ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేం రాగానే పూర్తి చేస్తాం
కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
చంద్రబాబూ.. మీకు చేతకాకపోతే అలా వదిలేయండి
మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరొస్తుందనే అక్కసుతో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు
బాబు అసంబద్ధ నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు శాపం
భూమి.. మెడికల్ కాలేజీ.. ఆస్పత్రి.. అన్నీ ప్రభుత్వానివే.. ఉద్యోగులూ గవర్నమెంట్‌వారే
జీతాలు ఇచ్చేదీ ప్రభుత్వమే.. ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు!
ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్!
కొత్త వైద్య కాలేజీలు, ఆస్పత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే
రూ.1,200 కోట్లు.. ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారు..
ఆ మెడికల్ కాలేజీలను రూ.5 వేల కోట్లతో పూర్తి చేయవచ్చు
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు వివరించాం.. మా పోరాటం ఇంతటితో ఆగదు..
న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తాం..
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కలసి గవర్నర్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ
ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష గవర్నర్‌కు నివేదన
మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800
మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్

“మా పోరాటం ఇంతటితో ఆగదు
గవర్నర్‌కు కోటి సంతకాలు చూపించాం. రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం...
“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది.
ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్‌లు దేశంలో ఎక్కడా ఉండవు...’’
“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో బాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో..’’
“నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్‌లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి..’’
“అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది’’
“మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామే’’
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్‌భవన్‌కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు.
వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్‌కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబూ..! ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడం మీకు చేతకాకపోతే.. అలా వదిలేయండి. మేం వచ్చాక వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అంతేకానీ వాటిని పూర్తి చేస్తే ఎక్కడ మాకు మంచి పేరు (క్రెడిట్) వస్తుందోననే ఆలోచనతో ప్రైవేటీకరణ చేయడం మంచి పద్ధతి కాదు..’’ అని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
చంద్రబాబు సర్కారు అసంబద్ధ నిర్ణయం భవిష్యత్తు తరాలకు పెను శాపంగా మారుతుందని హెచ్చరించారు. భూమి.. మెడికల్ కాలేజీ.. ఆస్పత్రి.. అన్నీ ప్రభుత్వానివే.. ఉద్యోగులూ గవర్నమెంట్‌వారే.. చివరకు జీతాలు ఇచ్చేదీ ప్రభుత్వమే..! ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు..! ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? ప్రపంచంలో ఇలా ఎక్కడైనా ఉందా..? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్..! అని మండిపడ్డారు.
కొత్త వైద్య కాలేజీలు, ఆస్పత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే రూ.1,200 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.5 వేల కోట్లతో ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేసే వీలున్నా స్కామ్‌ల కోసం ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో కూడిన 40 మంది నేతల బృందంతో గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను వివరించారు.
మెడికల్ కాలేజీల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని వివరాలతో ఒక వినతిపత్రం సమరి్పంచారు. గవర్నర్‌తో సమావేశం ముగిసిన తర్వాత లోక్‌భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సర్కారు చేస్తున్న అన్యాయాలు, మోసాలు, స్కామ్‌లను గవర్నర్ దృష్టికి తేవడంతోపాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఆయనకు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్ చాలా బాధపడ్డారని.. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజల మనోభావాలు గవర్నర్‌కు నివేదించాం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాం.
అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమాల ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం. నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం.
10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్ గారికి చూపించాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను గవర్నర్‌కు వివరించాం.

అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం..
ఈ రోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా. మనం తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్లా స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటిని నడపకపోతే.. పేద, మధ్య తరగతి వారు ప్రైవేటు దోపిడీకి గురై, వారు భరించలేని స్థాయికి వెళ్లిపోతాయి. ఆశ్రయించలేక నష్టపోతారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి. అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే దోపిడీకి చెక్ పడదు. ప్రజలు సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్‌పేషంట్‌గా చేరాలంటే కనీసం రూ.5 వేలు చార్జ్ చేస్తారు. కనీస వసతులతో రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు రూ.30వేల నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.
మెడికల్ కాలేజీతో ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు..
మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, మెడికోస్, నర్సింగ్ స్టూడెంట్లు.. అందరూ అందుబాటులో ఉంటారు.
దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచి్చనట్లు ఛార్జ్ చేయలేవు. మేం నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలన్నీ ప్రారంభమైతే మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య చదవాలని కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
నిధుల కొరత అబద్ధం..
మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?
పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేటట్టుగా గవర్నర్‌గారి దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్‌లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్‌లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి.
కలసి కట్టుగా అడ్డుకుందాం..
చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలసి రావాలి. అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్‌కు గానీ, మనసున్న ఏ వ్యక్తికైనాగానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్‌ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.
న్యాయ పోరాటం.. ప్రజా పోరాటం..
మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి వీధి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్.
అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. అన్నీ ప్రభుత్వానివే.. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా? ఇలాంటి స్కామ్‌లు ప్రపంచంలో ఎక్కడా ఉండవు..!
పైగా ప్రజలను మోసం చేసేందుకు.. డైవర్షన్ చేసేందుకు.. కళాశాలలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ గవర్నమెంట్ పేరు పెడతాడట! రేప్పొద్దున హెరిటేజ్ కంపెనీ ముందు గవర్నమెంట్ పేరు పెట్టి కింద హెరిటేజ్ అని చిన్నగా పేరు పెడితే ఆ హెరిటేజ్ కంపెనీ ప్రభుత్వానిది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. ప్రజలంటే ఎలా కనిపిస్తున్నారు? మరీ ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎలా?
సూపర్ 6 ఒక మోసం.. సూపర్–7 ఒక మోసం.. ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇస్తూనే, వాటికి అదనంగా సూపర్ సిక్స్, సెవన్ ఇస్తామన్నారు. ఇప్పుడు చూస్తే పలావు పోయింది... బిర్యాని పోయింది!
ప్రజలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.. డిసెంబర్ నెల ముగిస్తే 8 క్వార్టర్స్ బకాయిలు ఇవ్వాలి. విద్యాదీవెన లేదు.. వసతి దీవెన లేదు... పిల్లలు చదువులు మానేస్తున్నారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలు (జీఈఆర్) తగ్గాయి. ఆరోగ్యశ్రీ లేదు.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక పోవడంతో బోర్డులు తిప్పేశారు. మరోవైపు గవర్నమెంట్ ఆస్పత్రులు దారుణంగా ఉన్నాయి.
ఒక్కరోజు యోగాకు 330 కోట్లా?
- మ్యాట్లు మీరు కొన్నదెంత?.. అమెజాన్‌లో ఉన్నదెంత?
‘‘రుషికొండలో రూ.230... రూ.240 కోట్లతో కట్టిన భవనాలు విశాఖకు మణిహారంగా మారాయి. విశాఖకు ఆ భవనాలు తలమానికంగా ఉన్నాయి. ఈ రోజున వెళ్లి చూస్తే విశాఖపటా్ననికి గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. విశాఖకు గవర్నర్ వెళ్లినా, ప్రధాని మోదీ వచ్చినా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వస్తే ఎక్కడ పెడతారు?
బ్రహ్మాండమైన రాజభవనం లాంటి భవనమది.. ఆ భవనంలో వారికి అతిథ్యం ఇవ్వవచ్చు. అదే చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క రోజు కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఆవిరి చేశారు. దాన్నేమంటారు?
ఆరోజు యోగా మ్యాట్లకు ఎంత ఖర్చు పెట్టారో చూస్తే మీకే అర్థమవుతుంది. అమెజాన్‌లోకి వెళ్లి మ్యాట్ల ఖరీదు ఎంతో చూడండి. వీళ్లు ఎంతకు కొనుగోలు చేశారో పరిశీలించండి. వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఉండకపోతే నన్ను అడగండి’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ పేర్కొన్నారు.


