సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్‌కు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధమే లేదు. తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది..
ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్‌పర్ట్స్(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం.
వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది.
గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు.


