ఎన్ని చెట్లు తొలగించారు.. ఎన్ని మొక్కలు నాటారు? | High Court seeks details on setting up radar station | Sakshi
Sakshi News home page

ఎన్ని చెట్లు తొలగించారు.. ఎన్ని మొక్కలు నాటారు?

Feb 19 2026 4:29 AM | Updated on Feb 19 2026 4:29 AM

High Court seeks details on setting up radar station

రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుపై వివరాలివ్వాలన్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఫ్రీక్వెన్సీ రాడార్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎన్ని చెట్లను తొలగించారు.. ఎన్ని మొక్కల్ని నాటారు.. వివరాలు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. 9 లక్షల మొక్కలను నాటామని, వాటిలో 93 శాతం బతికాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. చెప్పడానికి అంకెలు బాగానే ఉంటాయని, వాస్తవ పరిస్థితిని గణాంకాలతో సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. 

రాడార్‌ ప్రాజెక్ట్‌ కేంద్రానికి 2,900 ఎకరాల దామగుండం అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దామగుండం ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ జేఏసీ హైకోర్టులో 2020లో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. 

కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ..మొత్తం 11.74 మొక్కలు నాటాల్సి ఉందని, ఇప్పటికే రాష్ట్ర అటవీ శాఖ 9 లక్షల మొక్కలను నాటిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement