breaking news
Statistical experts
-
శాస్త్ర స్వతంత్రతకు గొడ్డలిపెట్టు
నూరేళ్ల కింద పి.సి.మహాలనోబిస్ స్థాపించిన ఐఎస్ఐని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. సంస్థ ప్రెసిడెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది. ఇది వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే.దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అనూహ్యమైన, విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీజే అబ్దుల్ కలామ్ లాంటి శాస్త్రవేత్తను తమ ‘ఫెలో’గా చేర్చుకునేందుకు నిరాకరించిన జాతీయ సైన్స్ అకాడమీ ఇప్పుడు పారిశ్రా మిక వేత్త ముకేశ్ అంబానీకి ఆ హోదా కల్పించింది. ఇప్పటివరకూ ఈ సభ్యత్వం విద్య, పరిశోధన రంగాల్లో అద్భుత మైన రాణింపు ఉన్న వారికి మాత్రమే దక్కేది.ఢిల్లీలోని ఓ అగ్రశ్రేణి సంస్థ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేక పోయినా కేవలం అక్కడి ప్రభుత్వ కోరిక తీర్చేందుకు వాయు కాలు ష్యాన్ని తగ్గిస్తామన్న మిషతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేసింది. వనరులు లేకపోవడం కారణంగా సైకిల్‌పై రాకెట్లు మోసు కెళ్లారని దేశ అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ని ఓ కేంద్ర మంత్రి అగౌరవపరిచారు. ఎందుకు? అంత రిక్ష రంగంలో సాధించిన ఘనతలన్నింటికీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం అందించిన సహకారమే కారణమన్న వాదనకు బలం చేకూర్చేందుకు! ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివని అనిపించవచ్చు గానీ... శాస్త్ర పరిశోధన సంస్థలు ఒక్కటొక్కటిగా తమ స్వతంత్రతను కోల్పోతున్నాయనేందుకు మచ్చుతునకలు. కొన్నింటిని బలవంతంగా లొంగదీసుకుంటే... మిగిలినవి స్వచ్ఛందంగా చేతులెత్తేశాయి.ప్రధాని మాటనే కాదన్న ఇస్రోప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాన్ని కూడా కాదనే ధైర్యం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కనబరచడం గతకాలపు మాట గానే మిగిలిపోనుంది. 1980లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భారతీయ వ్యోమగామిని భాగం చేయాలని ఇందిర కోరితే, ‘ఇస్రో’ దాన్ని తన బలమైన వాదనతో తిరస్కరించింది. ధిక్కారం కాదది. దేశ ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడే ఉపగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నందున మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వనరులను ఖర్చు చేయలేమని చెప్పడం! ప్రధాని ఇందిర కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ దశలోనే ఇందిర భారత వ్యోమ గామిని అంతరిక్షంలో పెట్టే బాధ్యతను భారతీయ వాయుసేనకు అప్పగించింది. దీని ఫలితమే 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లడం! కాగితంపై ‘ఇస్రో’ ఇప్పటికీ స్వతంత్ర సంస్థే. కానీ సంస్థ వ్యవస్థాపకుడిని కేంద్ర మంత్రి ఒకరు అగౌరవపరిచినా సరిదిద్దలేని స్థితికి చేరింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) పరిస్థితి కూడా ఇంతే. దశాబ్దాలుగా ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి చేరింది మాత్రం ఇటీవలే. జన్యు మార్పిడి ఆహారం వివాదం 2010లో పతాక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంస్థ రెండు ఇతర సైన్స్ అకాడమీలతో కలిసి ప్రభుత్వ అభి లాషకు భిన్నంగా స్పష్టమైన వైఖరి కనబరిచింది. జన్యుమార్పిడి పంటల భద్రత, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై క్షుణ్ణమైన అధ్యయనం జరిగి తీరాల్సిందేనని భీష్మించింది.2018లో కేంద్ర మంత్రి ఒకరు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాళి చేసిన సందర్భంలో కూడా ఐఎన్ఎస్ఏ, ఇతర సంస్థలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. బోధనాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొల గించాలన్న మంత్రిగారి ఆలోచనను తప్పుబట్టాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సంస్థలు సైద్ధాంతిక వైఖరికి కట్టుబడ్డాయి. తమ స్వతంత్రతపై దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.శాస్త్రవేత్తలు కానివారికి సభ్యత్వమా?ప్రస్తుతానికి వస్తే.... శాస్త్రవేత్తలు కాని పారిశ్రామికవేత్తలకు కూడా సభ్యత్వం ఇవ్వడం అవసరమని ఐఎన్ఎస్ఏ ఒక అంచనాకు వచ్చింది. సభ్యత్వం ఇవ్వడం కాకుండా... పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేందుకు అనువైన కార్యక్రమాలను రూపొందించి ఉంటే, వేదికలను ఏర్పాటు చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధన సంస్థ కూడా తమ రంగంలో తగిన అర్హతలు లేనివారికి సభ్యత్వం కట్టబెట్టదు. సత్యేన్ బోస్, మేఘనాథ్ సాహా, హోమీ జహంగీర్ భాభా, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల పక్కన ఇప్పుడు అంబానీకి చోటు కల్పిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్ని సైన్స్ అకాడమీలకు మార్గదర్శకంగా భావించే సంస్థ లండన్‌లోని ‘ద రాయల్ సొసైటీ’. ఇది కూడా శాస్త్రవేత్తలు కానివారు, అంటే పారిశ్రామిక రంగంలో పరిశోధనలు చేసేవారికి సభ్యత్వం ఇస్తుంది. అయితే, ఆ యా రంగాల్లో జ్ఞానాభివృద్ధికి వారు తగినంత కృషి చేసి ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొందరు పారిశ్రామిక వేత్తలకు ఐఎన్ఎస్ఏ సభ్యత్వం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కన్ను ఇప్పుడు గణాంక సంస్థపై..కేంద్రం దృష్టి ప్రస్తుతం కోల్‌కతాలోని ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్)పై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ వందేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. గణితం, గణాంక శాస్త్రం, అప్లైడ్ సైన్సెస్‌లో ఎన్నదగ్గ పరిశోధనలు చేసిన సంస్థ ఇది. పరిపాలన వ్యవహారాలన్నీ తనంతట తాను నిర్వహించుకుంటుంది. లాభాపేక్ష లేని సంస్థ. అలాంటి ఐఎస్ఐ సొసైటీని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక బోర్డుకు అప్పగించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. సంస్థ ప్రెసి డెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది.ఐఎస్ఐకి చెందిన స్థిరచరాస్తులన్నింటినీ కూడా ఈ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందని బిల్లు స్పష్టం చేస్తూండటం గమనార్హం. ఇది విద్యా సంస్థల స్వతంత్రతపై దాడే! వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే!! సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఏదో గుప్తమైన ఆలోచన కాదు. బోధనాంశాలపై చర్చలు జరిపి మరింత ప్రభావశీలం చేసేందుకు అవకాశం కల్పించేది. విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.అలాంటి ఈ వ్యవస్థకు బదులుగా ఢిల్లీ బ్యూరోక్రాట్ల అజమాయిషీ పెట్టడం బోధనాంశాల నాణ్యత, స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. 1959 నాటి చట్టం పరిధిలో పనిచేసే ఐఎస్ఐ సొంతంగా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయగలదు. కొత్త బిల్లులో ఈ అంశం ప్రస్తావన లేదు. ఐఎస్ఐకి బదులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే పట్టాలిస్తుందన్న అను మానాలు కలుగుతున్నాయి. తద్వారా ఇది దేశంలోని అనేక ఇతర విద్యాసంస్థల్లో ఒకటిగా మాత్రమే మారిపోనుంది. విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వేచ్ఛగా ఆలోచించేందుకు అకడమిక్ ఫ్రీడమ్ అన్నది ఎంతో కీలకం.ప్రశ్నించడం, భయం, విమర్శలకు బెదరకుండా భావాలను వ్యక్తం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పరిశోధనలు, బోధన తాలూకూ సమగ్రతను కాపాడుతుంది. పొలిటికల్, బ్యూరోక్రటిక్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం, ప్రభావాలను తొలగించేందుకు వ్యవస్థాగతమైన స్వాతంత్య్రం అవసరం. ఇది కాదని... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే... శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న స్థానానికే చేటు కలిగే ప్రమాదం ఉంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
గణాంకాల్లో మన ఘన వారసత్వం
భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం భారత్ అసాధారణ ప్రేరణనిచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడం మనం సంతోషించాల్సిన విషయం. విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఉంటుంది. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురుషుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. భారత గణాంక సమాజం సంతోషించ డానికి కనీసం రెండు కారణాలు ఉన్నాయి. గణాంక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ బహుమతిని ఇండియన్–అమెరికన్ గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఆర్ రావుకు బహూకరించారు(ఈయన తెలుగువాడు). సైన్సును, టెక్నాలజీని, మానవ సంక్షేమాన్ని పురోగమింపజేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి కీలక విజయాలను సాధించినందుకు ప్రతి రెండేళ్ల కోసారి ఒక వ్యక్తికి లేదా బృందానికి ఈ అవార్డును అందజేస్తారు. గణాంక శాస్త్ర సిద్ధాంతాలకు దశాబ్దాలుగా సీఆర్ రావు అందించిన తోడ్పాటుకు ఇది నిస్సందేహంగా సరైన గుర్తింపు అని చెప్పాలి. మరొక విజయం, ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ (స్టాట్‌కమ్)కు భారత్ ఎన్నిక కావడమే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విధాన నిర్ణయం, పర్యవేక్షక పాత్రలో మన దేశం ఐక్యరాజ్యసమితి సంస్థలో తిరిగి చేరింది. 1947లో స్థాపితమైన స్టాట్‌కమ్... ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కౌన్సిల్ (ఎకోసాక్)కు చెందిన కార్యాచరణ కమిషన్. ఇది ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం (యూఎన్ఎస్డీ) పనిని పర్యవేక్షి స్తుంది. అలాగే ప్రభుత్వ విధానాలకు, ప్రైవేట్ కార్యాచరణకు తోడ్ప డేలా గణాంక సమాచార అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యం వైపుగా కృషి చేయడానికి ప్రపంచవ్యాప్త గణాంక శాస్త్రజ్ఞులను ఒక చోటికి తెస్తుంది. స్టాటిస్టికల్ కమిషన్, నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ/ఎయిడ్స్ జాయింట్ ప్రోగ్రామ్... వీటన్నింటికీ భారత్ ‘ఎకోసాక్’ ద్వారా ఎన్నికైంది. స్టాట్‌కమ్ వ్యస్థాపక పితామహుడు అమెరికన్ సామాజిక శాస్త్ర వేత్త, గణాంక శాస్త్రవేత్త అయిన స్టూవర్ట్ అర్థర్ రైస్. 1946 మేలో న్యూయార్క్‌లోని హంటర్ కాలేజీలో ‘న్యూక్లియర్ సెషన్’కు రైస్ అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్య సమితి పరిధిలో గణాంకాల కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు, దానికి అవసరమైన నిబంధనలను ఆనాటి సెషన్ సిఫార్సు చేసింది. స్టాట్‌కమ్ తొలి మూడు సెషన్లకు 1947–48 కాలంలో కెనడియన్ హెర్బర్ట్ మార్షల్ అధ్యక్షత వహించారు. ప్రపంచ గణాంక వ్యవస్థ రూపకల్పనను వేగవంతం చేయడం ద్వారా శాంతి కోసం ప్రపంచాన్ని కూడగట్టే ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలకు తోడ్పడటం అనే లక్ష్యాన్ని మూడో సెషన్ (1948) నివేదిక ప్రకటించింది. అంతర్జాతీయ గణాంకపరమైన కార్యకలాపాల కోసం ఏర్పడిన అత్యున్నత నిర్ణాయక విభాగమైన స్టాట్‌కమ్... గణాంకపరమైన ప్రమాణాలను రూపొందించడం; జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాటిని అమలు చేయడంతో సహా భావనలు, విధానాల అభివృద్ధి విషయంలో బాధ్యత తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల్లోని – మొత్తంగా 24 – కీలక గణాంక శాస్త్రవేత్తలను ఇది ఒకటి చేసింది. గత 76 సంవత్సరాల కాలంలో, కమిషన్ ప్రపంచమంతటి నుంచి ఒక చీఫ్ స్టాటిస్టీషియన్ నేతృత్వంలో నడుస్తూ వచ్చింది. గణాంకాలు, వైవిధ్యత, జనాభా రంగంలో భారతీయ నైపుణ్యమే ఐక్యరాజ్యసమితి స్టాటిస్టికల్ కమిషన్‌లో భారత్‌కు స్థానం సాధించి పెట్టిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవలే ట్వీట్ చేశారు. సుసంపన్నమైన భారత్ గణాంక వారసత్వం, భారత ‘ప్రణాళికా పురు షుడి’గా సుపరిచితమైన ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటుంది. ఆయన దేశంలో గణాంక శాస్త్రానికి మార్గదర్శి మాత్రమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని స్థాపించారు. ఆధునిక భారత గణాంక వ్యవస్థలో అత్యంత విశిష్ట వ్యక్తి అయిన మహలనోబిస్ భారత రెండో పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి కూడా. అలాగే జాతీయ శాంపిల్ సర్వే సంస్థతో పాటు కేంద్ర గణాంక సంస్థ స్థాపనలో కూడా కీలకపాత్ర వహించారు. స్టాట్కమ్లో భారత్ మునుపటి పాదముద్రకు ప్రధానంగా మహ లనోబిస్ కారణం. కమిషన్ ప్రారంభ సమయంలో ఆయన శిఖర స్థాయిలో ఉండేవారు. 1946లో ప్రారంభ సెషన్ నుంచి 1970లో సంస్థ 16వ సెషన్ వరకు తన జీవితకాలంలో అన్ని సెషన్లకు హాజరైన అద్వితీయ రికార్డు ఆయన సొంతం. సభ్యుడిగా, రాపోర్టర్‌గా, వైస్ ఛైర్మన్‌గా అనేక పాత్రలను పోషించిన మహలనోబిస్ 1954 నుంచి 1956 వరకు 8వ, 9వ సెషన్లకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన సంస్థకు అద్వితీయ తోడ్పాటును అందించారు. నమూనా సేకరణ కోసం ఐక్యరాజ్యసమితి సబ్ కమిషన్ ఏర్పాటు చేస్తే ‘‘ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో గణాంక శాస్త్రం మెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్ప సహాయం చేస్తుంది’’ అని సూచిస్తూ మహలనోబిస్ 1946 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాశారు. దానికనుగుణంగానే ఒక సబ్ కమిషన్ ఏర్పాటైంది. తర్వాత ఈ ఉప కమిషన్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ ఉపకమిషన్ నమూనా సర్వే నివేదిక (1947) సన్నాహకాల కోసం సిఫార్సులు చేసింది. వివిధ రంగాల్లో అధికారిక గణాంకాలకు సంబంధించిన నమూనా సర్వేల అన్వయానికి ఈ సిఫార్సులు మార్గాన్ని సుగమం చేశాయి. ‘శిక్షణ పొందిన మానవ వనరులను కలిగి ఉండని దేశాల్లో’ గణాంక శాస్త్రంలో విద్య కోసం అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రోత్స హించడంలో మహలనోబిస్, రైస్ కీలక పాత్ర పోషించారని ఇండి యన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ టీజే రావు ఒక పరి శోధనా వ్యాసంలో పేర్కొన్నారు. అలాంటి సంస్థను ఆసియా దేశాల కోసం లేదా ఇండియా, దాని పొరుగు దేశాల కోసం ఏర్పర్చాలని మహలనోబిస్ సూచించారు. 1950లో కలకత్తాలో స్థాపించిన ‘ది ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్ సెంటర్’ (ఐఎస్ఈసీ)ను ఇప్పుడు ఐఎస్ఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మహలనోబిస్ 1972లో చనిపోయారు. ఆ సంవత్సరం తన 17వ సెషన్లో చేసిన ఒక తీర్మానంలో కమిషన్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ‘‘సామాజిక గణాంక శాస్త్రం తరపున ఆయన సాగించిన మార్గదర్శక ప్రయత్నాలను స్మరించుకుంటున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల గణాంక అవసరాల కోసం నిలబడిన ఛాంపి యన్‌గా›ఆయన్ని స్మరించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా గణాంక శాస్త్ర అభివృద్ధి కోసం ఆయన ఇచ్చిన అసాధారణ ప్రేరణను మేము స్మరించుకుంటున్నాము’’ అని పేర్కొంది. ‘‘కమిషన్ సభ్యుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో ఆయన అసాధా రణ సామర్థ్యాన్ని’’ కూడా కమిషన్ ఆ సందర్భంగా గుర్తుచేసుకుంది. సీఆర్ రావు క్లాస్మేట్, ఎలెక్ట్రానిక్ డేటా ప్రొసెసింగ్‌లో పథగామి వక్కలంక ఆర్.రావు (ఈయనా తెలుగువాడే) 1976లో స్టాట్‌కమ్ 19వ సెషన్‌కు అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి డ్యూటీ స్టేషన్ వెలుపల స్టాట్‌కమ్ నిర్వహించిన ఏకైక సమావేశం ఇదే. ఇది న్యూఢి ల్లీలో జరిగింది. స్టాట్‌కమ్ 70వ వార్షిక సంబరాల కోసం రూపొందించిన బుక్లెట్ బ్యాక్ కవర్ పేజీపై, 1976 సెషన్ కోసం హాజరైనవారు తాజ్‌మహల్ ముందు నిల్చున్న చిత్రాన్ని పొందుపర్చారు. భారత్‌కు ఉజ్వలమైన గణాంక శాస్త్రపు గతం ఉంది. మన దేశం స్టాట్కమ్కు గణనీయ స్థాయిలో తోడ్పాటును అందించింది. అంత ర్జాతీయ గణాంక రంగంలో భారత్ తన స్థానాన్ని తిరిగి పొందినట్ల యితే, అది ప్రశంసార్హమవుతుంది. భారత్‌కు గొప్ప గణాంక శాస్త్ర సంప్రదాయం ఉంది. దీనికి మహలనోబిస్ గొప్ప ప్రయత్నం కారణం. అంతేకాకుండా గణాంక శాస్త్ర ప్రపంచంపై ఆధిపత్యం చలా యించగల నిపుణులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఐక్య రాజ్యసమితి గణాంక కార్యకలాపాల ప్రధాన స్రవంతి వైపు భారత్ తిరిగి వెళ్లడం సరైన దిశగా వేసే ముందడుగు అవుతుంది. అతనూ బిశ్వాస్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఐఎస్ఐ, కోల్‌కతా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పి.సి. మహలనోబిస్(1893–1972): సర్వేల శాస్త్రవేత్త
గణాంకవేత్త అయిన ప్రశాంత చంద్ర మహలనోబిస్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొత్తగా ఏర్పడిన మంత్రిమండలికి గణాంక సలహాదారుగా నియమితులయ్యారు. 1955లో జాతీయాభివృద్ధి మండలికి రెండో పంచవర్ణ ప్రణాళిక ముసాయిదాను అందించారు. వివిధ దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలు కాగలిగిన అనేక అంశాలను అధ్యయనం చేసిన మహలనోబిస్, ఉక్కు ఉత్పత్తిని చాలా కీలకమైనదిగా నిగ్గు తేల్చారు. దాంతో భారీ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన సిఫార్సు చేశారు. దీని ఫలితంగా భారతదేశ తూర్పు ప్రాంతంలోనూ, మధ్య ప్రాంతంలోనూ ఉక్కు నగరాలు నిర్మాణమయ్యాయి. మహలనోబిస్ అందించిన సేవలలో చిరస్థాయిగా నిలిచిపోయినవి అనేకం ఉన్నాయి. వాటిలో.. భారీ సర్వేలకు ఏర్పాట్లు చేయడం ఒకటి. వివిధ రకాల భారతీయ సమస్యలకు గణాంక సూత్రాలను అనువర్తింప జేయడం మరొకటి. తన జీవితకాలం తర్వాత కూడా వీటి అమలు కొనసాగే విధంగా మహలనోబిస్ అందుకు అవసరమైన వ్యవస్థలను నెలకొల్పడం అన్నిటికన్నా ముఖ్యమైనది. మహలనోబిస్ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో గణితం, భౌతిక శాస్త్రం చదివిన తరువాత 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి, భౌతిక శాస్త్ర బోధనలో పడిపోయారు. గణాంక విధానాలను ముమ్మరంగా అధ్యయనం చేసిన ఆయన తను పని చేస్తున్న కళాశాలలోనే ఒక చిన్న గణాంక ప్రయోగశాలను ప్రారంభించారు. అదే కాలక్రమంలో భారతీయ గణాంక సంస్థ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) గా రూపుదిద్దుకుంది. 1933లో ‘సంఖ్య’ అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. 1920లలో కలకత్తాలోని ఆంగ్లో–ఇండియన్ వర్గం నుంచి సేకరించిన సమాచారాన్ని వివిధ జాతుల భౌతిక స్థాయిల మధ్య అంతరాలకు కొలతలుగా ఉపయోగించిన మహలనోబిస్‌కు 1930లలో బెంగాల్ మొత్తం మీద జనపనార ఉత్పత్తి అంచనాపై సర్వే చేసే పనిని అప్పగించింది. భారీ స్థాయిలో జరిపిన ఈ సర్వేయే, 1950లో నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్.ఎస్.ఎస్.) మొదటి విడత కార్యకలాపాలకు రంగాన్ని సిద్ధం చేసింది. నేటికీ ఎన్.ఎస్.ఎస్. కార్యకాలపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆచరణాత్మకమైన ప్రశ్నలకు మహలనోబిస్ పెద్ద పీట వేశారు. వాటి లోతుల్ని అన్వేషించారు. -
నేడు ప్రపంచ గణాంకాల దినోత్సవం
అధికారిక గణాంకాల ప్రాథమిక సూత్రాల ప్రాముఖ్యతను వివరించడం కోసమే ప్రతి ఏడాది అక్టోబర్ 20న గణాంకాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ గణాంకాల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రూపొందించింది. ఈ మేరకు ఈ దినోత్సవాన్ని 2010 నుంచి గుర్తించడం మొదలైంది. (చదవండి: బాహుబలి గోల్డ్ మోమోస్.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే) అంతేకాదు 2010 నుండి 103 మంది భాగస్వామ్యం సహకారంతో 51 ఆఫ్రికన్ దేశాలు ఏటా నవంబర్ 18న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేవి. అయితే భారత్‌లో మాత్రం జూన్ 29న బెంగాల్‌కు చెందిన గణాంక శాస్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఈ మేరకుమహాలనోబిస్ దూరం, గణాంక కొలత తదితర గణాంక పరిశోధనలు ఎంతలా ప్రఖ్యాతిగాంచాయో అందరి తెలిసిందే. జాతీయ గణాంక కార్యాలయాలు జాతీయ సమన్వయ కర్తలుగా పనిచేయడమే కాక ఆయా సమాచారాన్ని జాతీయ భాషల్లోకి అనువదించి జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాదు ఈ గణాంకాల దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సమన్వయ ప్రచారాలు నిర్వహించడమే కాక కీలక సందేశాలను ఇవ్వడం, ఇతర భాగస్వామ్య దేశాలకు కావల్సినంత వనరులను అందుబాటులోకి తీసుకువస్తుంది. గణాంకాల ప్రాముఖ్యత ప్రపంచంలోని దాదాపు ప్రతి పరిశ్రమ,సంస్థలు ఈ గణాంక డేటా, పరిశోధనల నుండి ప్రయోజనం పొందుతుంది. వ్యాపారం, కెరియర్లపై సరియైన విధంగా దృష్టి సారంచాలంటే ఈ గణాంకాలు అత్యంత కీలకమైనవి. పెద్ద కంపెనీల ప్రచారాలకు, సరైన వ్యూహంతోప ముందంజలో దూసుకుపోవాలన్న కచ్చితమే ఈ గణాంక డేటా, పరిశోధనల ఆధారంగానే సాధ్యమవుతుంది. ఈ గణంక డేటా అదనంగా సమాచార దృకృథాలను జోడించడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వాస్తవాలను నిరూపించేలా ఉపకరిస్తుంది. నేటి ప్రపంచంలో మానవ కార్యకలాపాలన్ని ఈ గణాంకాల ఆధారంగా నిర్వహించగలుగుతున్నాం అనటంలో అతిశయోక్తి లేదు. అంతేందుకు వ్యక్తుల పోకడలు, ఇష్టాలు, అయిష్టాలను అర్థం చేసుకోవడానికి అనేక వ్యాపారాలు, సంస్థలకు గణాంకాల డేటాగా సోషల్ మీడియానే అతిపెద్ద డేటా వనరుగా మారింది. ఎలా జరుపుకుంటారు: స్టాటిస్టిక్స్ డే అనేది పరిశ్రమలు, సంస్థల గణాంకాల డేట పరిశోధనలు సమాచార ప్రాముఖ్యతను తెలియజేయడం పర్యావరణం, క్రీడలు, రాజకీయాలు, సమాజం, నేరం, కళ గురించి ఆసక్తికరమైన డేటాను పరిశోధించడం లేదా వ్యక్తులతో పంచుకోవడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. (చదవండి: ఒకే వ్యక్తి ఏకంగా తన ఇంటినే క్యాసెట్ల స్టోర్‌గా మార్చేశాడు) -
స్మార్ట్ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది. -
గురి తప్పని కెరీర్‌కు.. గణాంక శాస్త్రం
అప్‌కమింగ్ కెరీర్: గణాంక శాస్త్రం (స్టాటిస్టిక్స్).. 17వ శతాబ్దంలో ఆవిర్భవించిన శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా దీనికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఒక రంగానికి సంబంధించిన గణాంకాలను సేకరించి, సరైన రీతిలో విశ్లేషించి, వాస్తవాలను బహిర్గతం చేసేవారే స్టాటిస్టిషియన్స్. పొరపాట్లను గుర్తించి, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు గణాంక శాస్త్ర నిపుణులు తోడ్పడతారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన స్టాటిస్టిషియన్ల సేవలు నేడు ఎన్నో రంగాలకు విస్తరించాయి. అందుకే వీరికి ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. భారత్‌లో గణాంక నిపుణుల కొరత అధికంగా ఉండడంతో అభ్యర్థులకు స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసిన వెంటనే కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన జీతభత్యాలతో విదేశాల్లోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. గణాంక శాస్త్రం చదివి ఖాళీగా ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అంకెలు, సంఖ్యలు, లెక్కలు, ఎక్కాలపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి అడుగుపెట్టి ప్రొఫెషనల్ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. అవకాశాలు ఎన్నెన్నో... ప్రభుత్వాలు గతంలో జనాభా లెక్కలు, బడ్జెట్ తయారీకి అవసరమైన వివరాలను సేకరించడానికి స్టాటిస్టిషియన్లను ఉపయోగించుకునేవి. ఇప్పుడు వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, డ్రగ్ టెస్టింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎకనామెట్రిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మార్కెట్ రీసెర్చ్, స్పోర్ట్స్.. ఇలా చాలా రంగాల్లో వీరి సేవలు అవసరమవుతున్నాయి. స్టాటిస్టిషియన్లకు కార్పొరేట్ సంస్థలు భారీ వేతనాలను ఆఫర్ చేస్తూ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. వీరికి ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో కొలువులు ఉన్నాయి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసినవారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌కు ఎంపిక చేస్తోంది. సోషల్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టాటిిస్టిషియన్లు సెఫాలజిస్ట్‌గా కూడా పనిచేయొచ్చు. అంతేకాకుండా బోధనపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు. విశ్లేషణాత్మక దృక్పథం: స్టాటిస్టిషియన్లకు వృత్తిలో రాణించడానికి మ్యాథమెటిక్స్‌పై గట్టి పట్టు ఉండాలి. క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. బృంద స్ఫూర్తి కావాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొని, అమలు చేసే సామర్థ్యం ఉండాలి. స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్లపై పరిజ్ఞానం పెంచుకోవాలి. అర్హతలు: భారత్‌లో స్టాటిస్టిక్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా అభ్యసిస్తే ఉన్నతస్థాయి అవకాశాలను పొందొచ్చు. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది. వేతనాలు: గణాంక శాస్త్ర నిపుణులకు వార్షిక వేతన ప్యాకేజీలు భారీగా ఉంటాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-కోల్‌కతా విద్యార్థికి గతంలో రూ.10 లక్షల ప్యాకేజీ దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ కోర్సు అభ్యసించిన విద్యార్థికి రూ.7.5 లక్షల వేతన ప్యాకేజీ లభించింది. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తిచేసినవారికి సగటున ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వేతనం అందుతుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ వెబ్సైట్: www.isihyd.ac.in ఏ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in ఏ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in/du/ ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-కోల్‌కతా వెబ్సైట్: www.isical.ac.in ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు వెబ్సైట్: www.isibang.ac.in ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-ఢిల్లీ; వెబ్సైట్: ఠీఠీఠీ.జీటజీఛీ.్చఛి.జీ గణనీయమైన అవకాశాలు! శ్రీసాఫ్ట్వేర్, బ్యాంకింగ్, బీమా, నిర్మాణ తదితర రంగాలన్నింటిలోనూ స్టాటిస్టిక్స్ నిపుణులకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీల పనితీరును, ప్రగతిని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికా రచనలో వీరి అవసరం తప్పనిసరి. డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, సిక్స్‌సిగ్మా, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో స్టాటిస్టిషియన్స్కు డిమాండ్ ఉంది. ఆసక్తితోపాటు మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు, అనువర్తన నైపుణ్యాలున్నవారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారు స్టాటిస్టిక్స్ను అభ్యసిస్తే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. ఈ కోర్సులు చదివినవారికి ప్రైవేటు సంస్థలతోపాటు పలు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశాలున్నాయి. - ప్రొ.ఎస్.ఎం.సుభానీ, ఎస్‌క్యూసీ అండ్ ఓర్, ఐఎస్ఓ 9000, సిక్స్ సిగ్మా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్


