భారత్ కొత్త కార్మిక శకంలోకి ప్రవేశించిందనీ, ఇకపైన కార్మిక నిబంధనలు మారటంతో పాటు వారి సంక్షేమం మెరుగుపడుతుందనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను క్రమబద్ధీకరించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను ప్రారంభించారు. ‘వికసిత భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ సంస్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు.
వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, హెల్త్, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ (2020) అనే ఈ నాలుగు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కార్మికుల ఉపాధికి, సామాజిక భద్రతకు వీటి ద్వారా పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
పీవీ నరసింహారావు నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతినాయకుడూ పాత కార్మిక చట్టాలు అభివృద్ధికి అవరోధం అంటు న్నారు. అయితే సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేక పోయారు.
1999లో కార్మిక చట్టాల సవరణకు ఉద్దేశించిన రెండో నేషనల్ కమిషన్... వివిధ చట్టాలలో ఉన్న అసమతౌల్యాన్ని గుర్తించింది. ఒకే అంశానికి సంబంధించిన నిర్వచనాలు ఒక చట్టంలో ఒక రకంగా, ఇంకో చట్టంలో మరో రకంగా ఉండటాన్ని ప్రస్తావించింది. చివరకు పరిస్థితి ఎలా తయారైంది అంటే... ‘కనీసం 20 శాతం నిబంధ నలను విస్మరించకపోతే 100 శాతం కార్మిక చట్టాలను అమలు చేయటం కష్టం’ అన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు మన కార్మిక విధానాల్లో సంక్లిష్టత; చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే ఉండే తేడాలపైన చాలా కాలంగా చర్చ సాగుతోంది.
కోవిడ్ సమయంలో తగినంత ఉద్యోగ భద్రత లేక ఉపాధి కోల్పోయి వీధిన పడిన కుటుంబాలు కొత్త కార్మిక చట్టాలను స్వాగ తిస్తున్నాయి. కార్మికులకు తప్పనిసరిగా అప్పాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వటం. అందరికీ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే... పీఎఫ్, ఈఎస్‌ఐసీ, బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తారనే అంశాన్ని ప్రశంసిస్తున్నాయి. 40 ఏళ్లకు పైనున్న వారికి ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించాలనీ, యాజమాన్యాలు తమ వార్షిక ఆదాయంలో 1 నుంచి 2 శాతాన్ని సామాజిక భద్రత కవరేజ్‌కి వెచ్చించాలనీ ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే కార్మికులకు ఆధార్‌తో జత చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా ... వారు ఒకే రకమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.
ఏడాది పాటు పనిచేసినా గ్రాట్యుటీ వంటి సౌకర్యాలను అందు కోగలుగుతారు. మహిళలు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు. అందుకు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. దాంతో కేంద్ర కార్మిక శాఖ ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో 15 లక్షల మంది నమోదయ్యారు. మొత్తంగా 40 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణ మరేదీ లేదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇది కార్మి కుల్లో సాధికారతను పెంచటమే కాదు, నిబంధనలను సరళతరం చేసి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రమోట్ చేస్తుందని అంటు న్నారు. అయితే, దీని వెనక పెద్ద కుట్ర ఉందనీ, కార్మికుల చేత వారా నికి 12 గంటలు పని చేయించాలనే ప్రణాళిక ఉందనీ ట్రేడ్ యూని యన్లు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే వారానికి 70
గంటలు పనిచేస్తే తప్ప ప్రపంచ దేశాలతో పోటీపడలేమని మేధావి వర్గం చెబుతూ వస్తున్న మాటలను ఉటంకిస్తున్నాయి.
– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్


