కెనరా బ్యాంక్‌లో గన్ చూపించి భయపెడుతున్న ఆగంతకులు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.
కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్ మోగించారు. దీంతో దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. బ్యాంక్ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.


