హైదరాబాద్: మారిషస్ దేశానికి చెందిన 55 ఏళ్ల మహిళకు ఉన్నట్టుండి షుగర్ లెవల్స్ తగ్గిపోయేది. అప్పటికప్పుడు ఏమైనా తింటే సరే.. లేకపోతే కళ్లు తిరిగి పడిపోయేవారు. ఏంటా అని అక్కడి వైద్యులకు చూపిస్తే, ఆమెకు పాంక్రియాస్ (క్లోమం)లో అరుదైన కణితి (ఇన్సులినోమా) ఉందని తేలింది. సంక్షిష్టమైన శస్త్రచికిత్స కావడంతో అక్కడి వైద్యులు దానికి శస్త్రచికిత్స చేయడం మారిషస్‌లో సాధ్యం కాదని, హైదరాబాద్ పంపారు. ఇక్కడ కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సీహెచ్ నవీన్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
“ఆ మహిళ నేరుగా కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సాధారణంగా పాంక్రియాస్‌లో కణితులను తొలగించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే, పాంక్రియాస్‌కు కుట్లు వేయడం కష్టమవుతుంది. ఆమెకు ఇన్సులినోమా అనే రకం కణితి ఉన్నట్లు గుర్తించాం. మా బృందంతో పాటు అనస్థీషీయా బృందం డా. వీరభధ్ర రావు తో కలిసి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కేవలం లాప్రోస్కొపిక్ పద్ధతిలో చిన్న చిన్న రంధ్రాలు మాత్రమే చేసి ఆమె పాంక్రియాస్‌లో ఉన్న కణితిని తొలగించాం. అది బాగా చిన్న కణితి కావడంతో.. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇతర టెక్నాలజీలు వాడి దాన్ని తీసేశాం. శస్త్రచికిత్స అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో.. ఆరు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.


