- డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు ముందుకు..
- వెనెజువెలా మధ్యంతర అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం
- నికోలస్ మదురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
- మరో దేశానికి వలస కాలనీగా ఉండలేమని తేల్చిచెప్పిన రోడ్రిగ్స్
- అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని వెల్లడి
- అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు చర్చ
కరాకస్: ఏళ్ల తరబడి వెనెజువెలాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చిట్టచివరకు అమెరికా జైలులో విచారణ ఖైదీలుగా మారిపోయారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను పోటెత్తిస్తున్నారన్న ప్రధాన ఆరోపణలతో అపహరించి బందీలుగా పట్టుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం వీళ్లిద్దరినీ న్యూయార్క్‌లోని బ్లూక్లిన్ ప్రాంతంలోని మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉంచింది.
శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి మదురో దంపతులు బంధించి రాత్రి కల్లా విమానంలో న్యూయార్క్ శివారు ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ మన్‌హట్టన్‌కు తీసుకెళ్లారు. తర్వాత డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మిని్రస్టేషన్(డీఈఏ) ఆఫీసుకు చేర్చారు. అక్కడ కొద్దిసేపు ఆయనను ప్రశ్నించారు. ఇద్దరు డీఈఏ ఏజెంట్లు మదురో చేతులు పట్టుకొని తీసుకెళ్తున్న వీడియోను వైట్‌హౌస్ విడుదల చేసింది. ఇందులో మదురో నవ్వుతూ కనిపిస్తున్నారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో సోమవారం ఆయనను మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చబోతున్నారు.
వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం
అమెరికాలోకి మాదక ద్రవ్యాలను చేరవేసినందుకు తమ దేశ చట్టాల ప్రకారమే మదురోను విచారించి, శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులపై త్వరలో విచారణ ప్రారంభించనున్నారు. ట్రంప్‌పై అమెరికాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వైట్‌హౌస్ బయట నిరసనకు దిగారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణం
వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆదివారం తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణంచేశారు. అధ్యక్షురాలిగా ఆమెతో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం చేయించింది. అమెరికాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలు ప్రమాణం చేయడం గమనార్హం. మరో దేశానికి తమ దేశం ఒక వలసకాలనీగా ఉండబోదని ఆమె కరాఖండీగా తేల్చి చెప్పారు. అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని రోడ్రిగ్స్ ఆగ్రహంగా మాట్లాడారు. ఎంతమంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అమెరికా ఆధిపత్యం తమపై చెల్లదని వెనెజువెలా రక్షణ మంత్రి జనరల్ వ్లాదిమిర్ పాడ్రినో స్పష్టంచేశారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కచ్చితంగా కాపాడుకుంటామని వ్లాదిమిర్ చెప్పారు.
సమష్టిగా పాలన: ట్రంప్
మదురోను అదుపులోకి తీసుకొని, పదవి నుంచి దించేయడం ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్ రవాణాను కట్టడి చేసే విషయంలో ముందడుగు వేశామని ట్రంప్ చెప్పారు. ‘‘వెనెజువెలా ప్రభుత్వ పగ్గాలను మరొకరికి భద్రంగా అప్పగించేదాకా సమష్టిగా ఆ దేశాన్ని పరిపాలిస్తాం. ఇందుకు మదురో సన్నిహితుల సాయం కూడా తీసుకుంటాం. పాలనలో వారి భాగస్వామ్యం ఉంటుంది’’ అని అన్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్‌కు ట్రంప్ అభినందనలు తెలియజేయడం విశేషం.
ముప్పుగా మారిన వారిని శిక్షించక తప్పదు
ఇతర దేశాలకు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై పెత్తనం చెలాయించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. వెనెజువెలా ఇప్పటికే తమ అ«దీనంలో ఉందని వెల్లడించారు. అమెరికా సార్వ¿ౌమత్వానికి, ప్రజల జీవితాలకు ముప్పుగా మారిన వారిని శిక్షించి తీరుతామని తేల్చిచెప్పారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ ఫ్లోరిడాలో మిన్నంటిన సంబరాలు
మదురోను బంధించిన వార్త తెలిసి అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో స్థానికులు ఆనందంలో మునిగిపోయారు. వీరంతా ఒకప్పుడు వెనెజువెలా నుంచి వలసవచ్చిన వాళ్లే. వెనెజువెలా జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. హింసకు తాళలేక స్వదేశం వీడామని, ఇకపై నిర్భయంగా స్వదేశం చేరుకుని బంధువులను కలుస్తామని వాళ్లు ఆనందంతో చెప్పారు. మదురో పతనాన్ని కళ్లారా చూడాలని ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పుడ తమ కల నేరవేరిందన్నారు. తన పాలనను వ్యతిరేకించేవారిపై మదురో ఉక్కుపాదం మోపారు. దాంతో చాలామంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లిపోయారు.
భయంకరమైన కారాగారం
మదురోను నిర్బంధించిన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు భయంకరమైన కారాగారంగా పేరుంది. కరడుగట్టిన నేరగాళ్లు ఇక్కడ శిక్ష అనుభవ్చిస్తుంటారు. ప్రస్తుతం 1,336 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరి మధ్యనే మదురో కాలం గడపాల్సి ఉంది. ఈ జైలులో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శుభ్రత, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. ఖైదీల పట్ల సిబ్బంది రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఖైదీల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణం. హంతకులు, రేపిస్టులు, డ్రగ్స్ స్మగ్లర్లను ఈ జైలులో నిర్బంధిస్తుంటారు.
వెనెజువెలాలో ఎగసిన జ్వాలలు
శత్రుదేశ సైన్యం అమాంతం అధ్యక్షభవనంపై దాడి చేసి మదురోను ఎత్తుకెళ్లడంతో వెనెజువెలా వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా దమనకాండను నిరసిస్తూ వేలాది మంది స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. నిరసన ర్యాలీలు ఆదివారం పెద్ద ఎత్తున కొనసాగాయి. మదురోను పదవీచ్యుతుడిని చేయడంపై ఆయన మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ట్రంప్‌కు వ్యతిరేకంగా నినదించారు. మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మదురోను అమెరికా నిర్బంధించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తంచేయడం గమనార్హం. కొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నియంతృత్వపాలన ముగిసిపోయిందని ఆనందం వ్యక్తంచేశారు. వెనెజువెలాలో అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం చర్చ జరుగనున్నట్లు తెలిసింది.
యూఎస్ మీడియాకు ముందే తెలుసు!
వాషింగ్టన్: వెనెజువెలా రాజధాని కరాకస్‌పై ట్రంప్ ప్రభుత్వం సైన్యంతో చేయించిన రహస్య మెరుపు దాడి విషయం అమెరికా మీడియాకు ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలకు ముందే తెలుసని వార్తలొచ్చాయి. తమకు ముందే తెల్సిపోయిందన్న అత్యుత్సాహంలో విషయాన్ని లీక్‌చేసి కథనాలు ప్రచురించి అందరికీ బహిరంగపరిస్తే ఆ రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే అమెరికా సైనికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గ్రహించాయి.
అందుకే మీడియా సంస్థలు ఈ విషయంలో గోప్యత పాటించినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షభవనం వర్గాలకు, మీడియా సంస్థలకు ముందే తెలుసు అని అమెరికా న్యూస్ వెబ్‌సైట్ ‘సెమఫర్’ ఘటన తర్వాత ఒక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని బయట పెట్టడమా, లేదా అనే విషయంలో రెండు వార్తా సంస్థల్లో సీనియర్ ఎడిటర్ల స్థాయిలో గట్టి చర్చలే జరిగాయట. చివరికి గుట్టుగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సెమఫర్ చెప్పుకొచ్చింది.
జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా మీడియా సాంప్రదాయికంగా ఈ వైఖరినే పాటిస్తూ వస్తోందని సెమఫర్ గుర్తు చేసింది. ట్రంప్‌కు, ప్రధాన మీడియా సంస్థలకు నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ‘ఆపరేషన్ రిజాల్వ్’ విషయంలో సంయమనం పాటించడం గొప్ప విషయమేనని ఇతర మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.
సవాలు విసిరి దొరికిపోయాడు
‘దమ్ముంటే పట్టుకో’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా సవాలు విసిరిన నికోలస్ మదురో అదే అమెరికా సేనలకు దొరికిపోయాడు. ఆయన గత ఏడాది ఆగస్టులో తన అధికారిక నివాసంలో ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రా.. నిజంగా దమ్ముంటే వచ్చి నన్ను అరెస్టు చేసుకో. నీకు కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకు.. పిరికిపంద’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో ట్రంప్ సైన్యం అనుకున్నంత పని చేసి చూపించింది.
శనివారం మదురోను, ఆయన భార్యను వారి నివాసంలోనే అరెస్టు చేసి, న్యూయార్క్‌కు తరలించింది. మదురోపై అమెరికాలో సెటైర్లు పేలుతున్నాయి. మదురోపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వైట్‌హౌస్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టుచేసింది. ట్రంప్‌కు మదురో విసిరిన చాలెంజ్‌తోపాటు అమెరికా సైనిక ఆపరేషన్, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యం ఇందులో ఉంది. ‘చివరకు ఏం జరిగిందో చూశారుగా, అరెస్టయ్యే అవకాశం మదురోకు దక్కింది’ అంటూ వైట్‌హౌస్ ముక్తాయింపునిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హ్యాపీ న్యూ ఇయర్
యూఎస్ అధికారులకు మదురో విషెస్
‘హ్యాపీ న్యూ ఇయర్’! అమెరికా నిర్బంధంలో ఉన్న కొలంబియా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా అధికారులతో పలికిన మాటలివి. శనివారం రాత్రి పొద్దుపోయాక యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయనను న్యూయార్క్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా వారికి మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తన జైలు గదికి చేరుకున్నాక వారికి గుడ్‌నైట్ సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో మదురో నలుపు రంగు హుడీ షర్టు వేసుకుని చేతులకు బేడీలతో ఓ హాల్ గుండా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిసి నడుస్తూ కన్పిస్తున్నారు.


