కర్నూలులో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఉద్యోగాల చిచ్చు
సెక్యూరిటీ గార్డు పోస్టులపై కర్నూలు పెద్దాసుపత్రిలో కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే రచ్చ
తమ వారికి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వడం లేదని ఆగ్రహం
రోగుల మధ్యే ఆసుపత్రిలో గందరగోళం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సెక్యూరిటీ గార్డు నియామకాలపై మంత్రి టీజీ భరత్, కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆసుపత్రిలో గత ఆరు నెలలుగా సెక్యూరిటీ బాధ్యతలను ఈగల్ హంటర్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అప్పటి నుంచి ఆ ఏజెన్సీ నుంచి సబ్‌లీజ్ తీసుకోవాలని మంత్రి టీజీ భరత్, కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలం విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు సబ్‌లీజ్‌కు తీసుకుని నడిపించే ప్రయత్నం చేశారు.
విషయం తెలిసిన మంత్రి టీజీ భరత్ అనుచరులు కార్యాలయానికి వచ్చి ఫర్నిచర్‌ను ఎత్తిపారేసి అలజడి సృష్టించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఈగల్ హంటర్ సంస్థ వారే సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వహణ బాధ్యత మంత్రి టీజీ భరత్ అనుచరులు చేజిక్కించుకున్నారని, తమ ఇష్టానుసారం సెక్యూరిటీ గార్డు పోస్టులు భర్తీ చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. దీంతో విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యేతో కలిసి వాహనాల్లో వారు ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయానికి చేరుకున్నారు. రోగులు, బంధువుల మధ్యే ఎమ్మెల్యే సెక్యూరిటీ సూపర్‌వైజర్‌లతో వాగ్వాదానికి దిగారు. తమ వర్గానికి ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెద్దాసుపత్రిలో మంత్రి భరత్‌కు ఎంత వాటా ఉందో.. కోడుమూరు ఎమ్మెల్యేగా తనకూ అంతే వాటా ఉందని అన్నారు.
తాము కోరినప్పటికీ పోస్టులు ఇవ్వకుండా మంత్రి భరత్ చెప్పిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ సమయంలో ఈగల్ హంటర్ ప్రతినిధులు లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్విచ్‌ఆఫ్ వచ్చింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే అక్కడికి రప్పించారు. ‘లెక్క ప్రకారం మాకు దక్కాల్సిన పోస్టులు మాకు ఇప్పించాల్సిందే’ అంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు.


