యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు చేపట్టండి
ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ రంగాల వృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సచివాలయంలో సంక్షేమ శాఖలు, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయీస్, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్ శాఖల వారీ సమీక్షల్లో పాల్గొన్నారు.
నిబద్ధతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆదాయం ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖలకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు వేగవంతంగా క్లియర్ చేస్తామని, వసతి గృహాల భవనాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్ భవనాలపైన సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శితో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని గురుకుల సొసైటీ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందున, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో వరి సాగు పెద్ద ఎత్తున చేయడం, బాయిల్డ్ రైస్‌ను తమిళనాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్‌లో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, దీంతో పంట మార్పిడికి అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. వరి స్థానంలో పామాయిల్, పప్పుధాన్యాలు సాగు చేస్తూ, పంట నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఈసారి బడ్జెట్‌లో బీసీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి, ఆర్థికావృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్ర భాకర్ సూచించారు. త్వరలోనే ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు మహా లక్ష్మి కార్డులను అందిస్తామన్నారు.


