అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ 4(1) సైతం సానుకూలమే
కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఏపీ వాదనలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడం ఆమోదయోగ్యమేనని, దీనిపై ఎలాంటి నిషేధం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పష్టం చేసింది. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటి తరలింపు అంశాన్ని కృష్ణా ట్రిబ్యునల్–1తోపాటు ఇతర ట్రిబ్యునళ్లు సైతం పరిశీలించి అనుమతించాయని పేర్కొంది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్‌మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాలపత్రతో కూడిన కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయ్‌దీప్‌గుప్తా గురువారం రెండో రోజు తన వాదనలను కొనసాగించారు.
బేసిన్, దాని పరిధిలోని ప్రజలందరి ప్రయోజనాల కంటే ..యావత్ రాష్ట్రం, దాని పరిధిలోని ప్రజలందరి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని వాదించారు. బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నాగార్జునసాగర్ కుడికాల్వ, కేసీ కాల్వ, కృష్ణా డెల్టా సిస్టమ్ ద్వారా నీటి తరలింపునకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతించిందన్నారు.
వచ్చే నెలలో ఏపీ వాదనలు ముగింపు
అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద గతంలో కేంద్రం జారీ చేసిన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేసే అంశంపై ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. గురువారంతో ఈ దఫా ఏపీ వాదనలు ముగియగా, చివరి దఫా వాదనలను జనవరి 21 నుంచి 23 మధ్య ట్రిబ్యునల్‌కు వినిపించనుంది. ఆ తర్వాత ఏపీ వాదనలపై తెలంగాణ కౌంటర్ వాదనలను ట్రిబ్యునల్ విననుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసే అవకాశముంది.
ఏపీ తరలించే నీటిపై ఆంక్షలు లేవు
మహారాష్ట్రలోని కోయిన, టాటా హైడల్ ప్రాజెక్టు అవసరాలకు 122 టీఎంసీలకు మించి జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించరాదని ఆంక్షలు విధించారని, అలాంటి ఆంక్షలను బేసిన్ వెలుపలికి ఏపీ తరలించే నీటిపై విధించలేదని జయదీప్ గుప్తా స్పష్టం చేశారు. బేసిన్ వెలుపలికి నీటిని తరలించే ఏపీలోని 4 ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలోని షెడ్యూల్–11లో పొందుపరిచి రక్షణ కల్పించారన్నారు.
కృష్ణా ట్రిబ్యునల్–2 సైతం తన తీర్పులో బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరిపిందన్నారు. 65 శాతం లభ్యత ఆధారంగా కోయిన ప్రాజెక్టుకు 25 టీఎంసీలు, తెలుగు గంగా ప్రాజెక్టుకు 25 టీఎంసీలను కేటాయించిందని గుర్తు చేశారు. రాయలసీమలోని కరువు పీడిత పెన్నా బేసిన్‌లో నీటిలభ్యత లేదని, కృష్ణా నుంచి నీటిని మళ్లించకపోతే పెన్నా ప్రాంతం తడారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణానదికి దక్షిణాదిన ఉన్న తమ రాష్ట్రంలో గ్రావిటీతో నీళ్లను సాగునీటికి తరలించుకోవడం సులువు అన్నారు. ఉత్తరాన ఎత్తయిన ప్రాంతంలో ఉన్న తెలంగాణకు లిఫ్ట్ చేసుకోక తప్పదని, దీనికోసం విద్యుత్‌ను వాడాల్సి ఉంటుందని చెప్పారు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ 4(1) సైతం బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీటి తరలింపును సమరి్థస్తుందన్నారు.


