అభిప్రాయం
ఏది సమస్య? ఏది పరిష్కారం? మధ్య భారతంలో ముఖ్యంగా అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్ష ఉద్యమాలు–తీవ్రవాదం, హింస –ప్రతిహింస విషయంలో ఇటీవలి పరిణా మాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. హింస ఆగటం లేదు, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. మౌలిక సమస్యను పరిష్కరించకుండా జరిపే ప్రక్రియ అర్థంలేని గమ్యం వైపు సాగుతోందన్నది ఈ ఆందోళనకు కారణం. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన ‘హిడ్మా’ మరణానంతరం చర్చ తీవ్రస్థాయికి చేరింది.
వచ్చే (2026) మార్చి మాసాంతానికి నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. హింస ఏదైనా హింసే! చావులు ఎటువైపున జరిగినా క్షోభ తప్ప దనేది జనాభిప్రాయం! కూంబింగ్ ఆపితే ఆయుధాలు వీడుతామనే కొత్త మాట మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి తాజాగా మొదలైంది. మధ్య భారతంలోని మూడు (ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర) రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు లేఖలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.
ఇదే అదనుగా, ఆయుధాల అంశం బెట్టు చేయ కుండా కేంద్రం చొరవ తీసుకోవాలి. చర్చలతో శాంతి సాధనకు యత్నిస్తూనే, నక్సలైట్ల ఎజెండా అంశాల్ని పరిష్కరించాలి. నక్సలైట్లు లేవనెత్తే సమస్యల్ని ‘సామాజికార్థికాంశం’గా చూడకుండా, ‘నక్స లైట్ల’నే శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వాలు పరిగణించడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది.
‘హిడ్మా’ ఎందుకు హీరో అయ్యాడు?
వరుస ప్రభుత్వాల వైఫల్యం దృష్ట్యా సమస్యల పరిష్కారానికి ఆయన నిలబడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులను, సాయుధ బలగా లను, రాజ్యాన్ని ఎదిరించాడు. ఉద్యమం వల్ల లభించిన పుష్కల అవకాశాలతో ఇంటికో, తల్లికో, తనకో, తన వారికో ఏదీ చేసుకో కుండా ఆదివాసీల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన త్యాగానికి మరణానంతరమూ విశేష ఆదరణ లభించింది. ఇపుడు హిడ్మాను హతమార్చారు. రేపు మిగతా నక్సలైట్లను లొంగదీసు కోవడమో, చంపడమో చేస్తారు.
అది, కొంత మేరకే సమాధానం. మౌలికమైన ప్రజల సమస్యకు పరిష్కారం కాదు. నక్షత్రాల స్థానాలు –కదలికల ఆధారంగా రూపొందించే పంచాంగాలను బట్టి ముహూ ర్తాలు, శకునాలు చెబుతారు. ఆవేశంతో ఎవరో పంచాంగాలు చింపేయడమో, కాల్చేయడమో చేసినంత మాత్రాన అంతా అయి పోతుందా? నక్షత్రాలుంటాయి కదా. అవి కదా మూలం! ఉద్యమకారుల్ని చంపేయడం, ఉద్యమాల్ని అణచివేయడం కాకుండా, ఉద్యమాలు తలెత్తడానికి కారణమవుతున్న మౌలికాంశాల్ని సరిదిద్దడం ద్వారా ఉద్రిక్తతల్ని, అశాంతిని నిర్మూలించాలి. ఇదే విషయాన్ని అత్యున్నత నిపుణుల కమిటీ 2008లోనే చెప్పింది.
అజిత్ దోవల్ సభ్యుడే!
మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కలిసిన అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో వామపక్ష హింసను రూపుమాపి, అభివృద్ధికి దోహద పడాలంటే ఏం చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపించింది. అశాంతి స్థానే శాంతి వెల్లివిరియాలంటే కేంద్రం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనీ, నక్సలైట్ల నిర్మూలన మాత్రమే ఇందుకు పరిష్కారం కాదనీ ఈ నిపుణుల కమిటీ 2008లోనే నివేదించింది.
నక్సలైట్ల హింసకు విరుగుడుగా స్థానిక ఆదివాసీ యువకులతో ‘ఎదురుదాడుల’ కోసం ప్రభుత్వ బలగాలు ఏర్పాటు చేసిన సాయుధ ‘సాల్వాజుడుం’ను 2011లో సుప్రీంకోర్టు నిషేధించడానికి మూడేళ్లు ముందరే, ‘ఆ వ్యూహం, అటువంటి ఆచరణ తప్పు’ అని ఈ కమిటీ నిర్ద్వంద్వంగా చెప్పింది. నివేదికను రూపొందించిన డ్రాఫ్టింగ్ సబ్ కమిటీలో తెలుగు వాడైన దివంగత హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ కీలకపాత్ర పోషించారు.
కేంద్ర ప్రణాళికా సంఘం 2006లో, డి. బంధోపాధ్యాయ (కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్) అధ్యక్షతన 16 మంది సభ్యులతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ‘అసంతృప్తి, అశాంతి, తీవ్రవాదం– అభివృద్ధికి అవరోధం’ అంశంపై అధ్య యనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ‘నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సవాళ్లు’ పేరిట ఇచ్చిన సుమారు 90 పేజీల నివేదిక ఇది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలతో, 20 పేజీల మేర ఇందులో ‘నిర్దిష్ట సిఫారసులు’న్నాయి. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ‘జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ (మాజీ కేంద్ర నిఘా సంస్థ) ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ (పౌర స్పందన వేదిక కన్వీనర్), ఐపీఎస్‌లు సహా పలు ఇతర రంగాల వారు సభ్యులుగా ఉన్నారు.
ఉద్యమాలకు తావీయొద్దు!
అటవీ, అదివాసీ ప్రాంతాల్లో, బడుగు–బలహీనవర్గాల్లో ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే పరిష్కరిస్తూ, జన బాహుళ్యంలోకి నక్సలైట్లు చొరబడే, వారి మద్దతు కూడగట్టే ఆస్కారం లేకుండా చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. దేశంలో వామపక్ష తీవ్ర వాదం ఒక దశలో, ‘ముఖాముఖి యుద్ధ’ పరిస్థితికి వెళ్లింది. యుద్ధంలో వలెనే, ఎవరికి వారు వ్యూహ–ప్రతివ్యూహాలతో ఎదుటి వారి బలహీనతల్ని సొమ్ముచేసుకునే ఎత్తుగడలూ పన్నారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమాభివృద్ధి లేమి, హక్కుల హననం, సహజ వనరుల దోపిడీ వంటి పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకొని నక్స లైట్లు ప్రజల మద్దతు కూడగట్టారు.
కొన్నిచోట్ల ప్రభుత్వ సాయుధ బలగాలను మించి బలోపేతమయ్యారు. నక్సలైట్లలో గ్రూపులు, అనైక్యత, సిద్ధాంత క్షీణత, స్వార్థ–లంపెన్ శక్తుల ప్రవేశం... వంటి పరిస్థితుల్ని పోలీసు, మిలిటరీ, ప్యారా మిలిటరీ బలగాలు తమకు అనుకూలంగా మలచుకొని ఆధిపత్యం సాధించాయి. ఈ ఆధిపత్య పోరులో హింస పెరిగి, అశాంతి తీవ్రంగా ప్రబలింది. దీనిపై అధ్యయనం తర్వాత నిపుణుల కమిటీ అయిదు ఛాప్టర్లుగా నివేదిక ఇచ్చింది. ‘పెసా’, భూగరిష్ఠ పరిమితి వంటి ప్రస్తుత చట్టాల పకడ్బందీ అమలు, జీవనోపాధుల కల్పన, సాంఘిక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల లోపరహిత అమలు
.. ‘సాల్వా జుడుం’ వంటి రాజ్యాంగేతర సాయుధ దళాలు కాకుండా రాజ్యం తన బాధ్యతను రాజ్యాంగ పరిధిలో నిర్వహించడం, మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించడం, పాలనను మానవీకరించి ఆదివాసీల సమస్యలు, ఫిర్యాదుల్ని ఎప్పటి కప్పుడు పరిష్కరించడం వంటి చర్యల్ని చేపట్టాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రజలకు దన్నుగా నక్సల్స్ చేస్తున్న పనుల్ని ప్రభు త్వమే ముందు చేసి వారికి జనహృదయాల్లో తావు లేకుండా చేయా లని కమిటీ సూచించింది. ఇవన్నీ చిత్తశుద్ధితో చేపడితే, అసమాన తలు కొంతైనా తొలగి ఉద్యమాలకు తావులేని వాతావరణం ఉంటుందని ప్రభుత్వాలు గ్రహించాలి.

దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్


