కీలక ప్రజాప్రతినిధికి కలెక్షన్ ఏజెన్సీగా మారిన ఏపీఎంఎస్‌ఐడీసీ
ఆయన్ని ప్రసన్నం చేసుకుని వస్తేనే ఆర్డర్లు ఇస్తామంటున్న అధికారులు
ప్రజాప్రతినిధి, అధికారుల ధనదాహంతో హడలెత్తిపోతున్న కాంట్రాక్టర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)ని ప్రభుత్వ పెద్దలు కలెక్షన్ ఏజెన్సీగా మార్చేశారు. వైద్యశాఖలో రూ.వేలకోట్ల విలువైన 108, 104 కాంట్రాక్ట్‌ను టైలర్ మేడ్ నిబంధనలతో అస్మదీయ సంస్థకు అడ్డదారుల్లో కట్టబెట్టేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. ఒక కీలక ప్రజాప్రతినిధి ఎంఎస్‌ఐడీసీపై వలవేశారు. టెండర్లలో పాల్గొనే సంస్థలు, వివిధ సరఫరాలు చేసే సంస్థలకు స్కై ట్యాక్స్ వేస్తున్నారు.
5–10 శాతం ఇవ్వాల్సిందే!
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో పనిచేసిన ఓ అధికారి డిప్యుటేషన్‌పై ఎంఎస్‌ఐడీసీకి చేరుకున్నారు. ఆయన కీలక ప్రజాప్రతినిధికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా ఆస్పత్రులకు సరఫరా చేయాల్సిన మందులు, సర్జికల్స్, పరికరాల రేట్ కాంట్రాక్టులు ఉంటాయి. వైద్యశాఖలోని వివిధ విభాగాల నుంచి ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ వస్తే కాంట్రాక్టు సంస్థలకు పర్చేజింగ్ ఆర్డర్ (పీవో) ఇస్తే సరఫరా చేసేస్తాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న పరికరాలకు పీవో ఇవ్వడానికి ముందు కాంట్రాక్టర్లు వెళ్లి స్కై ట్యాక్స్ కట్టేలా డీల్ చేసుకోవాలని సదరు అధికారి నిర్దేశిస్తున్నట్లు సమాచారం.
లేదంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తుండటంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులను కలుస్తున్నారు. వారు ఏకంగా 5 నుంచి 10 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. నెల రోజుల కిందట సెకండరీ హెల్త్ పరిధిలోని ఆస్పత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, మరికొన్ని విభాగాల్లో పలు పరికరాల సరఫరాకు ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ వచి్చంది. ఈ వస్తువులన్నీ రేట్ కాంట్రాక్టులో ఉన్నాయి. వీటికి రూ.40 కోట్ల వరకు అవుతుందని ఎంఎస్‌ఐడీసీ ఎక్విప్‌మెంట్ విభాగం లెక్కించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పీవోలు ఇవ్వడానికి ముందే స్కై ట్యాక్స్ సంగతి తేల్చాలని కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న అధికారి కాంట్రాక్టర్లకు చెప్పినట్టు తెలిసింది.
దీంతో పలువురు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబం«ధించిన ప్రైవేట్ వ్యక్తులను కలిసి మూడు నుంచి ఐదుశాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి అదనంగా మరికొంత కమీషన్ ఇవ్వాల్సిందేనన్న ఎంఎస్‌ఐడీసీ అధికారుల డిమాండ్‌కు కూడా కాంట్రాక్టర్లు అంగీకరించినట్టు తెలిసింది. అధికారులు, కీలక ప్రజాప్రతినిధి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాక, అనూహ్యంగా ఆరి్థకశాఖ రూ.ఏడుకోట్లకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచి్చంది. దీంతో ప్రస్తుతానికి సరఫరా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వెల్లడైంది.
ఆరి్థక శాఖ బీఆర్‌వో ఇస్తే.. పరికరాలు సరఫరా చేసి కమీషన్లు కీలక నేతకు చేరనున్నాయి. కొద్దినెలల కిందట నిర్వహించిన సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టుల్లోనూ ఆ కీలక ప్రజాప్రతినిధి ప్రైవేట్ సైన్యం అక్రమాలకు పాల్పడింది. వీరి డైరెక్షన్‌లోనే పక్క రాష్ట్రంలో టెరి్మనేట్ అయిన సంస్థలకు ఎంఎస్‌ఐడీసీ అధికారులు శానిటేషన్ కాంట్రాక్టును కట్టబెట్టేశారు.
నన్ను పట్టించుకోండి..
ఒక నామినేటెడ్ పోస్ట్‌లో కొనసాగుతున్న రాజకీయ నాయకుడు కార్పొరేషన్‌లో అందినకాడికి దండుకోవాలని ప్రయతి్నస్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వారిద్వారా కాంట్రాక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులపై డబ్బు కోసం ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గతంలో నామినేటెడ్ పదవిలో కొనసాగిన వారెవరూ కార్పొరేషన్ సాధారణ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేవారు కాదు.
ఇప్పుడు ఈయన మాత్రం ప్రతిదీ తనకు తెలిసే జరగాలని అధికారులు, సిబ్బందికి అలి్టమేటం ఇచ్చారు. ఇలా ఓ వైపు కీలక ప్రజాప్రతినిధి, మరోవైపు నామినేటెడ్ నేత, ఇంకోవైపు అధికారుల కమీషన్ల దాహానికి కాంట్రాక్టర్లు హడలెత్తిపోతున్నారు. అడిగినంత కమీషన్ ఇవ్వడానికి అంగీకరించని పలు మల్టీ నేషనల్ కంపెనీలను సైతం అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెలల తరబడి కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నా బిల్లులు, పీవోలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.


