కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కార్యాచరణే వారిని ముందు తరాల వారు గుర్తించేలా చేస్తుంది. మరి కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. కొద్ది రోజులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే డిమాండే ఈ చర్చకు నేపథ్యం.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్లిన సందర్భంలో వరద కాలువకు ఫలానా నాయకుని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఫలానా నాయకుని పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు. దానికి ఎవరి పేరు పెడితే సరైందో వారి పేరు పెట్టాలనే సూచన బలంగా వస్తున్నది. 1940లకు పూర్వం నుండే ఈ ప్రాంత చైతన్యానికి బాటలు వేసిన వారిలో బీఎన్ ఒకరు. బీఎన్ సేవలను కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే పరిమితం చేయకూడదు. కాకపోతే సందర్భం అలాంటిది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తున్నది.
వరద కాలువ నీటి కోసం ఆయన నిర్వహించిన సభలు, సమావేశాల గురించి కథనాలు నాటి పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. బీఎన్ ఇంట ర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఆందోళనకు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారింది. కానీ అప్పట్లో అధికార, విపక్షాల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకూ అన్ని విషయాలు తెలుసు.
చదవండి: Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం
తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ‘మట్టి మనుషుల పోరాట’ మని నిర్వచించిందే బీఎన్. తాను భూస్వామి అయినా పేదల పక్షాన్నే నిలబడ్డారు. తన భూములను కూడా పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ జీవితపు సంఘర్షణను అనుభవించి, దాన్ని పారదోలేందుకు కంకణం కట్టుకున్న వారాయన. కాబట్టే అట్టడుగు వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం కావాలని పట్టు బట్టారు. రైతుల సాగు ముందుకు సాగాలన్నారు. నీటి వసతి కావాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ తీసుకున్నారు. ‘కొట్టిన వారిని, పెట్టిన వారిని మర్చిపోర’ని తెలంగాణలో అందరికీ పరిచయం ఉన్న సామెత. బీఎన్ అశేష తెలంగాణ ప్రజల మేలుకోరారు. మరీ ముఖ్యంగా తాను పుట్టిపెరిగిన నల్లగొండ జిల్లా జనాల, పొలాల దాహార్తి తీర్చాలని తపన పడ్డారు. బీఎన్ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి నుండి చివరిదాకా ఆయుధం పట్టి పోరాడిన యోధుడే కాదు... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా చట్టసభలలో అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై పోరాడిన మహాయోధుడు. అలాంటి వారి గురించి పట్టించుకోపోతే ఎట్లా? నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తించాలని అడగటమే ఆవేదన కలిగించే విషయం. జన జీవితాలను మారుస్తున్న వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే ఉమ్మడి నల్లగొండ ప్రజల డిమాండ్ సముచితమే!
– గోర్ల బుచ్చన్న, జర్నలిస్టు
(ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని రేపు జరగనున్న ధర్నా సందర్భంగా)


