సోషల్‌ ఇంజినీరింగ్‌పై దృష్టి పెట్టాలి! | Venugopal Guest Column On Social Engineering | Sakshi
Sakshi News home page

సోషల్‌ ఇంజినీరింగ్‌పై దృష్టి పెట్టాలి!

Nov 25 2025 7:33 AM | Updated on Nov 25 2025 7:49 AM

Venugopal Guest Column On Social Engineering

ఏ ఉద్యమమైనా, సామాజిక సంస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా – సమా జంలోని అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం వహించేలా నాయకత్వాన్ని రూపొందించడానికి ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’ ముఖ్య సాధనం. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పని  చేస్తున్న రోజులవి. తిరుపతిలో జరిగిన ఒక పార్టీ సమావేశంలోని మరచిపోలేని అనుభవం గుర్తుకు వస్తున్నది. సమావేశం మధ్యలో ఒక కార్యకర్త లేచి నిలబడి, వేదిక మీద కేవలం అగ్రకులాలకు చెందిన నాయకులే ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించాడు. నేను కూడా ఆ వేదిక మీదే ఉన్నాను. నిజమే – వేదిక మీద ఉన్నవారంతా అగ్రకులాలకు చెందినవారే. ఆ కార్యకర్త ప్రశ్న నా హృదయాన్ని తాకింది. అది పరిశీలించదగిన, స్పందించదగిన ప్రశ్నగా అనిపించింది.

2003 వరకు అదే బాధ్యతలో ఉన్నంత కాలం ఈ అంశాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో నేను కృషి చేశాను. అనేక వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. సమాజాభివృద్ధి కోసం పనిచేసే ప్రతి సంస్థ, ప్రతి ఉద్యమం ఈ సూత్రాన్ని తప్పనిసరిగా అనుసరించాలి కూడా!

ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన కుగ్రామంలోని బీసీ యువకుడికి ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ మనవాడే ప్రధాని అన్న గర్వంతో, సంతృప్తితో అతని కళ్లు మెరిసిపోతాయి. ఈ విష యాన్ని విస్మరించి ముందుకు సాగే సంస్థలు, ఉద్యమాలు ఎప్పటికీ విజయవంతం కాలేవనేది నా గట్టి నమ్మకం.

తెలివితేటలు, చిత్తశుద్ధి, పట్టుదల, త్యాగనిష్ఠ – ఇవి ఏ ఒక్క కులానికో పరిమితం కావు. అన్ని కులాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ ఈ లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తులు ఉన్నారు; ఉంటారు. వారిని గుర్తించి, ప్రోత్సహించి, వివిధ బాధ్యతల్లోకి తేవడమే నిజమైన నాయకుడి సమర్థత. కానీ ఇది ఎందుకు జరగడం లేదు? తీవ్రవాద ఉద్యమాల్లో అగ్రకులాల ఆధిపత్యం గురించిన చర్చ గట్టిగానే జరి గింది. సోషల్‌ ఇంజినీరింగ్‌ను అమలు చేయకపోవడమే అందుకు కారణం. 

సమాజం సజావుగా, శాంతియుతంగా ముందుకు సాగాలంటే రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలకే పరిమితం కాకూడదు; ప్రైవేటు వ్యాపార సంస్థల్లోనూ ఇవి అమలు కావాలి. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వస్తే క్వాలిటీ పడిపోతుంది అని వాదిస్తారనడంలో అనుమానం లేదు; కానీ అది వాస్తవం కాదు. ఇటీవల వార్తల్లో ‘ఆపరేషన్‌ కగార్‌’ ప్రధానాంశంగా నడుస్తు న్నది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపించిన పేరు – హిడ్మా.
ఎందరో సీనియర్‌ నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించినా, లొంగి పోయినా హిడ్మా పేరు మాత్రమే ఇంతటి సంచలనం సృష్టించింది. కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన ఒక గిరిజనుడైన హిడ్మాలో అపారమైన మేధ, వ్యూహాత్మక దక్షత, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. హిడ్మా ఎన్ను కున్న హింసాత్మక మార్గాన్ని నేను వందశాతం ఖండిస్తాను. కానీ ఆ గిరిజన యువకుడిలో ఉన్న అసామాన్య సమర్థతలు, చిత్తశుద్ధి, లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం – వీటిని గుర్తించక తప్పదు కదా! సమాజంలోని అన్ని కులాల్లోనూ, అన్ని వర్గా ల్లోనూ ఇలాంటి యోగ్యులు ఉంటారనడంలో సందేహం లేదు. వారిని గుర్తించి, తగు శిక్షణ ఇచ్చి, అవకాశాలు కల్పిస్తే – ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం సిద్ధిస్తుంది.

పి. వేణుగోపాల్‌, వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్‌’ ఛైర్మన్‌
pvg2020@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement