పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశంలో వైఎస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్
ఆ సిబ్బందికి రెండేళ్ల పాటు వేతనాలు మరో స్కామ్
అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం
స్కామ్‌కు పాల్పడిన వారిని జైలుకు పంపుతాం
రెండు నెలల్లోనే వారిపై అన్ని చర్యలుంటాయి
చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై నెపం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కాలేజీలను ప్రైవేటువారికి ఇప్పించడమే కాకుండా వాటిలో పనిచేసే సిబ్బందికి రెండేళ్లు చంద్రబాబు సర్కారే వేతనాలు ఇస్తుందట..! ఇదో మరో స్కామ్ అని స్పష్టం చేశారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించి నడపాలని డిమాండ్ చేస్తూ 1,04,11,136 మంది సంతకాలు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేశారని వెల్లడించారు.
ఈ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసైనా చంద్రబాబు సర్కార్ వాస్తవాలు గుర్తించి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. స్కామ్‌కు పాల్పడిన వారిని జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారిపై అన్ని చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.

కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటికి పైగా సంతకాలతో కూడిన వాహనాలకు గురువారం ఉదయం వైఎస్ జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
చరిత్రలో నిల్చిపోయే ఘట్టం
కోటి సంతకాల సేకరణలో మీ కృషి, మీ అందరినీ అభినందించేందుకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామస్థాయిలో కార్యకర్తల వరకు అంతా నిబద్ధతతో పని చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలనే పట్టుదలతో చేపట్టిన ఇంత గొప్ప ఉద్యమం బహుశా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఇన్ని సంతకాలు సేకరించడం, నిజంగా రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా.
స్కామ్ చేసిన వారెవరినీ వదలం..
గవర్నర్‌కు ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలతో కోర్టు తలుపు కూడా తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు (కోటి సంతకాల పత్రాలు) మీకు చూపించడం కోసం సిద్ధంగా ఉంటామని కోర్టుకు నివేదిస్తాం. కానీ ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోవడం లేదు. గతంలో ఎన్.జనార్ధన్‌రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈయనకు (చంద్రబాబు) సిగ్గు లేదో ఇంకొకటి లేదో! ఎడాపెడా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తూ స్కాములు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు! మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు వినకుండా దీన్ని ముందుకు తీసుకుని పోతే మాత్రం.. ఈ స్కామ్‌లో ఉన్న వారంతా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే జైళ్లలో ఉంటారు.
మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. గవర్నర్‌తో భేటీ తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోం. మళ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. మళ్లీ ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుంది.

బాబు చేసిన మంచి.. బోడి సున్నా!
గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అని అనుకునే మనిషి బహుశా చంద్రబాబు మినహా ప్రపంచంలో ఎవరూ ఉండరు. నాడు.. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్‌లో విలీనం చేశాం. ఇంతకుముందు ఎన్నికల్లో మనం అధికారంలోకి రాకపోయి ఉంటే, చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీని కూడా అమ్మేసుండేవారు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా.. పోలీస్ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తాడట.
శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నోటి నుంచి నిన్న (బుధవారం) కలెక్టర్ల సదస్సులో వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజల్లో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగా లేదని వారిపై నెపం వేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టగా వచ్చే మార్చిలో మూడో బడ్జెట్ పెడుతున్నారు. మరి ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే? బోడి సున్నా కనిపిస్తుంది.
అప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.


