సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు అందించారు. అనంతరం లోక్‌భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలను పప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాల్ని గవర్నర్‌కు వివరించాం. ప్రజలను నిరసనలు సహా ఆధారాలతో గవర్నర్‌కు అందించాం. ప్రభుత్వం బాధ్యతగా ఉండకపోతే ప్రజలు జీవించలేరు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య, విద్యను అందించాలి. వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే.. ఇక ప్రభుత్వం ఎందుకు? ఒక విజన్‌తో మెడికల్ కాలేజీలను తెచ్చాం. అన్నీ సర్వీసులు ఉండేలా మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. ఉచితంగా సూపర్, మల్టీ స్పెషాలిటీ సేవలుంటాయి. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా మెడికల్ కాలేజీలను తెచ్చాం.
మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే అతిపెద్ద స్కాం. ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?.కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరెలా ఇస్తారు?.ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా? దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదు’ అని స్పష్టం చేశారు.
విజన్ అంటే ఇది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక విజన్‌తో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిపార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేయడం,ఆ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొని రావడం,మెడికల్ కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్ సైతం అందుబాటులోకి వస్తుంది. టీచింగ్ హాస్పిటల్ అంటే ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఉచితంగా సూపర్,మల్టీ స్పెషాలిటీ సేవలుంటాయి. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా ఉంటుంది. వీటివల్ల సమీప ప్రైవేట్ ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయలేవు. దీనివల్ల మన పిల్లలు బాగుపడతారు.దీని వల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు. మన పిల్లల తల్లిదండ్రులు. అలాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే.. టీచింగ్ హాస్పిటల్స్ ప్రైవేట్ పరం అవుతాయి. పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం. వాటిని పంచుకుంటారని వైఎస్ జగన్ అన్నారు.



