తమిళనాడు గవర్నర్ అనేక బిల్లులను, అవినీతి కేసులపై దర్యాప్తు అనుమతి ఫైళ్ళను, ఖైదీల విడుదల ప్రతిపాదనలను నెలల తరబడి నిలిపివేసి పరిపాలనను దెబ్బకొట్టారు. ఇలా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ‘ఇది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ గతంలో సూటిగా చెప్పింది. కానీ ఆశ్చర్య కరంగా, అదే అంశంపై, 14 ప్రశ్నలతో రాష్ట్రపతి కోరిన సలహా కేసులో (ప్రెసిడె న్షియల్ రిఫరెన్స్ కేసు) మాత్రం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ పీఠం అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. మన రాష్ట్రపతికి ధర్మాసనం అద్భుతమైన ‘సలహా’ రూపొందించింది. ఆ సలహా అర్థం ఇదీ: ఎ) గవర్నర్‌కు కాల గడువు (టైమ్ లిమిట్) విధించలేం. బి) రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టు ప్రశ్నించలేదు. (సి) గవర్నర్ పరిపాలనను నిలి పేసినా, ఏమీ చేయలేం. ఎంత అన్యాయం? దేశ ప్రధాన న్యాయ మూర్తి తన పదవీ విరమణ చేయడానికి ముందు ఇటువంటి సలహా తీర్పును ఇచ్చి రాజ్యాంగ ఆత్మకు, ఫెడరలిజానికి, పరిపాలనా సమతౌల్యానికి పెద్ద దెబ్బ కొట్టారు.
కేంద్ర ప్రతినిధిగా మార్చే పరిస్థితి
ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సలహా ఎందుకు ప్రమా దకరం? దీనివల్ల ఒక్క తమిళనాడుకే కాదు, ప్రతి బీజేపీయేతర రాష్ట్రంలో కొత్త రాజ్యాంగ సంక్షోభం వచ్చిపడింది. బిల్లులు గవర్నర్ దగ్గరే నెలల తరబడి నిలిచిపోవడం, విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ నియామకాల్లో పూర్తిగా పక్షపాతం, అవినీతి కేసుల్లో అభియోగ అనుమతులపై నిర్ణయాలు పెండింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియా మకాల నిలిపివేత వంటి దారుణమైన వైఫల్యాలకు ఈ సంక్షోభం కారణం కానుంది. అంతా గవర్నర్ ఇష్టం ప్రకారం చేయడానికి ఉంటే ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించడం సాధ్యమా? ఫైళ్ళు, నియామకాలు అన్నీ ఆగిపోయే పనులను గవ ర్నర్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇది రాజ్యాంగా ధికారి అయిన రాజ్ ప్రముఖ్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మార్చే పరిస్థితి. రాష్ట్రపతి గారు సార్వభౌమ ప్రజల తరఫున పనిచేసే అత్యున్నత రాజ్యాంగాధికారే. కానీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం వారు నియమించేవారు. (ఎన్నికల్లో గెలవకుండా) ఎంపిక చేయబడినవారే రాజ్ ప్రముఖ్ అవుతారు. ఈ సలహా వంటి తీర్పు వల్ల రాష్ట్రపతినీ, గవర్నర్‌నూ ఒకే స్థాయిలో గానీ, హోదాలో గానీ (కాన్‌స్టిట్యూషనల్ పెడెస్టల్) పెట్టడం రాజ్యాంగ ఆత్మను అవమానించడమే!
సరైన కాలం అంటే?
గవర్నర్ల రాజకీయ పక్షపాతం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెను సమస్యగా మారింది. ‘గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసు కోవాలి’ అని సుప్రీంకోర్టు తన సలహా తీర్పు వెలువరించింది. ఎంత వ్యవధి సమంజసం? ఒక నెల సరైనదా? ఒక సంవత్సరం సరైనదా? మూడు సంవత్సరాలు సరైనవా? ఎవరికీ తెలియదు. ఈ అస్పష్టత రాజకీయ పక్షపాతంతో వ్యవహరించే గవర్నర్లకు పెద్ద ఆయుధం. దీనివల్ల పరిపాలన నిలిచిపోతుంది, లెజిస్లేచర్ సంక ల్పానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజాభిప్రాయం నీరుగారిపోతుంది. గవర్నర్ ‘రబ్బర్ స్టాంప్’ కాదు. కానీ పాలనకు స్పీడ్ బ్రేకర్ అయిపోవడం న్యాయమా? గవర్నర్ బిల్లులను ఆపాలని అనుకుంటే పూర్తిగా ఆపగలిగే అవకాశం కొనసాగుతుంది. ఒకసారి బిల్లును ఆమోదించకుండా అసెంబ్లీకి తిప్పిపంపిన తరువాత, మళ్లీ అదే బిల్లును పంపితే గవర్నర్ వెంటనే ఒప్పుకోవాలి. కానీ ఆ పనీ చేయ కుండా, రాష్ట్రపతికీ పంపకుండా వదిలేస్తూ పోతూ ఉంటే పరిపాలన స్తంభించిపోతుంది. ఈ లోగా అయిదేళ్ల పాలన ‘కాలధర్మం’ చెందు తుంది. బిల్లులు, చట్టాలను నిష్క్రియ, ఆలస్యాలతో చంపేస్తారా? చేతలలో చంపరు. కానీ తిండి ఇవ్వక వదిలేస్తే వాడే చస్తాడు అన్నట్టుంది.
ఫెడరలిజంపై చావు దెబ్బ
సమాఖ్య విధానంలో కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు సమతౌల్యంగా ఉండటం కీలకం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సలహా (అడ్వైజరీ ఒపీని యన్) రాష్ట్రం ఆమోదించిన బిల్లులను... రాష్ట్ర ప్రజా మద్దతుతో వచ్చిన లెజిస్లేచర్ బిల్లులను, గవర్నర్ ఒకరే నెలల తరబడి అడ్డుకునే పరిస్థితిని అన్యాయంగా రాజ్యాంగబద్ధం చేసిపెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. కేంద్ర అధికారుల అతి చర్యలను బలపరుస్తుంది. అంతేగాక ఫెడరలిజం మూల సూత్రానికి విరుద్ధం అవుతుంది. ఈ సలహా తీర్పులో ‘‘రాజ్యాంగాధికారులు తమ విధులు నిర్వ ర్తించకపోతే కోర్టు నిష్క్రియగా ఉండదు’’ అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఈ సలహా వినాల్సిన అవసరం లేదు. గడువు (టైమ్ లైన్) పెట్టలేమనీ, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి నిర్ణయాలను ప్రశ్నించలేమనీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కచ్చితంగా అటువంటి అధికారాలను వాడుకుంటాయి. అంటే, మన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సమస్యను గుర్తించినప్పటికీ, పరిష్కారాన్ని చూపలేదన్న మాట! ఇది ఫెడరల్ రాజ్యాంగ సంక్షోభ నివారణకు సరైన మార్గం కాదు.
గవర్నర్ తన ఇష్టానుసారం ఆలస్యాలు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్య సంకల్పాన్ని, రాష్ట్రాల పరిపా లనను అణగదొక్కడం అవుతుంది. అధికారాలను సరిగ్గా సమంగా విభజించే సిద్ధాంతాన్ని వక్రీకరించడం అవుతుంది. ఇది రాజకీయ అవినీతి మాత్రమే కాదు. రాజ్యాంగ అనైతికం కూడా అవుతుంది. ఈ అవినీతిని ఆపడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సలహా తీర్పు ప్రభావంతమైన పరిష్కారం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకం. ఆర్టికల్ 143 కింద ఇచ్చే కోర్టు సలహా బైండింగ్ కాదు. అందుకే రాజ్యాంగాన్ని మనస్సాక్షి ప్రకారం, నమ్మిన దేవుడి ముందు ప్రమాణం చేసిన అత్యున్నతాధికారి అయిన రాష్ట్రపతి గారూ! మీ ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. మీరు మన రాజ్యాంగపు ఆత్మను రక్షించవలసిన బాధ్యత కలిగినవారు. ఫెడరల్ సమతౌల్య తను, ప్రజాస్వామ్య కర్తవ్యాలను పరిరక్షించవలసి ఉంటుంది. కనుక రాజ్యాంగ విరుద్ధమైన, ఫెడరలిజాన్ని బలహీనపరిచే ఈ అడ్వై జరీ ఒపీనియన్‌ను తిరస్కరించడం రాష్ట్రపతి ప్రాథమిక రాజ్యాంగ బాధ్యత.

మాడభూషి శ్రీధర్
-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్


