నూరేళ్ల కింద పి.సి.మహాలనోబిస్ స్థాపించిన ఐఎస్‌ఐని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. సంస్థ ప్రెసిడెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది. ఇది వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే.
దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అనూహ్యమైన, విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీజే అబ్దుల్ కలామ్ లాంటి శాస్త్రవేత్తను తమ ‘ఫెలో’గా చేర్చుకునేందుకు నిరాకరించిన జాతీయ సైన్స్ అకాడమీ ఇప్పుడు పారిశ్రా మిక వేత్త ముకేశ్ అంబానీకి ఆ హోదా కల్పించింది. ఇప్పటివరకూ ఈ సభ్యత్వం విద్య, పరిశోధన రంగాల్లో అద్భుత మైన రాణింపు ఉన్న వారికి మాత్రమే దక్కేది.
ఢిల్లీలోని ఓ అగ్రశ్రేణి సంస్థ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేక పోయినా కేవలం అక్కడి ప్రభుత్వ కోరిక తీర్చేందుకు వాయు కాలు ష్యాన్ని తగ్గిస్తామన్న మిషతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేసింది. వనరులు లేకపోవడం కారణంగా సైకిల్‌పై రాకెట్లు మోసు కెళ్లారని దేశ అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌ని ఓ కేంద్ర మంత్రి అగౌరవపరిచారు. ఎందుకు? అంత రిక్ష రంగంలో సాధించిన ఘనతలన్నింటికీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం అందించిన సహకారమే కారణమన్న వాదనకు బలం చేకూర్చేందుకు! ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివని అనిపించవచ్చు గానీ... శాస్త్ర పరిశోధన సంస్థలు ఒక్కటొక్కటిగా తమ స్వతంత్రతను కోల్పోతున్నాయనేందుకు మచ్చుతునకలు. కొన్నింటిని బలవంతంగా లొంగదీసుకుంటే... మిగిలినవి స్వచ్ఛందంగా చేతులెత్తేశాయి.
ప్రధాని మాటనే కాదన్న ఇస్రో
ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాన్ని కూడా కాదనే ధైర్యం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కనబరచడం గతకాలపు మాట గానే మిగిలిపోనుంది. 1980లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భారతీయ వ్యోమగామిని భాగం చేయాలని ఇందిర కోరితే, ‘ఇస్రో’ దాన్ని తన బలమైన వాదనతో తిరస్కరించింది. ధిక్కారం కాదది. దేశ ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడే ఉపగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నందున మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వనరులను ఖర్చు చేయలేమని చెప్పడం! ప్రధాని ఇందిర కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ దశలోనే ఇందిర భారత వ్యోమ గామిని అంతరిక్షంలో పెట్టే బాధ్యతను భారతీయ వాయుసేనకు అప్పగించింది. దీని ఫలితమే 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లడం! కాగితంపై ‘ఇస్రో’ ఇప్పటికీ స్వతంత్ర సంస్థే. కానీ సంస్థ వ్యవస్థాపకుడిని కేంద్ర మంత్రి ఒకరు అగౌరవపరిచినా సరిదిద్దలేని స్థితికి చేరింది.
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) పరిస్థితి కూడా ఇంతే. దశాబ్దాలుగా ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి చేరింది మాత్రం ఇటీవలే. జన్యు మార్పిడి ఆహారం వివాదం 2010లో పతాక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంస్థ రెండు ఇతర సైన్స్ అకాడమీలతో కలిసి ప్రభుత్వ అభి లాషకు భిన్నంగా స్పష్టమైన వైఖరి కనబరిచింది. జన్యుమార్పిడి పంటల భద్రత, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై క్షుణ్ణమైన అధ్యయనం జరిగి తీరాల్సిందేనని భీష్మించింది.
2018లో కేంద్ర మంత్రి ఒకరు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాళి చేసిన సందర్భంలో కూడా ఐఎన్‌ఎస్‌ఏ, ఇతర సంస్థలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. బోధనాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొల గించాలన్న మంత్రిగారి ఆలోచనను తప్పుబట్టాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సంస్థలు సైద్ధాంతిక వైఖరికి కట్టుబడ్డాయి. తమ స్వతంత్రతపై దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.
శాస్త్రవేత్తలు కానివారికి సభ్యత్వమా?
ప్రస్తుతానికి వస్తే.... శాస్త్రవేత్తలు కాని పారిశ్రామికవేత్తలకు కూడా సభ్యత్వం ఇవ్వడం అవసరమని ఐఎన్‌ఎస్‌ఏ ఒక అంచనాకు వచ్చింది. సభ్యత్వం ఇవ్వడం కాకుండా... పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేందుకు అనువైన కార్యక్రమాలను రూపొందించి ఉంటే, వేదికలను ఏర్పాటు చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధన సంస్థ కూడా తమ రంగంలో తగిన అర్హతలు లేనివారికి సభ్యత్వం కట్టబెట్టదు. సత్యేన్ బోస్, మేఘనాథ్ సాహా, హోమీ జహంగీర్ భాభా, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల పక్కన ఇప్పుడు అంబానీకి చోటు కల్పిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని సైన్స్ అకాడమీలకు మార్గదర్శకంగా భావించే సంస్థ లండన్‌లోని ‘ద రాయల్ సొసైటీ’. ఇది కూడా శాస్త్రవేత్తలు కానివారు, అంటే పారిశ్రామిక రంగంలో పరిశోధనలు చేసేవారికి సభ్యత్వం ఇస్తుంది. అయితే, ఆ యా రంగాల్లో జ్ఞానాభివృద్ధికి వారు తగినంత కృషి చేసి ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొందరు పారిశ్రామిక వేత్తలకు ఐఎన్‌ఎస్‌ఏ సభ్యత్వం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి.
కన్ను ఇప్పుడు గణాంక సంస్థపై..
కేంద్రం దృష్టి ప్రస్తుతం కోల్‌కతాలోని ఐఎస్‌ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్)పై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ వందేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. గణితం, గణాంక శాస్త్రం, అప్లైడ్ సైన్సెస్‌లో ఎన్నదగ్గ పరిశోధనలు చేసిన సంస్థ ఇది. పరిపాలన వ్యవహారాలన్నీ తనంతట తాను నిర్వహించుకుంటుంది. లాభాపేక్ష లేని సంస్థ. అలాంటి ఐఎస్‌ఐ సొసైటీని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక బోర్డుకు అప్పగించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. సంస్థ ప్రెసి డెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది.
ఐఎస్‌ఐకి చెందిన స్థిరచరాస్తులన్నింటినీ కూడా ఈ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందని బిల్లు స్పష్టం చేస్తూండటం గమనార్హం. ఇది విద్యా సంస్థల స్వతంత్రతపై దాడే! వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే!! సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఏదో గుప్తమైన ఆలోచన కాదు. బోధనాంశాలపై చర్చలు జరిపి మరింత ప్రభావశీలం చేసేందుకు అవకాశం కల్పించేది. విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
అలాంటి ఈ వ్యవస్థకు బదులుగా ఢిల్లీ బ్యూరోక్రాట్ల అజమాయిషీ పెట్టడం బోధనాంశాల నాణ్యత, స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. 1959 నాటి చట్టం పరిధిలో పనిచేసే ఐఎస్‌ఐ సొంతంగా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయగలదు. కొత్త బిల్లులో ఈ అంశం ప్రస్తావన లేదు. ఐఎస్‌ఐకి బదులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే పట్టాలిస్తుందన్న అను మానాలు కలుగుతున్నాయి. తద్వారా ఇది దేశంలోని అనేక ఇతర విద్యాసంస్థల్లో ఒకటిగా మాత్రమే మారిపోనుంది. విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వేచ్ఛగా ఆలోచించేందుకు అకడమిక్ ఫ్రీడమ్ అన్నది ఎంతో కీలకం.
ప్రశ్నించడం, భయం, విమర్శలకు బెదరకుండా భావాలను వ్యక్తం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పరిశోధనలు, బోధన తాలూకూ సమగ్రతను కాపాడుతుంది. పొలిటికల్, బ్యూరోక్రటిక్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం, ప్రభావాలను తొలగించేందుకు వ్యవస్థాగతమైన స్వాతంత్య్రం అవసరం. ఇది కాదని... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే... శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న స్థానానికే చేటు కలిగే ప్రమాదం ఉంది.

దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


