నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని వేధించే కుట్ర: మీనాక్షి నటరాజన్
రాహుల్, సోనియాలపై అక్రమ కేసులు బీజేపీ రాజకీయ వేధింపులే: మహేశ్‌గౌడ్
బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని తాము ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో గురువారం బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి.
గాందీభవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు గాంధీభవన్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అదే జరిగిందన్నారు. న్యాయం గెలవడానికి సమయం పట్టవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమేనని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంపై కావాలనే అక్రమ కేసులు పెట్టి రాజకీయంగా వేధించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ రాజకీయ వేధింపులు: మహేశ్‌గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాందీ, సోనియా గాం«దీలపై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టివేయడం ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో సత్యమేంటో దేశానికి తెలిసిందని అన్నారు.
స్వాతంత్య్రకాలం నుంచే ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశానికి సేవ చేసిన పత్రిక అని, అలాంటి పత్రికను, దేశం కోసం ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
కాగా గాందీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ హడావుడిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయతి్నంచాయి.


