కాంగ్రెస్ హైకమాండ్‌కు మీనాక్షి నటరాజన్ నివేదిక
కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, డివిజన్ స్థాయిల్లోనూ పదవుల భర్తీకి సిఫారసు
పదవుల పంపకాల్లో జాప్యంతో నేతల్లో నైరాశ్యం నెలకొందని వెల్లడి
నేటి సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్‌తో భేటీలో ఏఐసీసీ నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో..పదవులు దక్కని నేతలు, పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు ఊరటనిచ్చేలా వివిధ కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ పెద్దలకు గట్టిగానే సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితో గురువారం కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించనున్న కీలక భేటీకి ముందే పలువురు ఏఐసీసీ పెద్దలను కలిసిన మీనాక్షి.. పదవుల పందేరానికి సంబంధించి నివేదిక సమర్పించినట్లు సమాచారం.
పదవులు భర్తీ చేస్తేనే నేతల్లో జోష్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి 2024 జూన్‌లో ఒకేసారి 37 కార్పొ రేషన్లకు చైర్మన్‌లను ప్రకటించింది. ఆ తర్వాత కూడా పలు పదవులను భర్తీ చేస్తూ వెళుతోంది. అయితే మరో 35–40 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించాలని గడిచిన కొన్ని నెలలుగా డిమాండ్‌లు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది.
డీసీసీ పదవులు నియామకం, ఇతర కార్యక్రమాల నిమిత్తం జిల్లాల్లో మీనాక్షి నటరాజన్ పర్యటించిన సందర్భాల్లో పదవుల అంశంపై నేతల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తుల ఆధారంగా ఇప్పటికే జిల్లాల వారీగా నేతల జాబితా సిద్ధం చేసినా, ఉప ఎన్నికలు, స్థానిక, మున్సిపల్ ఎన్నికలంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. వీటితో పాటు జిల్లాల స్థాయిలోæ డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లా నుంచి ఐదు నుంచి ఆరుగురి పేర్ల జాబితాను సిద్ధం చేశారు.
ప్రస్తుతం డీసీసీల నియామకం పూర్తికావడంతో పాటు మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికావడం..నేతల సమష్టి కృషితో 70 శాతానికి పైగా విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ అభ్యన్నతికి కషి చేసిన వారిని పదవులతో సన్మానించాలన్నది నటరాజన్ ఉద్దేశంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా..పలు నామినేటెడ్ పదవులను ఇవ్వకపోవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకున్న దష్ట్యా, ప్రస్తుతం వాటిని భర్తీ చేస్తే నేతలను ప్రోత్సహించినట్లు అవుతుందని హైకమాండ్ పెద్దలకు మీనాక్షి స్పష్టం చేసినట్లు తెలిసింది.
యువత, ఎమ్మెల్యేలకు సైతం పదవులు!
పార్టీ బలోపేతానికి పని చేసిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు, కొందరు ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేలా మీనాక్షి సిఫారసులున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసింగ్, పరిశ్రమల అభివృధ్ధి, ఆరోగ్య వసతుల అభివృధ్ధి కార్పొరేషన్లు వంటి వాటిని ఎమ్మెల్యేలకు, లేక పార్టీ సీనియర్లకు ఇస్తారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.
మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు, యువతకు భాగస్వామ్యం కల్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాలతో ముడిపడ్డ కార్పొరేషన్లను యువతకు ఇచ్చే అవకాశాలు ఉండగా, కుల ఆధారిత కార్పొరేషన్లను సామాజిక న్యాయం ఆధారంగా ఇవ్వనున్నారని సమాచారం. ఉగాదికి ముందే పదవుల భర్తీ చేయాలన్న సిఫారసులపై గురువారం నాటి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.


