కూతురు భర్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం
నంద్యాల (అర్బన్): అల్లుడుతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అల్లుడితోనే కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన గురువారం నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుభద్ర, గుర్రప్ప(40) దంపతులు ఐదేళ్లుగా నంద్యాల శివారులోని నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు తువ్వపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యతో మూడేళ్ల క్రితం వివాహం చేశారు.
ఈ క్రమంలో సుభద్రకు అల్లుడైన లింగమయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పలుమార్లు సుభద్రను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండటంతో గుర్రప్పను హతమార్చాలని సుభద్ర కుట్ర పన్నింది. గురువారం ఇంట్లో పడుకుని ఉన్న గుర్రప్ప మెడకు సుభద్ర, లింగమయ్య తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. గుర్రప్ప తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు భార్య సుభద్రను అరెస్ట్ చేయగా, లింగమయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


