్రభావాలు పెరిగి సమాజం మరింత ప్రమాదకరం అవుతుంది.
టంకశాల అశోక్
-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


