breaking news
Meenakshi Natarajan
-
వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్.. మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. ఇంచార్జి మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలోగ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్టు సమాచారం.ఈ క్రమంలో తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరు సమాధానం చెప్పారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జీకి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని కోరారు. రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని వారిద్దరూ నివేదికలో క్లారిటీ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు.అనంతరం, కొండా మురళి సాక్షితో మాట్లాడుతూ..‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని. నలభై నాలుగు ఏళ్ల నుండి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. వైఎస్సార్ హయం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. పని చేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్షమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జిని కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఉంటుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ కాంగ్రెస్ గెలిచేలా నేను తీసుకుంటాను. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికి భయపడేది లేదు. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను. సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటున్నాను. నాకు భయం లేదని ముందు నుంచే చెబుతున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. ఇదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు?. నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి?. భవిష్యత్‌లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గతంలో నటి సమంత, నటుడు నాగార్జునపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళి తన లేఖలో వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళి వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రభుత్వం కన్నా పార్టీనే ప్రధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటం కంటే పార్టీ బలంగా ఉండటమే ప్రధానమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఉద్ఘాటించారు. పార్టీ బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని, సంస్థాగత నిర్మాణం చాలా కీలకమన్నారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం గాందీభవన్‌లో క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు కోసం జిల్లాల వారీగా నియమించిన పరిశీలకులతో వారు విడివిడిగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కూడా పాల్గొన్నారు. కొన్ని కమిటీలు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కూడా ఈనెల 30లోపు పూర్తి చేయాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్ సూచించారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రారంభమవుతుందని, ఈ నియామకాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి ఏఐసీసీ పరిశీలకులు వస్తారని చెప్పినట్లు తెలిసింది. పలువురు పరిశీలకులు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను వివరించారు. కొన్నిచోట్ల కార్యకర్తల అసంతృప్తిని వారి దృష్టికి తెచ్చారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్నాయని, కొన్నిచోట్ల ఆధిపత్య పోరు, సమన్వయ లోపం ఉన్న అంశాన్ని వివరించారు. అన్యాయం చేయం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పీసీసీ నియమించిన పరిశీలకులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో 80 శాతం పాత కాంగ్రెస్ వారికే ఇచ్చామని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న వారికి కూడా ప్రాధాన్యతనిచ్చామన్నారు. 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలనే ప్రాతిపదికను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, కొన్ని సమీకరణలు, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వచి్చన వారికి ఇచ్చామని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే కొంత రాజీపడక తప్పదని వివరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేసే ప్రసక్తే లేదని, అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవుల్లో వారికి తప్పకుండా అవకాశమిస్తామన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారం కోసం రోజూ గాం«దీభవన్‌లో పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల్లో ఎవరో ఒకరు కచి్చతంగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండాలన్నారు. పదేళ్లు ఎక్కడో కూర్చుని ఇప్పుడు గ్రామాలకు వెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తామంటే కుదరదని, ప్రజాదరణ ఉన్నవారికే స్థానిక ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి, మహేశ్ గౌడ్ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీ సమావేశం సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, పవన్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.నేడు గాంధీభవన్‌కు సీఎం రేవంత్ గాంధీభవన్‌లో మంగళవారం కూడా కీలక సమావేశాలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. తర్వాత పార్టీ సలహా కమిటీ భేటీ కానుంది. అనంతరం టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాలకు మీనాక్షి నటరాజన్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
అసంతృప్తులు.. బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతల్లో పార్టీ పట్ల అసంతృప్తికి తావివ్వకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్చార్జ్ సెక్రటరీలు విశ్వనాథన్, విష్ణునాథ్ సహా రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు ఆదివారం మీనాక్షి నటరాజన్‌కు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి కీలక సూచనలు చేశారు. భవిష్యత్‌లో కచ్చితంగా అవకాశాలు దక్కుతాయనే భరోసా ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో అసంతృప్తులు చల్లారే వరకు ఇన్‌చార్జ్‌తో సహా సెక్రటరీలు హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.దీంతో మంత్రి పదవి ఆశించి..విస్తరణలో చోటు దక్కని నేతలను బుజ్జగించే పని ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. కేబినెట్లో చోటు దక్కిన వారి పేర్లు బయటకు వచ్చిన అరగంటలోపే టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అప్రమత్తమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను తీసుకొని ఆయన ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించారు. నిజామాబాద్ సీనియర్ నేత పి.సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ప్రేమ్‌సాగర్‌రావు, రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, భవిష్యత్‌లో వచ్చే అవకాశాల్లో కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ⇒ సుదర్శన్‌రెడ్డితో అర గంటకుపైగా మీనాక్షి, మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌లు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను సుదర్శన్‌రెడ్డి వెలిబుచ్చగా, మరోమారు తప్పకుండా అవకాశం ఇస్తామని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది. ⇒ ఆ తర్వాత ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలో మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు గంటకు పైగా చర్చలు జరిపారు. గత కొన్ని దశాబ్దాలుగా పారీ్టకి తాను చేస్తున్న సేవలను వివరించిన ప్రేమ్‌సాగర్‌రావు.. అకారణంగా తనను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ⇒ రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణలే కారణమయితే తాను రాజీనామా చేస్తానని, తన స్థానంలో ఎవరినైనా గెలిపించి వారికైనా మంత్రిపదవి ఇవ్వా లని కోరినట్టు సమాచారం. రాష్ట్రంలోనే 42 శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలాకు మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడాన్ని మల్రెడ్డి ప్రశి్నంచారు. గతంలో అరుగురు మంత్రులు ఈ జిల్లాల్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడొచ్చని మల్రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వారంలోనే కార్యవర్గంమంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినందున టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని మొదట ప్రకటించి, తర్వాత జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు. దొరకని రాజగోపాల్ సుదర్శన్‌రెడ్డితో బుజ్జగింపుల అనంతరం నేరుగా రాజ గోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్‌లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఇద్దరు నేతలు ఆ తర్వాత కూడా రాజగోపాల్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాజగోపాల్ ఇంటికి వెళ్దామనుకున్నా రాత్రి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
పాలమూరు ఎవరికి వారు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతలు పోట్ల గిత్తల్లా తలపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కుదురుకోలేక కొందరు, ఇతర పార్టీల నేత లను ప్రోత్సహిస్తూ మరికొందరు, పార్టీలోని వారితో కలిమి లేక ఇంకొందరు, గొంతెమ్మ కోర్కెలతో ఇంకా కొందరు ఎవరికి వారే వివాదాస్పదమవుతున్నారు. ఈ గ్రూపు గొడవలు, గట్టు పంచాయతీలు తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో బట్టబయలు కావడం.. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేసుకోవడం.. ఆమె ముందే వాదులాడుకోవడంలాంటి ఘటనలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని సతమతం చేస్తున్నాయి. గద్వాల నుంచి ఆలంపూర్ వరకు, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు వివాదాలకు కారణమవుతూ వీలున్నంత మేర పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు పోటీలు పడుతుండటం గమనార్హం. చాప కింద నీరులా.. చాలా కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు బహిరంగ కొట్లాటలకు దిగుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఏకంగా రాష్ట్రంలోని ఓ కీలక మంత్రితో పంచాయతీకి దిగారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే కొందరు ఎమ్మె ల్యేలు డిన్నర్ భేటీ అయ్యారన్న వార్త రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, టీకప్పులో తుపానులా ఆ వివాదం ముగిసినా, గద్వాల రాజకీయం గట్టు దాటింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఓ ఎంపీ ఘర్షణకు దిగారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. అక్కడి ఎమ్మెల్యేకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సఖ్యత కుదర్చడం రాష్ట్ర పార్టీకి కూడా సాధ్యం కావడం లేదు. ఇద్దరూ పట్టిన పట్టు వీడకుండా పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇక, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నిత్యకృత్యమైందనే చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ మొదలు పార్టీ పదవుల వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య విభేదాలు లేకపోయినా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్, స్థానిక ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందనే చర్చ ఉంది. మక్తల్ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారని, ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ పోస్టర్లు కూడా వేశారని తెలుస్తోంది. అవిగో నష్టాలు... ఇవిగో ఆధారాలు నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ సెగ కాంగ్రెస్‌ను గట్టిగానే తాకుతోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఆ నియోజకవర్గంలో తీవ్ర విభేదాలకు దారితీస్తోంది. దీనికి తోడు తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లురవి సత్కరించడం దుమారానికి దారి తీసింది. ఈ విషయమై ఆలంపూర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు కలిపి 26 మంది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి కలిసి అటు ఆలంపూర్‌లోనూ, ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పార్టీకి నష్టం చేస్తున్నారని సంతకాలు చేసి మరీ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించి 10 శాతం కమీషన్ తీసుకున్నారంటూ మల్లురవిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక, కాంగ్రెస్ కేడర్ అడుగుతున్న విధంగా ఆలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మకుంట ప్రాజెక్టును కాకుండా బీఆర్ఎస్ నేతల మాటలు విని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన మల్లురవి మీదనే కాంగ్రెస్ ఇంచార్జికి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడం గాం«దీభవన్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మంత్రులకు... మేం తక్కువా? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఓ విచిత్ర డిమాండ్‌ను తెరపైకి తెస్తూ మంత్రివర్గాన్నే సవాల్ చేస్తున్నారు. మంత్రులకంటే తామేం తక్కువ కాదని, మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులిస్తారో అన్ని నిధులు తమ నియోజకవర్గాలకూ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండు దఫాలుగా వారు మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం కూడా ఇచ్చారు. మంత్రులతో సమానంగా నిధులివ్వాలని అడిగినట్లు స్వయంగా వారు మీడియాకు వెల్లడించడం గమనార్హం. గాంధీభవన్‌లో జరిగిన లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలోనూ వారు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అదేవిధంగా పాలమూరు లోక్‌సభ పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమకు సహకరించడం లేదంటూ వారు కొత్త రాగాన్ని అందుకోవడం గమనార్హం. ఈవిధంగా సొంత పార్టీ నేతలతో, ఇతర పార్టీల నాయకులతో, మంత్రులతో, అధికారులతో పంచాయతీలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ రాజకీయం ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే! -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఏం పని?
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్‌లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.⇒ నాగర్‌కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ⇒ మహబూబ్‌గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్‌లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. -
పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్‌లో ఆమె ‘జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్‌గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్‌కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు. ఫోన్ చేసి మాట్లాడిన మీనాక్షి సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు. మంత్రితో ముఖాముఖి కాగా, బుధవారం గాం«దీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్‌లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎంఐఎంతో మన వైఖరి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం విషయంలో పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. ఎన్నికల సమయంలో తాము ఎంఐఎంతో ప్రాణాలకు తెగించి కొట్లాడతామని, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆ పార్టీతో దోస్తానా చేస్తారని, ఇలాగైతే హైదరాబాదులో పార్టీ ఎలా అభివృద్ధి అవుతుందని వారు ప్రశ్నించారు. ఎంఐఎం విషయంలో ఒక వైఖరి తీసుకుని ముందుకెళ్తే తాము కూడా రాజకీయంగా ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్న మీనాక్షి నటరాజన్ రెండో రోజు గురువారం మహబూబ్‌నగర్, చేవెళ్ల, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలు ఎంఐఎం అంశాన్ని ఆమె వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. ’హైదరాబాద్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకుడికి కూడా నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. ఎంఐఎంతో కొట్లాడినప్పుడు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేయాలని కోరినా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఇన్చార్జి మంత్రి మమ్మల్ని కలవరు. సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు’ అని మీనాక్షి నటరాజన్ వద్ద హైదరాబాద్ నేతలు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. వారి విజ్ఞాపనలు విన్న మీనాక్షి అన్ని అంశాలు పార్టీతో మాట్లాడతానని, హైదరాబాద్ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్దామని చెప్పినట్లు తెలిసింది. చేవెళ్ల, మహబూబ్‌గర్ లోక్‌సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా మీనాక్షితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత గురించి వారితో మాట్లాడినట్టు తెలిసింది. పాలమూరు లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రులు తమ నియోజకవర్గాలకు అధిక నిధులు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తమకు నష్టం జరుగుతోందని, మంత్రులతో సమానంగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల కూడా నిధులిచ్చేలా చూడాలని మీనాక్షిని కోరినట్లు తెలిసింది. -
మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు ఏంటి? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరా తీశారు. బుధవారం ఆమె ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు? పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసువాల్సిన ప్రాతిపదిక ఏంటి? తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణమేంటి? అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల జవాబులను ఆమె నోట్ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి.. పలు అంశాలపై సమాచారం రాబట్టారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా.. మరికొందరు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ సిందూర్‌ను అకస్మాత్తుగా విరమించుకోవటంతో బీజేపీ, ప్రధాని మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతో కేడర్ నిస్తేజంగా మారిందని కొందరు నేతలు తెలిపారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ లేమితోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు కొందరు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు సమాచారం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని.. అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతం గురించి అడిగారు: రేఖా నాయక్ మీనాక్షితో భేటీ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ మాట్లాడుతూ.. పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మీనాక్షి మాట్లాడారని చెప్పారు. ఇందుకు గల వ్యూహం గురించి, భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయాల గురించి మాట్లాడారని వివరించారు. డీసీసీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిపారు. నేను చెప్పాల్సింది చెప్పా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు తాను చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పానన్నారు. తనకు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం లేదన్న ఆయన.. అన్ని విషయాలను ఇన్చార్జికి వివరించినట్లు వెల్లడించారు. తాను కూడా మంత్రిపదవికి అర్హుడనేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే తన మనసులో మాటను సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అడిగానని వెల్లడించారు. మీనాక్షి ఓ డాక్టర్ మీనాక్షి నటరాజన్ డాక్టర్ పని చేస్తున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆమె తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారని, పారీ్టలో అన్నీ సెట్ చేస్తారని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలేవైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని మీనాక్షి అడిగారని వెల్లడించారు. కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
అందరి అభిప్రాయాలు తీసుకోండి
సాక్షి హైదరాబాద్: కేబినెట్ సహచరులకు సీఎం రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ మంత్రులకు విందు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. గురువారం నుంచి మంత్రుల జిల్లాల పర్యటన, ఈ నెల 30న మరోమారు ఢిల్లీ పర్యటన, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు, రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ నేపథ్యంతోపాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉండటంతో బుధవారం సాయంత్రం తన నివాసంలో రేవంత్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రులు ఇష్టాగోష్టి మాట్లాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముందుగా చేయాల్సిన కసరత్తు గురించి మంత్రులు మాట్లాడుకున్నట్లు తెలిసింది. పథకం అమలుకుముందే అందరితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటే మంచిదని, ఫలానా పథకం అమలు చేసే అవకాశం ఉందన్న ఫీలర్‌ను ముందుగా ప్రజల్లోకి పంపి.. విస్తృత చర్చ జరిగిన తర్వాత శ్రీకారం చుడితే బాగుంటుందని మంత్రులు సూచించినట్లు తెలిసింది. అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, భవిష్యత్తులో కలిసికట్టుగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కోవాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో మంత్రులందరూ ఆచితూచి మాట్లాడాలని, ఆర్థిక పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్ణయానికి వచి్చనట్లు తెలిసింది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క మినహా హైదరాబాద్‌లో ఉన్న అందరు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విందుకు హాజరయ్యారు.ఆపరేషన్ సిందూర్ హడావిడి విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీకి తగ్గిన గ్రాఫ్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి సమావేశంలో భాగంగా వచ్చిన అంశాలు, బీఆర్ఎస్ పంచాయతీ ఎపిసోడ్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై మంత్రులు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిసింది. రెండు రోజులు జిల్లాల్లో మంత్రులు రాష్ట్ర మంత్రివర్గం గురువారం నుంచి రెండు రోజులపాటు జిల్లాల్లోనే ఉండనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అంశంపై కూడా విందు సమావేశంలో చర్చకు వచి్చందని, జిల్లాల్లో జరిగే సమీక్షలకు సంబంధించి జూన్ ఒకటికల్లా తనకు నివేదిక ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.